ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్ర ఆదాయం ఉద్యోగుల జీతాలకే సరిపోతుంది అని ముఖ్యమంత్రి పెట్టిన శ్వేతపత్రం వాస్తవవిరుద్ధమని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. యూటీఎఫ్ 52వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ సంఘ జిల్లా కేంద్ర కార్యాలయంలో సంఘ పతాకావిష్కరణ కార్యక్రమం జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ రుద్రాక్షి ఆధ్వర్యంలో నిర్వహించారు. గోపీమూర్తి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన 12వ పీఆర్‌సీ 2023 జూలై 1నుంచి అమలు చేయాల్సి ఉండగా, ఇంతవరకు అమలు చేయకపోవడం వల్ల 3 సంవత్సరాల కాలపరిమితి వృథా అయిందన్నారు. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండగా, ప్రభుత్వం కేవలం ఒక్క డీఏ మాత్రమే ఇచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. సరెండర్ లీవ్‌ల మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేయకపోగా, వాటిపై ఆదాయపు పన్ను కూడా వసూలు చేశారన్నారు. పీఆర్‌సీ కమిషనన్ ఏర్పాటు చేసి, మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలు, ఇతర ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రవికుమార్ రుద్రాక్షి మాట్లాడుతూ సీనియర్ ఉపాధ్యాయులు కూడా టెట్ పరీక్ష పాస్ అవ్వకపోతే 2028 తర్వాత ఉద్యోగాల నుంచి తొలగించాలనే నిర్ణయం చాలా ఆందోళనకరమన్నారు. జిల్లా అధ్యక్షురాలు బి.సుభాషిని, యూటీఎఫ్ నాయకులు ఎస్ సుధారాణి, జీవీ రంగమోహన్, నంబూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


