గంధకంతో సిరుల పంట | - | Sakshi
Sakshi News home page

గంధకంతో సిరుల పంట

Apr 9 2026 7:35 AM | Updated on Apr 9 2026 7:35 AM

చింతలపూడి: సాధారణంగా రైతులు పంటలకు ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్‌ వాడకంపైనే దృష్టి సారిస్తుంటారు. కానీ, మొక్కల సమగ్ర ఎదుగుదలకు, నాణ్యమైన దిగుబడికి ఈ మూడింటితో పాటు గంధకం నాలుగో ముఖ్యమైన పోషకమని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో సాగయ్యే తోట పంటలకు గంధకాన్ని అందించడం ద్వారా ఊహించని రీతిలో అధిక దిగుబడులు సాధించవచ్చని స్పష్టం చేస్తున్నారు. మెట్ట ప్రాంతంలో రైతులు ఉద్యాన పంటలను ఎక్కువగా పండిస్తుంటారు. అయితే ఉద్యాన పంటల్లో గంధకం వాడకం వల్ల 25 శాతం దిగుబడి పెరుగుతుందని ఉద్యానవన శాఖాధికారి ఎండీ షాఫియ ఫర్‌హీన్‌ తెలిపారు.

మొక్కల పెరుగదలలో కీలక పాత్ర

మొక్కల్లో పత్రహరితం పెరగడానికి, ప్రోటీన్ల తయారీకి గంధకం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం పోషకమే కాకుండా, మొక్కలలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఆయిల్‌ పామ్‌ వంటి పంటల్లో నూనె శాతాన్ని పెంచుతుంది. పండ్ల తోటల్లో పండ్ల పరిమాణం, రంగు, రుచి నాణ్యతను మెరుగుపరుస్తుంది. గంధకం వాడటం వల్ల పండ్లు కోత తర్వాత ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఉద్యానవన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆయిల్‌ పామ్‌ గెలల బరువు పెరుగుతుంది, నూనె శాతం గణనీయంగా వృద్ధి చెందుతుంది.కొబ్బరికాయ పరిమాణం పెరగడంతో పాటు, కొబ్బరి పీచు నాణ్యత మెరుగుపడుతుంది. నిమ్మ, బత్తాయి సిట్రస్‌ జాతి పంటల్లో రసం శాతం పెరుగుతుంది, తోలు మందం తగ్గుతుంది.అరటి గెల బరువు పెరగడమే కాకుండా, కాయలు త్వరగా పండకుండా నిల్వ ఉంటాయి. మామిడిపూత రాలడం తగ్గుతుంది. కాయ నాణ్యత పెరిగి ఎగుమతులకు అనుకూలంగా మారుతుంది. మొక్కలో గంధకం లోపిస్తే మొదట లేత ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. మొక్కల పెరుగుదల కుంటుపడి, కాండం బలహీనంగా మారుతుంది. రైతులు కేవలం యూరియా, డీఏపీలపైనే ఆధారపడకుండా, గంధకం వంటి ద్వితీయ శ్రేణి పోషకాలను వాడినప్పుడే ఉద్యాన పంటల్లో ఆశించిన దిగుబడి వస్తుందని ఉద్యాన శాఖ అధికారులు సూచిస్తున్నారు.

గంధకంతో ఉపయోగాలెన్నో

క్లోరోఫిల్‌ ఉత్పత్తి

గంధకం క్లోరోఫిల్‌ ఉత్పత్తికి సహాయపడుతుంది, ఇది మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేయడానికి అవసరం. కొన్ని విటమిన్ల ఉత్పత్తికి గంధకం చాలా అవసరం.

పండ్ల నాణ్యత

పండ్ల రుచి, వాసన, రంగును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు, ఉల్లిపాయ, వెల్లుల్లిలో వాటి ప్రత్యేకమైన వాసన గంధకం వల్లనే వస్తుంది.

తెగుళ్లు, వ్యాధుల నివారణ

కొన్ని సందర్భాల్లో, గంధకం శిలీంద్ర నాశినిగా, కొన్ని రకాల తెగుళ్లను నివారించడానికి కూడా ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.

లభ్యత ఇలా..

గంధకం మనకు సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌, అమ్మోనియ సల్ఫేట్‌, జిప్సం, సల్ఫేట్‌ ఆఫ్‌ పొటాష్‌, జింక్‌ సల్ఫేట్‌ , మెగ్నీషియం సల్ఫేట్‌, మాంగనీస్‌ సల్ఫేట్‌, ఐరన్‌ సల్ఫేట్‌ల రూపంలో మార్కెట్లో దొరుకుతుంది. గంధకం నేలలో వాడినప్పుడు దానికి సంబంధించిన ఆమ్ల స్వభావం మన నేలకు ఉదజని సూచిక 6 నుంచి 6.5 వరకు వచ్చే సరికి నేలలోని అన్ని రకాల పోషకాలు మొక్కకు అందుబాటులోకి వస్తాయి.

చౌడు భూముల్లో

చౌడు భూములను బాగు చేసుకోవడానికి నేలలోని ఉదజని సూచికను బట్టి ఎకరానికి 500 కేజీల జిప్సంను వాడినట్లయితే దిగుబడి బాగా పెరుగుతుంది. గంధకం వాడకంతో పంట నాణ్యత, పరిమాణం, గింజల్లో నూనె శాతం పెరుగుతుంది.

ఆదాయ పెరుగుదల

ఉద్యాన పంటల్లో తక్కువ ధరలో అందుబాటులో ఉండే జిప్సం, సల్ఫేట్‌ ఆఫ్‌ పొటాష్‌ 50 శాతం, సల్ఫర్‌ గుళికలు 90 శాతం వాడితే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. కాపుకాసే తోటలైతే 500 గ్రాములు, వయస్సును బట్టి 5 నుంచి 10 కేజీల జిప్సం సంవత్సరానికి రెండు సార్లు వేసుకున్నట్లయితే దిగుబడులు పెరుగుతాయి. ఇతర పండ్ల తోటలకు, కూరగాయల తోటలకు అయితే దుక్కిలో ఎకరానికి నేల స్వభావాన్ని బట్టి 300 నుంచి 500 కేజీల జిప్సంను వాడుకోవచ్చు.

ఎండీ షాఫియ ఫర్‌హీన్‌

ఉద్యానవన శాఖాధికారిణి

ఉద్యాన పంటల్లో అత్యధిక దిగుబడులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement