పాపమా? ప్రకృతి శాపమా?

Sakshi Editorial On Floods In India

చినుకు తడి కోసం నేల నోరు విప్పార్చుకొని ఎదురుచూస్తున్న సమయంలో, వాన కాస్తా వరదై వస్తే? మీద పడ్డ కొండచరియలతో, ముంచెత్తిన జలవిలయంతో... తాగేందుకు గుక్కెడు నీళ్ళు, ఉండేందుకు గజం జాగా లేని జనం కన్నీటి వరదలో కొట్టుకుపోతుంటే? అది ప్రకృతి శాపమా? ఏళ్ళ తరబడి మనిషి చేస్తున్న పాపానికి ప్రతిరూపమా? మహారాష్ట్రలో కొద్దిరోజులుగా భయపెడుతున్న వరదలు చూస్తుంటే ఎన్నెన్నో ప్రశ్నలు. వాటి జవాబుల్లో వాస్తవాలు వెక్కిరిస్తున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే కాదు... మధ్యప్రదేశ్, కర్ణాటక, గోవా, అలాగే తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో ప్రజల కన్నీరు వరదలవుతోంది. కళ్ళు తెరిచి చూడాల్సిన మరో నిజాన్ని మళ్ళీ గుర్తుచేస్తోంది. 

కొద్ది రోజుల క్రితం నైరుతి రుతుపవనాలు దేశమంతటా పూర్తిగా విస్తరించడంలో, ఉత్తరాదిన అనేకచోట్ల వానలు పడడంలో ఆలస్యమైందని అనుకున్నాం. వడగాడ్పుల తర్వాత తీరా ఇప్పుడు కనివిని ఎరుగని వానలు, వరదలు కష్టాలలోకి నెట్టాయి. వాతావరణ రీత్యా తీవ్ర అనుభవాలు ఎదురయ్యాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్‌లలో ఆగకుండా వర్షాలు కురిశాయి. హిమాచల్‌లో మెరుపులా వరద మీద పడింది. రుతుపవనాలు ఆలస్యమైన దేశరాజధానిలో ఉన్నట్టుండి, దడదడా ఆకాశానికి చిల్లుపడినంత వర్షం! తడిసి ముద్దయి, జనజీవనం అతలాకుతలమైన ముంబయ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ ఆరెంజ్‌ ఎలర్ట్‌! ఇక, పడమటి కనుమల్లోని పర్యా టక కేంద్రం మహాబలేశ్వర్‌లో చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఇరవైనాలుగు గంటల్లో 60 సెంటీ మీటర్ల కుంభవృష్టి! మహారాష్ట్రలో రాయగఢ్‌ జిల్లాలో ఎడతెగని వర్షం వల్ల కొండచరియలు విరిగి పడి, 35 మందికి పైగా దుర్మరణం! కొల్హాపూర్, సతారా, సాంగ్లీ, చిప్లున్, రాయగఢ్, రత్నగిరి ప్రాంతాల్లో వరద బీభత్సంతో ఆ రాష్ట్రంలో 890 గ్రామాలు దెబ్బతిన్నాయి. కొల్హాపూర్‌ వద్ద పంచగంగ నది గడచిన 2019 నాటి వరదల కన్నా మించి పోటెత్తుతోంది. కొల్హాపూర్‌ మొత్తం వారం రోజులకు పైగా నీటిలోనే గడిపిన ఆనాటి కన్నా నేటి పరిస్థితి దారుణంగా ఉంది. అధికారిక లెక్కల ప్రకారం మహారాష్ట్రలో లక్షా 35 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 112 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వంద మంది జాడ తెలియడం లేదు. మూడున్నరవేల దాకా గొడ్డూ గోదా మరణించాయి. జాతీయ, రాష్ట్ర ప్రకృతి వైపరీత్య సహాయక బృందాలతో పాటు సైన్యం, నౌకాదళం రంగంలోకి దిగాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

‘అయితే అతివృష్టి... లేకపోతే అనావృష్టి’, వరద ముంపులు మనకూ, మన దేశానికీ కొత్త కావు. భారీ వర్షాలొస్తే – ముంబయ్, చెన్నై, హైదరాబాద్‌ లాంటి నగరాల్లో అనేక ప్రాంతాలు ముంపునకు గురి కావడం ఇప్పుడు తరచూ ఓ ఆనవాయితీ. ప్రణాళికంటూ లేని పట్టణీకరణ, డ్రైనేజీ వ్యవస్థలో లోపాలు, వాటికి తోడు నియంత్రణ లేని నిర్మాణాలు, చెరువుల కబ్జా, చెట్ల నరికివేత లాంటి అనేకం మహానగరాల ముంపు లాంటి విపరిణామాలకు కారణం. కానీ, రుతుపవనాలు క్రమం తప్పడం మొదలు ఉష్ణోగ్రతల్లో మార్పుల లాంటివి మాత్రం మన పాపానికి సరికొత్త ప్రతీకలు. వాటికి కారణమైన బాధ్యత లేని పారిశ్రామికీకరణ, జల – వాయు కాలుష్యం, కర్బన ఉద్గారాలు వగైరా మన స్వయంకృతాలే! ఆ పర్యవసానమే ఇప్పుడు చూస్తున్న వాతావరణ సంక్షోభాలు. 

ఆ మాటకొస్తే, మనదేశంలోనే కాదు... ఈ జూలైలో ప్రపంచమంతటా ఎన్నో ప్రకృతి విల యాలు చూశాం. యూరప్‌లో వరదలొచ్చాయి. ఎన్నో పట్నాలు మునిగిపోయాయి. ఒక్క జర్మనీ లోనే 180 మంది చనిపోయారు. బెల్జియమ్, నెదర్లాండ్స్‌ సహా పలు దేశాల్లో వందలమంది జాడ తెలియకుండా పోయారు. శీతల వాతావరణానికి పేరుపడ్డ వాయవ్య అమెరికాలో ఎండలు మండి పోయాయి. కెనడాలో కార్చిచ్చు రేగింది. మాస్కోలో జూన్‌ నెల ఉష్ణోగ్రతలు గత 142 ఏళ్ళ చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరాయి. పాకిస్తాన్‌లోని జకోబాబాద్‌లో 52 డిగ్రీల ఉష్ణోగ్రతతో చెమటలు ధార కట్టాయి. చైనాలో గత వెయ్యేళ్ళలో లేనంత వాన, వరదలు వచ్చిపడ్డాయి. ఒక ప్పుడు పర్యావరణ రీత్యా ప్రమాదం పొంచి ఉందనేవాళ్ళం. కానీ, ఇప్పటికే మనం పెను ప్రమా దంలో పడ్డామని ఈ తాజా సంఘటనలన్నీ చాచికొట్టి మరీ చెబుతున్నాయి. ఒక్కమాటలో – భూతా పోన్నతి, పర్యావరణంలో పెనుమార్పులు ఇప్పుడు సిద్ధాంతాలు కాదు... కళ్ళెదుటి కఠోర సత్యాలు! 

దాదాపు 135 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఈ ఏడాది తొలి ఏడు నెలల్లోనే రెండు పెద్ద తుపానులు (తాక్టే, యాస్‌), హిమాలయాల్లో ఫుట్‌బాల్‌ మైదానాలంత భారీ మంచుదిబ్బలు విరిగిపడడం, వడగాడ్పులు, ప్రాణాలు తీసే వరదలు చూశాం. ఇవన్నీ వాతావరణంలోని విపరీత మార్పుల్నే సూచిస్తున్నాయి. భూతాపోన్నతి వల్ల హిమాలయాల్లోని దాదాపు 10 వేల హిమానీ నదాలు ప్రతి పదేళ్ళకూ వంద నుంచి 200 అడుగుల వంతున కరిగిపోతున్నాయి. అలాగే, మన దేశంలో సగటు ఉష్ణోగ్రత కూడా 0.7 డిగ్రీల సెల్సియస్‌ పెరిగింది. 20వ శతాబ్దం ప్రారంభానికీ, 2018 నాటికీ మధ్యలోనే ఈ ఉష్ణతాపం జరిగింది. మరో ఎనభై ఏళ్ళలో 2100 నాటికి మరో 4.4 డిగ్రీలు పెరుగుతుందని సర్కారు వారే చెబుతున్న మాట. ఈ నవంబర్‌ 1న బ్రిటన్‌లోని గ్లాస్గోలో కీలకమైన ఐక్యరాజ్యసమితి వాతావరణ చర్చలు మొదలవనున్న నేపథ్యంలో ఇవన్నీ మనతో పాటు, మానవాళి మొత్తానికీ ప్రమాదఘంటికలు. ఈ పెను వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి సత్వర, తక్షణ చర్యలు అవసరమంటున్న మేలుకొలుపులు. నిద్ర లేవాల్సింది మనమే! 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top