కాంగ్రెస్‌ వెనుక అదృశ్య హస్తం!

Sakshi Editorial On Congress Party By Vardhelli Murali

జనతంత్రం

కొన్ని సారూప్యతలు కాకతాళీయం కావచ్చు. కొన్ని కాకతాళీయంగా భ్రమింపజేసే ప్రణాళికలు కావచ్చు. 83 సంవత్సరాల వృద్ధుడైన విప్లవ కవి వరవరరావుకు కూడా హైదరాబాద్‌లో క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ చేసుకోవడానికి ముంబై ఎన్‌ఐఏ కోర్టు అనుమతి లభించింది. అయితే ఈ అనుమతి కోసం ఆయన గత ఏడాదిన్నర కాలంగా ప్రయత్నిస్తున్నారట! చంద్రబాబు కూడా క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ కోసం హైకోర్టు నుంచి మెడికల్‌ బెయిల్‌ సంపాదించిన సంగతి తెలిసిందే.

వరవరరావుకు చంద్రబాబు కంటే ఓ వారం రోజుల ముందే కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఆయనకు ఆపరేషన్‌ కోసం ఒక వారం రోజులు మాత్రమే సమయమిచ్చారు. చంద్రబాబుకు ఆ హడావిడి లేదు. న్యాయ స్థానం ఉదారంగానే సమయాన్నిచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ కావడానికి ఒక రోజు ముందే ఆయన హైదరాబాద్‌ చేరుకున్నారు. సరిగ్గా ఎన్నికల ప్రచారం ముగిసేరోజు దాకా ఆయనకు బెయిల్‌ గడువు వర్తిస్తుంది. భలే టైమింగ్‌! రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణ వ్యవహారాల్లో బాబు ఆసక్తి చావలేదు. ఆయనకూ, ఆయనకు కావలసిన వారికీ అక్కడ విస్తారంగా ఆస్తులుండటం అందుకు కారణం కావచ్చు.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఓట్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నించి ఆయన దొరికిపోయిన సంగతి మనకు తెలిసిందే. అలా దొరక్కపోయి ఉన్నట్లయితే డబ్బులు వెదజల్లి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చేయాలని కుట్ర పన్నారట! ప్రభుత్వానికి ఉప్పందడంతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోగలిగింది. హైదరాబాద్‌ మీద ఏపీకి పదేళ్లపాటు ఉన్న రాజధాని హక్కుల్ని వదులుకునేందుకు సిద్ధపడటంతో కేసీఆర్‌ ఈ కేసులో చంద్రబాబును వదిలేశారు. రెండోసారి అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్‌తో జట్టుకట్టి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నించి భంగ పడ్డారు. ఆయన ఆసక్తికి తగినట్టుగానే ఆయన ప్రస్తుత మెడికల్‌ బెయిల్‌ టైమింగ్‌ కూడా బాగా కుదిరింది.

బెయిల్‌ రావడానికి రెండు రోజుల ముందు తెలంగాణా టీడీపీ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్‌ను చంద్రబాబు ములాఖత్‌కు పిలిపించుకున్నారు. ఆ భేటీ తర్వాత జ్ఞానేశ్వర్‌ హైదరాబాద్‌కు వెళ్లి ప్రెస్‌మీట్‌ పెట్టి పార్టీకి రాజీ నామా చేశారు. ఎన్నికల్లో పార్టీ పోటీ చేయకుండా టీడీపీ అభిమానుల ఓట్లు కాంగ్రెస్‌కు వేయించాలని చంద్రబాబు ఆయనకు చెప్పారట! ఈ వైఖరి నచ్చని జ్ఞానేశ్వర్‌ తీవ్ర విమర్శలు చేస్తూ పార్టీ నుంచి తప్పుకున్నారు. ఇదే సమయానికి తెలంగాణ కాంగ్రెస్‌ వైఖరిలో కూడా మార్పులు రావడం మొదలైంది.

రాయ్‌పూర్‌ తీర్మానం మేరకు బీసీలకు, మహిళలకు, యువతరానికి టిక్కెట్ల పంపిణీలో పెద్ద పీట వేయబోతున్నట్లు ఊదరగొట్టారు. బీసీలకు 34 సీట్లను కేటాయించబోతున్నట్టు రాష్ట్ర నాయకత్వం పలుమార్లు ప్రకటించింది. కానీ కేటాయింపు దగ్గరికొచ్చే సరికి మొండి చేయి చూపెట్టారు. ఏపీ రాజ కీయాల్లో బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్ర బాబు హెచ్చరిస్తుంటారు. తెలంగాణా కాంగ్రెస్‌ వాళ్లు మాత్రం నిజంగానే బీసీల తోకలు కత్తిరించేశారు. ఇప్పటివరకు ప్రకటించిన 100 సీట్లలో 20 సీట్లు మాత్రమే బీసీలకు ప్రకటించారు. అందులో నాలుగు సీట్లు హైదరాబాద్‌ పాతబస్తీ లోనివి! డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేని స్థానాలు. అంటే నికరంగా బీసీలకు 16 సీట్లను మాత్రమే కాంగ్రెస్‌ ఇచ్చి నట్టు! ప్రకటించవలసిన సీట్లు 19. అవన్నీ బీసీలకు ఇస్తేనే కాంగ్రెస్‌ మాట నిలబెట్టుకున్నట్టు! కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం మరో నాలుగు కంటే ఎక్కువ సీట్లు బీసీలకు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు.

బీఆర్‌ఎస్‌ పార్టీ దూరం పెట్టడంతో అలిగి ఆఫీసుల్లో కూర్చున్న కమ్యూనిస్టు ముత్తయిదువలను కాంగ్రెస్‌ వాళ్లు బొట్టు పెట్టి మరీ పిలుచు కొచ్చారు. కనీసం చెరో రెండు సీట్లను వాయనంగా ఇస్తామని చివరిదాకా నమ్మబలికారు. ఆఖరు నిమిషంలో చెరొకటే ఇస్తామని చెట్టెక్కడంతో అవమానంగా భావించిన సీపీఎం కాంగ్రెస్‌తో తెగదెంపులు ప్రకటించింది. సీపీఐ మాత్రం ఆ ఒక్కటి చాలనే నిర్ణ యానికి వచ్చినట్టు సమాచారం. పార్టీలో దీర్ఘకాలంగా పని చేస్తున్న వారికీ, యువనేతలకూ టిక్కెట్ల పంపి ణీలో చేయిచ్చినట్టు వార్తలు వచ్చాయి. వారికి బదులుగా దాదాపు 35 మంది పారాచూటర్లకు (అప్పుడే పార్టీలోకి వచ్చినవారు) టిక్కెట్లు కేటాయించారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుపు గుర్రాలనే రంగంలోకి దించాలనే నిర్ణ యంతో రాయ్‌పూర్‌ డిక్లరేషన్‌ను పక్కన పెట్టాల్సి వచ్చిందని కొందరు కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. అదే నిజమైతే పదేళ్లుగా అధికారంలో వుండి బాగా నునుపుదేలి ఉన్న బీఆర్‌ఎస్‌ గుర్రాలను ఈ కొత్త గుర్రాలు ఢీ కొట్ట గలుగుతాయా? కాంగ్రెస్‌ నేతలు చెప్పుకుంటున్నట్టు వారికి అనుకూలమైన గాలి వీస్తున్నట్టయితే బలిసిన అభ్యర్థులు దేనికి? రాయ్‌పూర్‌ డిక్లరే షన్‌కు కట్టుబడి ఉండవచ్చు కదా! అభ్యర్థుల ఎంపికకు సంబంధించినంత వరకు కాంగ్రెస్‌ పార్టీ వివరణలు సంతృప్తికరంగా లేవు.

వారి నిర్ణయాలను వారే తిరగదోడటం వెనుక ఇంకేదో బలమైన కారణం ఉన్నట్టు తోస్తున్నది. పోస్ట్‌ ఎలక్షన్‌ ‘అవసరాలను’ కూడా దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు. 1994 ఎన్నికలకు ముందు తెలుగుదేశం అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు–రామోజీ ద్వయం ఈ రకమైన వ్యూహాన్ని అమలుచేసింది. వెన్నుపోటు ఘట్టంలో ఈ వ్యూహం వారికి ఉపకరించింది.

‘గెలుపు గుర్రాల’ ఎంపికలో పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు సర్వేలను ప్రామాణికంగా తీసుకుంటున్నామని కాంగ్రెస్‌ నేతలు చెప్పుకొంటున్నారు. రాయ్‌పూర్‌ డిక్లరేషన్‌ తయారు చేయడంలో కూడా సునీల్‌ పాత్ర ఉందనే ప్రచారం ఉన్నది. తన డిక్లరేషన్‌కు విరుద్ధంగా తానే అభ్యర్థులను ప్రతిపాదిస్తాడా? ఇంకేదైనా కారణం ఉన్నదా? సునీల్‌ కనుగోలు మనవాడే! బళ్లారిలో పుట్టి పెరిగిన తెలుగువాడు.  ఆంధ్రరాష్ట్రంతో సామాజిక బంధాలు – బాంధవ్యాలు ఉన్నవాడేనని చెబుతారు.

రాహుల్‌ ‘భారత్‌ జోడో’ యాత్ర రూపకల్పనలో కూడా ఆయన పాత్ర ఉన్నదట! తెలంగాణ ఎన్నికల తర్వాత ఏపీలో తెలుగుదేశం కూటమి తరఫున పనిచేయాలనే ఆలోచన కూడా ఉన్నదంటారు. ఇందులో నిజానిజాలు ఎట్లా ఉన్నా కాంగ్రెస్‌ పార్టీ తన మార్గదర్శకాలను తానే ఉల్లంఘించడం కోసం సునీల్‌ కనుగోలు పేరును వాడేసుకుంటున్నది.

చంద్రబాబు మెడికల్‌ బెయిల్‌పై విడుదలై హైదరాబాద్‌కు చేరుకున్న రోజున జూబ్లీహిల్స్‌లోని ఓ క్లబ్‌లో ఒక భారీ పార్టీ జరిగిందట! సినిమా రంగానికి, రాజకీయ రంగానికి చెందిన సుమారు 150 మంది బాబు అనుయాయులు ఈ పార్టీలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో తామంతా కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలవాలని అందులో చర్చ జరిగిందట! చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కొందరు ఛోటా, బడా నేతలు ‘సెటిలర్లందరూ ఈసారి కాంగ్రెస్‌కే ఓటేస్తార’ని బడాయి కబుర్లు చెప్పడం వింటున్నాము. వాస్తవం ఏమిటంటే ఆంధ్ర సెటిలర్లలో చంద్రబాబు సామాజిక వర్గం వారి జనాభా కేవలం ఇరవై శాతం మాత్రమే. మిగిలిన ఎనభై శాతం జనాభాలో అత్యధికులు ఈ వర్గం రాజకీయ అభిప్రాయాలకు పూర్తి విరుద్ధ అభిప్రా యాలతో ఉంటారు. కానీ సెటిలర్లందరి తరఫున వీరు చేస్తున్న ప్రకటనలు కాంగ్రెస్‌ పార్టీ కొంప ముంచే అవకాశాలే ఎక్కువ.

25 అసెంబ్లీ సీట్లున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రాంతంలో బీఆర్‌ఎస్‌ బాగా బలపడిందని జాతీయ సర్వే సంస్థలు చెబుతున్నాయి. సీఎస్‌డీఎస్‌కు చెందిన సంజయ్‌ కుమార్‌ ‘ఇండియా టుడే’ ఛానల్‌లో మాట్లాడుతూ మరోసారి తెలంగాణలో బీఆర్‌ఎస్‌ గెలవబోతున్నట్టు చెప్పారు. ‘టైమ్స్‌ నౌ’లో నావికా కుమార్‌ కూడా తమ సర్వేలో అటువంటి ఫలితమే వచ్చిందని చెప్పారు. ఒక్క సీ–ఓటర్‌ మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ విజయావకాశాలను అంచనా వేస్తున్నది. కానీ ఆ సంస్థ ట్రాక్‌ రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు.

ప్రభుత్వ వ్యతిరేకత కొంత మేరకు కాంగ్రెస్‌ పార్టీకి ఉపకరి స్తున్న మాట యథార్థమే. కానీ విజయ తీరాలను చేరడానికి కాంగ్రెస్‌ అనేక అడ్డంకులను అధిగ మించవలసి ఉన్నది. కాంగ్రెస్‌ పార్టీని అభిమానించే బీసీల్లో ఏర్పడిన అసంతృప్తిని తొలగించ వలసి ఉన్నది. అంతర్గత కుమ్ము లాటలను అధిగమించవలసి ఉన్నది. అన్నిటినీ మించి కాంగ్రెస్‌ గెలిస్తే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరన్న నమ్మకం ఓటర్లకు కలగాలి. అప్పుడు కూడా బీజేపీ ఓటు శాతం సింగిల్‌ డిజి ట్‌కు పరిమితమైతేనే కాంగ్రెస్‌ బలమైన పోటీదారుగా రంగంలో ఉంటుంది. ఈలోగా బిడ్డను కనా ల్సిన తెలంగాణ కాంగ్రెస్‌కు బదులుగా చంద్రబాబు వర్గం తానే పురిటి నొప్పులు పడతానంటే ఎటువంటి ప్రయోజనమూ ఉండదు.

వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top