బాబుగారి ఢిల్లీ యాత్ర!

Sakshi Editorial On Chandrababu Delhi Tour

జనతంత్రం

‘‘ఏ తీరుగ నను దయజూచెదవో ఇన వంశోత్తమ రామా!.... క్రూర కర్మములు నేరకజేసితి నేరములెంచకు రామా...’’ ఈ భక్త రామదాసు కీర్తన తెలుగు వారందరికీ తెలిసినదే! తెలియక చేసిన నా తప్పుల్ని మన్నించి నా మీద దయ చూపమని శ్రీరామచంద్రుని చరణారవిందాల ఎదుట రామదాసు ప్రార్థి స్తాడు. సరిగ్గా ఇదే భావాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎదుట ప్రకటించాలని మన చంద్రబాబు ఆరాటపడుతున్నారు. అధికారం కోల్పోయిన దగ్గరి నుంచి మోదీ దర్శన భాగ్యం కోసం, రామదాసు సన్నివేశం కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు.

అప్పుడొకసారి స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా జరిగిన సమావేశంలో మోదీకి చంద్రబాబు ఎదురుపడ్డారు. పూజకు వీలు చిక్కలేదు కానీ, హారతి కళ్లకద్దుకునేంత ఘడియ సమయం మాత్రం దొరికింది. అప్పుడాయన ప్రధాని వెళ్లే మార్గం పక్కన తొంభై డిగ్రీల లంబకోణంలో నిలబడి ఉన్నారు. వరుసగా అందర్నీ పలకరించినట్టే సీనియర్‌ నాయకులైన బాబును కూడా ప్రధాని పలకరించారు. వెంటనే తన మనసు లోని మాటను చంద్రబాబు బయటపెట్టారు. ‘మీరు ఏకాంత సమయమిస్తే చాలా విషయాలు మనవి చేసుకుంటాన’ని సిగ్గుపడకుండా అడిగేశారు. సరే చూద్దామంటూ ప్రధాని వెళ్లిపోయారు.

అప్పటినుంచి ప్రధాని ఏకాంత సేవకు ఎప్పుడు సమయం దొరుకుతుందా అని బాబు ఎదురు చూడని క్షణం లేదు. ఈమధ్య బాహాటంగానే ప్రధాని గుణగణాలను ప్రస్తుతించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. మామూలుగా పొగడలేదు. శ్రీ రఘువీర గద్యానికి ఇంచుమించు సరిసాటిగా భజించారు. అదేమిటి... ఎన్నికలకు ముందు ప్రధానమంత్రిని అన్ని బూతులు తిట్టిన నోటితోనే ఎలా పొగుడుతున్నారనే అనుమానం ఎవరికైనా వస్తే వారు అమాయకుల కిందే లెక్క! చంద్రబాబులో ఉన్న చతుష్షష్టి కళల గురించి అవగాహన లేనివారికిందే లెక్క! రంగు మార్చుకొని ఊసరవెల్లి కావడం తొండకు మాత్రమే తెలుసా? ఆయనక్కూడా తెలుసు. గోడ మీద కూర్చొని ఎటు కుదిరితే అటు దూకడం పిల్లి మాత్రమే నేర్చిన విద్యా? ఆయన కూడా నేర్చారు. అందువల్ల ఆయన ఏం చేసినా ఆశ్చర్యపడకూడదు. నేతి బీరకాయలో నెయ్యి కోసం వెతకడం, బాబు రాజకీయంలో నీతి కోసం వెతకడం – రెండూ అవివేకమైన పనులే.

ఇన్నినాళ్లు వేచిన బాబు హృదయం శనివారం నాడు ఎగసిఎగసి పడిందట. అదే ఊపులో ఢిల్లీకి ఆయన ఎగిరివెళ్లారు. ప్రధానమంత్రి మోదీతో, అమిత్‌ షాతో చంద్రబాబు సమావే శాలను ఏర్పాటు చేయడం కోసం ఆయన లాబీయిస్టులు రెండు మూడేళ్లుగా చేయని ప్రయత్నం లేదు. అయినా ఖరారు కాని అపాయింట్‌మెంట్‌ కొన్ని ‘అదృశ్యశక్తుల’ ఎంట్రీతో ఎట్టకేలకు ఖరారైందట! ఈ మేరకు శనివారం రాత్రి అమిత్‌ షాను చంద్ర బాబు కలిశారు. మోదీ టైమ్‌ కోసం ఇంకా ప్రయత్నాలు జరుగు తున్నాయి.

ఒడిషాలో జరిగిన ఘోరమైన రైలు ప్రమాదం నేపథ్యంలో ఈ అపాయింట్‌మెంట్‌ విషయం ఏమవుతుందో చివరిదాకా చెప్పలేము. కానీ, ఇన్నాళ్లు బాబుకు టైమివ్వని బీజేపీ నాయకత్వం ఇప్పుడెందుకు ఇచ్చినట్టు? చక్రం తిప్పిన అదృశ్యశక్తులెవరు? ఇప్పుడు ఢిల్లీ తెలుగు సర్కిల్స్‌లో ఇదే చర్చనీయాంశం. బీజేపీ కేంద్ర నాయకత్వంతో బాబు చర్చించాలనుకున్న రాజకీయ ఎజెండాకు తోడు ఇప్పుడొక అత్యవసర కర్తవ్యం వచ్చి పడింది.

తనకూ, తన పార్టీకీ, యెల్లో కూటమికీ సారథిగా, సచివునిగా భావించే రామోజీరావు యథేచ్ఛగా చట్టాన్ని ఉల్లంఘిస్తూ చిక్కుల్లో పడ్డారు. ఇప్పుడా యన్ను చిక్కు ల్లోంచి బయట పడేయడానికి ప్రయత్నించడం బాబుకు తక్షణా వసరం. ఈ కర్తవ్య నిర్వహణ కోసమే ‘అదృశ్య శక్తులు’ కూడా సహకరించాయని సమాచారం.

కేంద్ర చిట్‌ఫండ్స్‌ చట్టం – 1982ను ఉల్లంఘిస్తూ మార్గదర్శి చిట్స్‌ వ్యాపారం చేస్తున్నది. చట్టం ప్రకారం ఏ బ్రాంచి పరిధిలోని చందాదారుల సొమ్ము ఆ బ్రాంచి పరిధిలోని జాతీయ బ్యాంకులోనే డిపాజిట్‌ చేయాలి. అలా చేసినట్లయితే జనం సొమ్ముతో సొంత వ్యాపారం చేసుకోవడం కుదరదు గనుక మార్గదర్శి సంస్థ ఆ చట్ట నిబంధనల్ని పాటించడం లేదు.

ఆ నిబంధనల్ని పాటించాల్సిందేనని ఏపీ చిట్స్‌ రిజిస్ట్రార్‌ స్పష్టం చేయడంతో గత డిసెంబర్‌ నుంచి కొత్త చిట్స్‌ను సంస్థ నిలిపివేసింది. దాంతో మనీ రొటేషన్‌ లేక చిట్‌ పాడుకున్న వారికి డబ్బులు చెల్లించలేకపోతున్నది. ఇప్పటికే పలువురు చందాదారులు సీఐడీకి ఈ విషయంపై ఫిర్యాదులు చేశారు. చందాదారుల హక్కుల పరిరక్షణ కోసం మార్గదర్శి చరాస్తులను అటాచ్‌ చేయడానికి ఏపీ ప్రభుత్వం అనుమతిని సీఐడీ కోరింది.

ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. చిట్‌ఫండ్స్‌ ఖాతాల్లో ఉన్న నగదు నిల్వలు, మ్యూచువల్‌ ఫండ్స్‌లో దాని పెట్టుబడులు కలిపి 739 కోట్లను అటాచ్‌ చేయడానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ విషయాన్ని న్యాయస్థానానికి నివేదించి తదుపరి చర్యలను చేపట్టడానికి సీఐడీ సన్నాహాలు చేసుకుంటున్నది.

మరోపక్క సీఐడీ నోటీసులకు స్పందించకుండా, దానికి సమాచారం ఇవ్వకుండా మార్గదర్శి ఎమ్‌డీ శైలజా కిరణ్‌ అమె రికా పర్యటనకు వెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లో ఆరో తేదీన విచారణకు హాజరు కావలసిందేనని సీఐడీ మరో నోటీసు ఇచ్చింది. ఇప్పటికే మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ వ్యవహారంలో చట్టాన్ని అతిక్రమించి తలబొప్పి కట్టించుకున్న రామోజీ, చిట్‌ఫండ్స్‌ రచ్చతో తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డట్టయింది.

దాంతో చివరి ప్రయత్నంగా మంచమెక్కి ఆపసోపాలు పడుతూ తన పరిస్థితి కాలమహిమో, జగన్‌ మహిమో తెలియట్లేదని చెబుతూ వీడియోలను విడుదల చేయించుకున్నారు. ఆయన ఆశించినట్టుగా ఎక్కడా ఇసుమంత సానుభూతైనా వ్యక్తం కాలేదు. అయినా మోసానికి బలైన వాడిని చూస్తే అంతో ఇంతో సానుభూతి వ్యక్తమవుతుంది గానీ మోసం చేసినవాడిని చూస్తే సానుభూతి ఎందుకు వస్తుంది? ఇంత చిన్న లాజిక్‌ ఎలా మిస్సయ్యాడో రామోజీ! ఇప్పుడాయనకు గజేంద్ర మోక్షం లాంటి వరం కావాలి.

ఎలా? తన దగ్గరికి శ్రీహరి రాడు.  తాను వైకుంఠానికి వెళ్లలేడు. అందుకని తన దూతగా శిష్యుడు చంద్రబాబును పంపించాలని నిర్ణయించారట! బాబు మొఖం చూడటం ఇష్టంలేని నాయక ద్వయాన్ని ఒప్పించడానికి తన యాభయ్యేళ్ల నెట్‌వర్క్‌లను వాడి ఉంటారు. స్వామికార్యంతో పాటు స్వకార్యం అనుకుంటూ రెండు దస్త్రాలను వెంటబెట్టుకుని బాబు బయల్దేరారు. చట్టాన్ని ఉల్లంఘించిన విషయంలో కేంద్రం చేయగలిగే సాయం ఏమీ ఉండదన్న సంగతి రామోజీకి తెలియంది కాదు.

‘కానూన్‌ కే హాథ్‌ లంబే హోతే హై’ అన్న మాట కూడా ఆయన వినలేదని అనుకోలేము. అయినా ఏదో ఆశ! మిణుకు మిణుకుమంటున్నది. అమిత్‌ షా భేటీలో పనిలో పనిగా తన ముందస్తు ‘వేడుకోలు’ ప్రార్థన కూడా చంద్రబాబు చేసినట్టు భోగట్టా. ఫైబర్‌ నెట్, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణాల్లో ఇప్పటికే దొరికిపోవడం, రాజధాని భూ కుంభకోణంలో దొరికిపోయే పరిస్థితులు ఉండటంతో ఆయన తీవ్ర ఆందోళన పడుతున్నారని తెలుస్తున్నది.

ఇక రెండో దస్త్రం సంగతి. వచ్చే ఎన్నికల్లో జగన్‌ మోహన్‌రెడ్డిని ఎదుర్కోవడానికి జనసేనతోపాటు బీజేపీ కూడా తన వెంట ఉండాలని బాబు వాంఛ. ప్రతిష్ఠాత్మక సంస్థలతో ఆయన వరసగా చేయించుకుంటున్న సర్వేల్లో జగన్‌మోహన్‌రెడ్డి ప్రజామోదం ఎప్పుడూ 53 శాతానికి తగ్గడం లేదు. టీడీపీ, జనసేనలకు కలిపి చూసినా ఇంకా పదమూడు శాతం మైనస్‌లో ఉంటున్నారు.

ఈ గణాంకాల్ని బట్టి చూస్తే వీరికి బీజేపీ తోడైనా కూడా ఫలితాల్లో పెద్ద మార్పేమీ రాదు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమ వెంట ఉంటే ఇప్పటికే తాము ప్రారంభించిన విషప్రచారాలను ఇంకా ఉద్ధృతం చేయవచ్చు. 2014 లాగా ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవచ్చని టీడీపీ ఆరాటపడుతున్నది. ఇది మబ్బుల్లో నీళ్లను చూసి విత్తనాలు వేసుకోవడమే! అయినా అంతకు మించిన తరుణోపాయం టీడీపీ దగ్గర లేదు.

బీజేపీ ఆలోచనలు భిన్నంగా సాగుతున్నాయని తెలుస్తు న్నది. ప్రతిపక్షాలన్నీ ఏకమై పోటీ చేసినా ఈసారి ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించడం సాధ్యం కాదన్న అంచనాకు బీజేపీ వచ్చింది. మరోపక్క టీడీపీ సంస్థాగతంగా బాగా బలహీనపడింది. నాయకత్వ ప్రతిష్ఠ అట్టడుగు స్థాయికి చేరు కున్నది. వచ్చే ఎన్నికల్లో కూడా ఓడిపోతే ఆ పార్టీ బతికి బట్టకట్టడం సాధ్యం కాదు.

ఈ పరిస్థితినే బీజేపీ కోరుకుంటున్నది. టీడీపీ పతనమైతేనే ప్రతిపక్షంగా తాము ఎదుగు తామని అది ఆలోచిస్తున్నది. జనసేన కూడా తమతో ఉంటే ఉమ్మడిగా 29 ఎన్నికల నాటికి వైసీపీకి బలమైన ప్రత్యామ్నా యంగా నిలవొచ్చని భావిస్తున్నది. ఒకవేళ జనసేన బాబుతోనే వెళితే ఎన్నికల తర్వాత ఇద్దరూ కోలుకునే పరిస్థితి ఉండదు.

అప్పుడు ఒంటరిగానైనా సరే ఎన్నికల తర్వాత ప్రతిపక్షంగా తామే నిలబడగలుగుతామని బీజేపీ నాయకత్వం ఆలోచనగా చెబుతారు. అయితే రాష్ట్ర బీజేపీలో చంద్రబాబు అనుకూల సెక్షన్‌ కొంత ఉన్నది. వీరికి కేంద్రం నుంచి ఆశీస్సులు అంద జేస్తున్న నాయకులు కొందరున్నారు. వీరందరూ టీడీపీ లాబీయిస్టులకు సహకరిస్తున్నారు.

కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ మీద దక్షిణాది ఒత్తిడి పెరిగింది. తెలంగాణలో గెలిస్తేనే కర్ణాటక గాయం మానుతుందని భావిస్తున్నది. కానీ ఇందుకు విరుద్ధంగా తెలంగాణ పరిణామాలు మారుతున్నాయి. బీజేపీలోకి చేరికలు దాదాపుగా ఆగిపోయాయి. కాంగ్రెస్‌లో కొంత కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలో అమిత్‌ షా ముందు బాబు ఒక ప్రతిపాదన ఉంచారు.

తెలుగుదేశంతో అలయెన్స్‌ కుదిరితే హైదరాబాద్‌ సిటీ, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల్లో బీజేపీ పరిస్థితి మెరుగ వుతుందని కొన్ని కాకిలెక్కలు తయారు చేసినట్టు సమాచారం. అలయెన్స్‌ కారణంగా బీజేపీలో చేరికలు కూడా పెరిగి ఒక ఊపు వస్తుందనీ, ఎల్లో మీడియా సంపూర్ణ సహకారం కూడా బీజేపీకి లభిస్తుందనీ చంద్రబాబు, అమిత్‌ షాతో చెప్పినట్టు తెలిసింది.

అంతేకాకుండా ఎన్నికల తర్వాత అవసరమైతే కాంగ్రెస్‌లోని ఒక వర్గాన్ని బీజేపీకి అనుకూలంగా గోడ దూకించేందుకు కూడా సహకరించగలనని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలిసింది. టీడీపీ అలయెన్స్‌ ప్రతిపాదనను గతంలోనే రాష్ట్ర బీజేపీ నాయ కులు తిరస్కరించినట్టు వార్తలు వచ్చాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత వచ్చిన వాతావరణ మార్పును తనకు అనుకూలంగా మార్చుకునేందుకు బాబు ఎత్తులు వేస్తున్నారు. అంతిమంగా ఆంధ్రప్రదేశ్‌లో సింహాన్ని ఎదుర్కోవడానికి కలిసివచ్చే తోడేళ్ల కోసం ఆయన అన్వేషణ సాగుతూనే ఉన్నది.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top