
యుద్ధంలో ఆయుధాలు మాత్రమే నిర్ణయాత్మక శక్తి కాదు... కోట్లాది పౌరులు ఒక్కటై వినిపించే స్వరం కూడా. కానీ పాకిస్తాన్‌తో తీవ్ర ఘర్షణలు తలెత్తిన వేళ ఆ సమష్టి స్వరానికి అవరోధం కల్పించేలా, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడి మన నేతల్లో కొందరు దేశాన్ని దిగ్భ్రమ పరిచారు. బహుశా అందుకే కావొచ్చు, కల్నల్ సోఫియా ఖురేషిపై నోరు పారేసుకున్న మధ్యప్రదేశ్ మంత్రి కన్వర్ విజయ్ షా క్షమాపణను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తోసిపుచ్చింది. ఈ విషయంలో ఆయనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి ఈ నెల 28కల్లా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
ఐపీఎస్ అధికారులతో ఏర్పాటయ్యే ఈ బృందంలో ఒక మహిళా అధికారి ఉండాలనీ, దానికి ఐజీ ర్యాంకుకు తక్కువకాని అధికారి సారథ్యం వహించాలనీ ఉత్తర్వులిచ్చింది. ఈ తరహా విద్వేష ప్రసంగాలు బీజేపీ నేతల నుంచి మాత్రమే కాదు, కొందరు విపక్ష నేతల నుంచీ వినిపించాయి. చిత్రమేమంటే ఎక్కడా, ఎవరిపైనా పోలీసులు కేసులు పెట్ట లేదు, చర్యలకు సిద్ధపడలేదు. కానీ సాధారణ పౌరులు చిన్నపాటి భిన్నస్వరం వినిపించినా విరు చుకుపడ్డారు. ఇందుకు అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీఖాన్ ఉదంతమే నిదర్శనం. కల్నల్ సోఫియాను కీర్తిస్తున్న బీజేపీ శ్రేణులు విద్వేష ప్రచారానికి బలవుతున్నవారిని ఎందుకు పట్టించుకో రని ఆయన ప్రశ్నించారు. సైన్యాన్నిగానీ, ఆ మహిళా అధికారుల్నిగానీ కించపరచలేదని, బాహాటంగా కనిపిస్తున్న ద్వంద్వ నీతిని ఎత్తిచూపటమే తన ఉద్దేశమని చెప్పినా ఆయన్ను అరెస్టు చేశారు.
విజయ్ షాపై మధ్యప్రదేశ్ పోలీసులు సొంతంగా కేసు నమోదు చేయలేదు. అక్కడి హైకోర్టు సుమోటోగా తీసుకుని తక్షణం ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని పోలీసుల్ని ఆదేశించింది. ఆ తర్వాతైనా పోలీసులు సక్రమంగా చర్యలు తీసుకున్నది లేదు. ఎఫ్‌ఐఆర్ వాలకం గమనించిన హైకోర్టు చీవాట్లు పెట్టాకే వారికి జ్ఞానోదయమైంది. విజయ్ షా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. రాష్ట్రంలోని ఎస్టీ నియోజకవర్గం హర్సూద్ నుంచి ఇప్పటికి 8 దఫాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. మంత్రిగా పని చేస్తున్నారు.
సంక్షోభ సమయాల్లో సంయమనం పాటించటం చాలా అవసరం. బాధ్యతాయుత స్థానాల్లో వున్నవారు ఆ సంగతి మరిచిపోతున్నారు. విజయ్ షా వ్యాఖ్యల సంగతే తీసుకుంటే ఆయన అన్నది కేవలం కల్నల్ సోఫియా ఖురేషిని మాత్రమే కాదు... ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావన చేసి ఆయనపై సంశయాలు రేకెత్తించే విధంగా మాట్లాడారు. యుద్ధానికి సంబంధించిన వివరాలను వెల్లడించటానికి నియమించిన ఇద్దరు మహిళా ప్రతినిధుల్లో ఒకరైన కల్నల్ సోఫియాను ‘ఉగ్ర వాదుల సోదరి’గా అభివర్ణించారు. ఉగ్రవాదులను ఆ వర్గం చేతే దెబ్బకొట్టించటానికి ప్రధాని ఆమెను తెలివిగా ఎంపిక చేశారన్నట్టు మాట్లాడారు.
కల్నల్ సోఫియా నిర్వహించిన మీడియా సమావేశాలను గమనిస్తేనే ఆమె ఎంత సమర్థంగా, చతురతతో ఆ బాధ్యతను నెరవేర్చారో తెలు స్తుంది. గర్వించదగిన నేపథ్యం ఆమెది. దేశంలోని ప్రతి మహిళా స్ఫూర్తిదాయకంగా తీసుకోదగిన చరిత్ర ఆమెది. సైనిక కుటుంబం నుంచి వచ్చి, సైన్యంలో చేరి అందులోని వ్యక్తినే వివాహమాడి ప్రతి స్థాయిలోనూ తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ కల్నల్ హోదా వరకూ ఎదిగారు. అటువంటామెను కేవలం ముస్లిం మహిళగా చూశారంటేనే... విజయ్ షా ఎంత ఉన్మాదపూరితంగా ఆలోచి స్తున్నారో అర్థమవుతోంది. అందుకే ఆయన ప్రసంగం తీరు చూసి దేశం యావత్తూ సిగ్గుపడుతోందని సుప్రీంకోర్టు అనక తప్పలేదు.
ఉగ్రస్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ దేశమంతా ఒక్కటై ఈ కష్టకాలాన్ని అధిగమించటానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. దాని అర్థం, పర మార్థం విజయ్ షాకు కాస్తయినా అర్థం కాలేదని ఆయన చేసిన వ్యాఖ్యలు, అటు తర్వాత క్షమా పణ చెబుతూ చేసిన ప్రకటన గమనిస్తే తెలుస్తుంది. నోరుజారి తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నానంటే బహుశా కోర్టు చీవాట్లతో సరిపెట్టేదేమో! కానీ అందరి నేతల మాదిరే ‘ఎవరి మనోభావాలైనా దెబ్బతినివుంటే...’ అంటూ రాగం తీయడంతో వివాదంలో మరింత కూరుకుపోయారు.
మంత్రి చెప్పిన క్షమాపణలో చిత్తశుద్ధి లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చేస్తున్నది క్షమించరాని తప్పని ఎటూ తెలియలేదు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితోపాటు పార్టీ అధిష్ఠానం సైతం మందలించినా పునరాలోచన కలగలేదు, పరివర్తన రాలేదు. ఇలాంటివారిని నాలుగ్గోడల మధ్య మందలించటం కాదు... పదవి నుంచి సాగనంపివుంటే అలాంటివారికి అదొక హెచ్చరికగా ఉండేది. దేశ ప్రజలు కొనియాడేవారు. కానీ బీజేపీ ఆ పని చేయలేకపోయింది.
సమాజ్‌వాదీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ సైతం ఈ మాదిరి వ్యాఖ్యలే చేశారు. వైమానిక దళ అధికారులైన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, ఎయిర్ మార్షల్ ఏకే భారతిల కులాల ప్రస్తావన చేశారు. బీజేపీకి కల్నల్ సోఫియా మతం తెలిసిందిగానీ ఈ అధికారులిద్దరూ పీడిత కులాలవారని తెలియదని, లేకుంటే వారిపైనా తప్పుడు వ్యాఖ్యనాలు చేసేవారని అన్నారు. ఈ బాపతు నాయకు లంతా మనుషుల్ని ఎంతసేపూ కులమతాల చట్రాల్లో చూస్తూ వారి సేవలనూ, అంకిత భావాన్నీ, సంకల్ప దీక్షనూ మరుగుపరుస్తారు. దేశభక్తి పేరుతో ఉన్మాదాన్నీ, విద్వేషాన్నీ పెంచి పోషిస్తారు. సుప్రీంకోర్టు స్పందించిన తీరు నేతలందరికీ గుణపాఠం కావాలి. సంక్షోభ కాలాల్లో మాత్రమే కాదు... సాధారణ సమయాల్లోనూ జాగ్రత్తగా మాట్లాడాలని తెలుసుకోవాలి.