జైలు శిక్షను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు
సావొ పౌలొ: దేశంలో తిరుగుబాటు లేవదీసేందుకు ప్రయత్నించిన ఆరోపణలపై గృహ నిర్బంధంలో ఉన్న బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జయిర్ బొల్సనారోను అధికారులు ముందుగానే అరెస్ట్ చేశారు. మరో రెండు వారాల్లో ఆయనపై విధించిన 27 ఏళ్ల కారాగార శిక్ష అమల్లోకి రానుండగా ఈ పరిణామం చోటుచేసుకుంది. 2019–2022 సంవత్సరాల మధ్య దేశాధ్యక్షుడిగా ఉన్న బొల్సనారో.. 2022 ఎన్నికల్లో లులా డసిల్వా చేతిలో ఓటమి పాలయ్యారు.
అనంతరం, 2023లో దేశంలో తిరుగుబాటుకు, అధ్యక్షుడు లులా డ సిల్వా హత్యకు కుట్ర పన్నారంటూ వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. బొల్సనారోకు 27 ఏళ్ల కారాగారంతోపాటు 2030 వరకు అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనరాదంటూ నిషేధం విధించింది. ప్రస్తుతం ఆయన విలాసవంతమైన జర్దిప్ బొటనాకో ప్రాంతంలోని సొంతింట్లో గృహ నిర్బంధంలో ఉన్నారు.
కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా వేసి ఉంచేందుకు ఎల్రక్టానిక్ మానిటర్‌ను జూలై 18వ తేదీన ఆయన కాలికి అమర్చారు. శనివారం వేకువజామున ఆ పరికరాన్ని పగులగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందని ప్రకటించిన సుప్రీంకోర్టు జడ్జి అలెగ్జాండర్ డి మోరెస్..బొల్సనారోను వెంటనే గృహ నిర్బంధం నుంచి రాజధాని బ్రెసిలియాలో ఫెడరల్ పోలీసు ప్రధాన కార్యాలయానికి తరలించాల్సిందిగా ఆదేశాలివ్వడం కలకలం రేపింది.
బొల్సనారో దేశాన్ని విడిచి దొంగచాటుగా పరారయ్యే ప్రమాదముందని, నివాసం పొరుగునున్న రాయబార కార్యాలయాల్లో ఆశ్రయం కోరే అవకాశముందని అధికారులను ఆయన అప్రమత్తం చేశారు. ఇదంతా ముందు జాగ్రత్త మాత్రమేనని, మాజీ అధ్యక్షుడిని అవమానించే ఉద్దేశం తమకు లేదన్నారు. ఆయనకు బేడీలు వేయడం, బహిరంగంగా జైలుకు తరలించడం వంటివి చేపట్టబోమన్నారు.


