ఎయిరిండియా రద్దుల పద్దు! | Sakshi Editorial On Air India flights | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా రద్దుల పద్దు!

Jun 21 2025 1:11 AM | Updated on Jun 21 2025 6:32 AM

Sakshi Editorial On Air India flights

చూడబోతే ఎయిరిండియాకు కష్టాలన్నీ ఒక్కసారే కట్టగట్టుకుని వచ్చినట్టున్నాయి. ఈ నెల 12న గుజరాత్‌లో జరిగిన దురదృష్ట ఘటనలో 272 మంది మరణించిన తర్వాత ఎయిరిండియా విమానాలు ఎక్కాలన్నా, ప్రత్యేకించి ప్రమాదం సంభవించిన బోయింగ్‌ 787–8 డ్రీమ్‌లైనర్‌ రకం విమానాల్లో ప్రయాణించాలన్నా చాలామంది భయపడుతున్నారు. అందుకు తగినట్టే ఆ సంస్థ అంతర్జాతీయ, దేశీయ మార్గాల్లో వినియోగించే దాదాపు 90 విమాన సర్వీసుల్ని అంచెలంచెలుగా రద్దుచేస్తూ పోతోంది. 

శుక్రవారం కూడా ఎనిమిది విమానాలు రద్దయ్యాయి. నిర్వహణాపరమైన, సాంకేతికమైన సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ చెబుతోంది. వీటికితోడు పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇరాన్‌ గగనతలాన్ని మూసివేయటం వంటివి కూడా విమాన సర్వీసుల రద్దుకు దోహదపడ్డాయి. 

జూలై రెండో వారం వరకూ అంతర్జాతీయ విమాన సర్వీసులు 15 శాతంమేర తగ్గించనున్నామని ఎయిరిండియా ప్రకటించింది. ప్రయాణికులు కూడా ఏమంత భరోసాతో లేరు. అసలు విమానయానమే వద్దనుకున్నవారు కొందరైతే, బోయింగ్‌ విమానాలు ఎక్కరాదని మరికొందరు నిర్ణయించుకుని ప్రయాణాలు రద్దుచేసుకున్నారు. 

విమానయాన సంస్థలను నియంత్రించే పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) ఎయిరిండియా విమానాల్లో భద్రతకు సంబంధించిన ప్రధాన లోపాలేమీ లేవని, కేవలం నిర్వహణాపరమైన సమస్యలే ఉన్నాయని చెబుతోంది. భిన్న విభాగాల మధ్య సమన్వయం అవసరమవుతుందని సలహా ఇచ్చింది. ఎక్కడ ఏ చిన్న లోపాన్ని గమనించినా దాన్ని నమోదు చేయటం, వెనువెంటనే సరిదిద్దటం వంటివి జరగాలని సూచించింది. 

ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు రేటింగ్‌ ఇచ్చే అంతర్జాతీయ స్వతంత్ర ఆన్‌లైన్‌ సంస్థ పరిశీలనలో ఇండిగో, ఆకాశ సంస్థలు ఏడు అంశాల్లో ఆరు పాయింట్లు సాధించాయి. స్పైస్‌ జెట్‌ ఏడుకు ఏడు పాయింట్లు పొందగా, ఎయిరిండియా కేవలం నాలుగు పాయింట్లే సాధించటం గమనించదగ్గ అంశం. 

ఇక బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ భద్రతా లోపాలపై ఫిర్యాదు చేసిన ఇంజినీర్‌ జార్జి బార్నెట్‌ అనుమానాస్పద స్థితిలో నిరుడు మార్చిలో మరణించిన ఉదంతం కలవరపరుస్తుంది. ఆ సంస్థ క్వాలిటీ కంట్రోల్‌లో 32 ఏళ్లు పనిచేసిన బార్నెట్‌ రెండ్రోజులు విచారణకు హాజరై మూడో రోజు ఎందుకు తుపాకీతో కాల్చుకుంటాడన్నది ప్రశ్నార్థకమైంది.

టాటా ఎయిర్‌లైన్స్‌గా ఉన్న సంస్థను 1953లో నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయం చేసి, ఎయిరిండియాగా నామకరణం చేశారు. దేశీయ విమాన సర్వీసుల కోసం ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ ఆవిర్భవించింది. 

ఈ రెండూ పబ్లిక్‌ రంగ సంస్థలు కావటంతో పౌర విమానయాన రంగంలో అవి దిగ్గజ సంస్థలుగా వెలిగాయి. కానీ దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలై విమానయానంలో ప్రైవేటు సంస్థలు ప్రవేశించటం, తక్కువ ధరకే ప్రయాణికులను చేరేవేసే సంప్రదాయాన్ని ప్రారంభించటంతో అంతక్రితమే నష్టాలతో ఉన్న ఆ సంస్థ మరింతగా కుంగిపోవటం మొదలైంది. 

అసలు విమానయాన రంగంలో ప్రైవేటును అనుమతించినప్పుడే ఎయిరిండియా నిర్వహణను పూర్తిగా నిపుణులకు వదిలేయాల్సింది. కానీ పగ్గాలు ప్రభుత్వం దగ్గరే ఉండటం, దానికి లోబడి సంస్థ పనిచేయాల్సి రావటంతో ఎన్నో సమస్యలు చుట్టుముట్టాయి. 



టాటా సన్స్‌ 2022లో ఎయిరిండియాను తీసుకున్నప్పుడు విమానయాన రంగాన్నే సంపూర్ణంగా మారుస్తామని ప్రకటించింది. దశాబ్దాల అసమర్థ ఉద్యోగస్వామ్యాన్ని తొలగించి, గర్వించదగిన గొప్ప సంస్థగా తీర్చిదిద్దుతామని తెలిపింది. మూడేళ్లు గడిచాయి. 

కానీ చెప్పుకోదగ్గ మార్పుల జాడలేదు. అలాగని ఎయిరిండియా ఏమీ చేయలేదని కాదు.  సిబ్బందికి పునఃశిక్షణనిచ్చింది. వారి యూనిఫాంని మార్చింది. యాప్‌ను సరికొత్తగా తీసుకొచ్చింది. అయితే, ప్రాణం మీదికొచ్చే ప్రమాదాలు జరగలేదన్న మాటేగానీ లోపాల పరంపర గురించిన ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. 

ఇందులో పారిశుద్ధ్యం మొదలుకొని విరిగిపోయిన సీట్లు, నాసిరకం ఉపకరణాలు వగైరాలున్నాయి. అయినా పెద్దగా ఫలితం లేదు. ఇక అస్వస్థతగా ఉండి సెలవు పెట్టినవారిని సైతం ఒత్తిడి తెచ్చి విధినిర్వహణకు పిలిచిన సందర్భాలున్నాయని పైలెట్ల ఫిర్యాదు. ఇవన్నీ విడివిడి ఘటనలుగా కొట్టిపారేయటం కాక వాటివెనక అల్లుకునివున్న నిర్లక్ష్యాన్నీ, అలసత్వాన్నీ సకాలంలో గమనించుకుంటే పరిస్థితి మెరుగుపడేది. 

నిరుడు ఢిల్లీ–శాన్‌ఫ్రాన్సిస్కో సర్వీస్‌ విమానం ఇంజన్‌ వైఫల్యం కారణంగా రష్యాలో రోజుల తరబడి నిలిచిపోయింది. మరుగుదొడ్లు పనిచేయక చికాగోకు బయల్దేరిన విమానం కాసేపటికే వెనుదిరిగింది. టాటా బ్రాండ్‌కు మార్కెట్‌లో మంచి పేరుంది. వాటి ఉత్పత్తులపై వినియోగదారుల్లో విశ్వాసం ఉంది. ఎయిరిండియా దాన్ని అందుకోలేకపోయింది. 

నిరుడు మే నెలలో ముంబై–లండన్‌ సర్వీసు బోయింగ్‌ 787 విమానంలో తలుపు సరిగా పనిచేయటం లేదంటూ ఫిర్యాదు చేశాక, దాన్ని వెనక్కు తీసుకోవాలని తమపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని, నిరాకరించినందుకు షోకాజ్‌ నోటీసులు జారీచేసి, 48 గంటలు దాటకుండా ఉద్యోగం నుంచి తొలగించారని సీనియర్‌ ఫ్లయిట్‌ అటెండెంట్లు ఇద్దరు ఈ మధ్యే ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేయటం గమనించదగ్గది. 

ప్రవర్తన సరిగా లేకపోవటం, విధి నిర్వహణ సక్రమంగా చేయక పోవటం వంటి కారణాలతోనే వారిని తొలగించామని సంస్థ సంజాయిషీ ఇస్తోంది. అంతా సవ్యంగా గడిచినంతకాలం నిర్వాహకులు తమను తాము అభినందించుకుంటూ కాలం గడుపుతారు. ఎప్పటికప్పుడు తనిఖీ చేసే నియంత్రణ వ్యవస్థ ఉంటే ఇలాంటివి చోటుచేసుకోవు. ఈ విషాద ఘటన నుంచి అయినా గుణపాఠం నేర్చుకోవాలి. అత్యంత జాగరూకతతో మెలగాలి.   

Advertisement
 
Advertisement
Advertisement