
అతిథుల్ని పిలిచి బహిరంగంగా వాగ్యుద్ధానికి దిగటం ఏ రకంగా దౌత్యనీతి అవుతుందో, దాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎక్కడ నేర్చారో ఎవరికీ తెలియదు. కానీ ఆయన దాన్ని కొనసాగించదల్చుకున్నారని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రాంఫోసాతో వైట్‌హౌస్‌లో తాజాగా సాగిన జగడం నిరూపిస్తోంది. మొన్న ఫిబ్రవరిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ట్రంప్ ఇదే మాదిరి తగువు పెట్టుకున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధంలో తప్పంతా ఉక్రెయిన్‌దే అన్నట్టు తేల్చి, దాన్ని వెంటనే నిలిపేయాలని ఒత్తిడి తెచ్చారు.
అడుగడుగునా అవమా నిస్తూ మాట్లాడారు. మళ్లీ మూణ్ణెల్లకు అదే వైట్‌హౌస్‌లో ట్రంప్ ఆ డ్రామాకే తెరతీశారు. నిజానికి ఇరు దేశాల అధినేతలు కలుసుకుని చర్చించినాక వారిద్దరూ కలిసి మాట్లాడే మీడియా సంయుక్త సమావేశం లాంఛనప్రాయమైనది. నాలుగు గోడలమధ్యా నిర్మొహమాటంగా మాట్లాడుకున్నా, వాదులాడుకున్నా... మీడియా సమావేశంలో పరస్పరం ప్రశంసించుకోవటాలు, రెండు దేశాల మధ్యా కుదిరిన ఒప్పందాల విశిష్టతను అతిగా చూపించుకోవటాలు జరిగిపోతాయి. ఇందువల్లరెండు దేశాల్లోనూ అధినేతలకు ప్రశంసలు దక్కుతాయి.
కానీ ఇలాంటివి ట్రంప్‌కు పట్టవు. ప్రపంచానికి తాను మకుటంలేని మహారాజునని, ఎవరినైనా ఏమైనా అనగలనని అమెరికా శ్వేతజాతి ఓటరు మహాశయులకు ఆయన చెప్పదల్చుకున్నారు.అందుకే అతిథులుగా వచ్చిన అధినేతలను కెమెరాల ముందు ఇష్టానుసారం మాట్లాడటం అల వాటు చేసుకున్నారు. పోనీ ఆయన నిలదీస్తున్న అంశాలు గొప్పవేమీ కాదు. వాటిల్లో చాలామటుకు నకిలీవీ... నిరాధారమైనవీ. సామాజిక మాధ్యమాల్లో ఎవరెవరో పెట్టే తప్పుడు పోస్టింగులే వాటికి ఆధారం.
ఉక్రెయిన్‌లో దేశాధినేతను మార్చి, ఆయన ద్వారా రష్యాను చీకాకుపెట్టి చివరకు అది రెచ్చిపోయి దాడిచేసే స్థితి కల్పించింది అమెరికాయే. అటు తర్వాత రష్యాను ప్రపంచంలో ఏకాకిని చేయటానికి ప్రయత్నించి, ఉక్రెయిన్‌కు పెద్దయెత్తున ఆయుధాలు అమ్ముకున్నది అమెరికాయే. నాటో దేశాలను సైతం ఈ రొంపిలోకి దించింది కూడా ఆ దేశమే. జో బైడెన్ హయాంలో ఇవన్నీ జరిగినట్టు తెలిసినా, ట్రంప్ ఏమీ తెలియనట్టు నటించారు. ఉక్రెయిన్‌నే వేలెత్తి చూపారు. ఇప్పుడు రాంఫోసాతో సైతం అదే తరహాలో వ్యవహారం నడిపారు.
దక్షిణాఫ్రికాలో శ్వేతజాతీయుల ఊచకోత సాగుతున్నదనీ, వాటిల్లో చాలాభాగం బయటకు రావటం లేదనీ ట్రంప్ వాదించారు. ఒకప్పటి శ్వేతజాతి పాలనలో నల్లజాతీయులపై అఘాయి త్యాలు జరిగాయని ఒప్పుకుంటూనే ఇప్పుడు నల్లజాతి పాలనలో శ్వేతజాతీయుల్ని ఆ మాదిరేహింసిస్తున్నారని చెప్పుకొచ్చారు. మీ వద్ద ఆధారాలున్నాయా అని రాంఫోసా అడిగితే, లేవని అంగీ కరిస్తూనే ట్రంప్ ఒక వీడియో ప్రదర్శించారు. అందులో నల్లజాతి వామపక్ష నాయకుడు జూలియస్ మలేమా ‘శ్వేతజాతి ఆఫ్రికన్లను హతమార్చండ’ంటూ నినాదాలిస్తున్న దృశ్యాలు కనబడ్డాయి. మొత్తం గంటసేపు జరిగిన ఈ మీడియా సమావేశంలో రాంఫోసా ఎక్కడా ఆవేశానికి పోకుండాఎంతో సంయమనంతో ట్రంప్‌కు జవాబిచ్చే ప్రయత్నం చేశారు.
నిజానికి దక్షిణాఫ్రికాలో ఇప్పటికీ నాలుగింట మూడొంతుల వ్యవసాయ భూములు 8 శాతంకన్నా తక్కువ జనాభాగల శ్వేతజాతీయుల చేతుల్లో వున్నాయి. జనాభాలో 80 శాతంగా వున్న నల్లజాతీయులకు వ్యవసాయ భూముల్లో వాటా కేవలం 4 శాతం మాత్రమే. కానీ ట్రంప్ మాత్రం దక్షిణాఫ్రికా ప్రభుత్వం శ్వేతజాతీయుల భూముల్ని గుంజుకుని వాటిని నల్లజాతీయులకు పంచు తున్నదని ఆరోపించారు. శ్వేతజాతి దురహంకార పాలనలో నల్లజాతీయుల నుంచి అక్రమంగా చేజిక్కించుకున్న భూములు వెనక్కిప్పించాలని స్థానికులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నా అక్కడి ప్రభుత్వం అంగీకరించటం లేదు.
దానికి బదులు స్వచ్ఛందంగా అమ్మటానికి సిద్ధపడే శ్వేత జాతీయులకు పలు రాయితీలిస్తున్నది. శ్వేతజాతి రైతుల ఊచకోత సాగుతున్నదన్న ట్రంప్ వాదన కూడా పూర్తి అబద్ధం. నేరాల రేటు చూస్తే ప్రపంచంలోనే దక్షిణాఫ్రికా ముందుంది. అక్కడ సగటున రోజుకు 72 హత్యలు జరుగుతాయి. ఆరుకోట్ల జనాభాగల ఆ దేశంలో హతుల్లో అత్యధికులు నల్లజాతీయులు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం నిరుడు 26,232 మంది హత్యకు గురైతే అందులో కేవలం 8 మంది మాత్రమే శ్వేతజాతి రైతులు. వాస్తవాలు ఇవికాగా ట్రంప్ వైట్‌హౌస్ వేదికగా ఒక దేశాధినేతపై ప్రపంచమంతా చూస్తుండగా దబాయించటం ఎంత దారుణం!
నిజానికి రెండు దేశాలూ చర్చించి పరిష్కరించుకోవాల్సినవి చాలావున్నాయి. శ్వేతజాతి రైతుల ఊచకోత ప్రచారాన్ని నమ్మటంతో బైడెన్ హయాంలోనే నిధులు ఆపేశారు. ట్రంప్ వచ్చాక 25 శాతం సుంకాల విధింపును ప్రకటించారు. ఆ దేశంలోని సహజ వనరులపై ట్రంప్ కన్నుపడింది. వీటిపై అర్థవంతమైన చర్చలు జరగకుండానే తప్పుడు ప్రచారంపై వాదులాట సాగింది. గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న ఊచ కోతపై ధైర్యంగా అంతర్జాతీయ న్యాయస్థానం తలుపుతట్టింది దక్షిణాఫ్రికాయే. రాంఫోసా అదృష్టం బాగుండి ట్రంప్‌కు ఆ సంగతి గుర్తురాలేదు. లేకుంటే మరింతగా విరుచుకుపడేవారు.
వర్తమాన ప్రపంచంలో పలు దేశాధినేతలు తప్పుడు సమాచారాన్నీ, వదంతుల్నీ ప్రచారంలో పెట్టి అధికారంలోకొచ్చినవారే. ఈ ఎత్తుగడలే మరోసారి అందలం ఎక్కిస్తాయని... రాజ్యాంగాన్ని సవరించి మూడోసారి అధ్యక్షుడు కావాలని కలగంటున్న ట్రంప్ విశ్వసిస్తున్నారు. ఇలాంటపుడు అమెరికాలో అడుగుపెట్టడానికీ, ట్రంప్‌తో చీవాట్లు తినటానికీ ఏ దేశాధినేతయినా ధైర్యం చేయగలరా?