గర్భదారుణం | - | Sakshi
Sakshi News home page

గర్భదారుణం

Aug 25 2026 12:15 AM | Updated on Aug 25 2026 12:15 AM

స్నేహితులతో కలిసి తరగతి గదిలో కూర్చుని పాఠాలు నేర్చుకోవాల్సిన వయసు వారిది. సాయంత్రం వేళ గాలి పటాలను ఎగురవేస్తూ గంతులు వేయాల్సిన సమయమిది. కానీ అమ్మతనం తెలియని వయసులోనే గర్భం దాల్చి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. పసి వయసులోనే పడిన మూడు ముళ్లకు తలవంచి ప్రసవ వేదన అనుభవిస్తున్నారు. పాఠశాల నుంచే పెళ్లి పీటలెక్కిన కొందరు బాలికల అవస్థలు ఇవి. టీనేజీలోనే గర్భం దాల్చడంతో శారీరకంగా, మానసికంగా తీవ్ర అవస్థలు పడుతున్నారు. జిల్లా పెరుగుతున్న ఈ టీనేజీ ప్రెగ్నెన్సీలు ఆందోళన కలిగిస్తున్నాయి.

సాక్షి, రాజమహేంద్రవరం: అమ్మతనం ప్రతి మహిళకు మధుర భావనే. నవ మాసాలు మోసి బిడ్డకు జన్మనివ్వడాన్ని ఆమె ఎంతో గర్వంగా భావిస్తుంది. ఆ బిడ్డ భవిష్యత్తు కోసం బంగారు కలలు కంటూ మురిసిపోతుంది. అయితే దురదృష్టవశాత్తూ జిల్లాలో అమ్మతనం బాధల వలయంగా మారుతోంది. 18 ఏళ్లు నిండక ముందే గర్భం దాల్చడంతో శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్నారు. పేదరికం, ఇతర సామాజిక కారణాలతో కొందరు తల్లిదండ్రులు నేటికీ బాల్య వివాహాలు చేస్తున్నారు. బంధువులు, తెలిసిన వారితో బంధుత్వం కలుపుకొనేందుకు కూడా ఇవి జరుగుతున్నాయి. ఫలితంగా జిల్లాలో టీనేజీ ప్రెగ్నెన్సీ ఆందోళన కలిగిస్తోంది. ఇది తల్లీ బిడ్డల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

అంతంత మాత్రంగానే..

బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం లేదన్న విషయం స్పష్టమవుతోంది. అందువల్లే ఈ ఆధునిక కాలంలోనూ టీనేజీ ప్రెగ్నెన్సీ శాతం పెరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఐసీడీఎస్‌కు క్షేత్ర స్థాయి వరకూ సిబ్బంది ఉన్నారు. వారంతా అప్రమత్తంగా ఉంటే బాల్య వివాహాల కట్టడి సాధ్యమే. ముఖ్యంగా గ్రామాల్లో అవగాహన కల్పిస్తే కొంత వరకూ మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఆ దిశగా అధికారులు, సిబ్బంది దృష్టి సారించడం లేదన్న విషయాన్ని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

జిల్లాలో పరిస్థితి

నెల మొత్తం టీనేజీ శాతం

గర్భిణులు గర్భిణులు

మే 8,233 335 4.07

జూన్‌ 8,367 327 3.91

జూలై 8,382 334 3.98

అవగాహన కల్పిస్తున్నాం

బాల్య వివాహాలు, టీనేజీ ప్రెగ్నెన్సీ వల్ల కలిగే నష్టాలపై ఐసీడీఎస్‌, డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీస్‌ అథారిటీ సహకారంతో గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. తెలిసీ తెలియని వయసులో గర్భం దాల్చడంతో మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రుల్లోనూ మార్పు రావాల్సిన అవసరం వుంది. అప్పుడే బాల్య వివాహాలు, టీనేజీ ప్రెగ్నెన్సీకి అడ్డుకట్ట పడుతుంది.

– కోమల, డీఎమ్‌హెచ్‌వో

భారం తగ్గుతుందని...

చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లి చేస్తే భారం తగ్గుతుందనే ఆలోచనలో ఉంటున్నారు. అందువల్లే తక్కువ వయసులోనే వివాహం చేసేస్తున్నారు. ముఖ్యంగా స్కూల్‌ మానేసిన పిల్లలు ఇంటి వద్దే ఉండడంతో పాటు తెలిసిన వారితో బంధుత్వాల కోసం తక్కువ వయసులోనే పెళ్లి జరిపిస్తున్నారు.కొన్ని ప్రాంతాల్లో ప్రేమ వివాహాలు కూడా జరుగుతుండడంతో టీనేజీ ప్రెగ్నెన్సీ శాతం పెరుగుతోంది.

– శ్రీదేవి, పీడీ, ఐసీడీఎస్‌

జిల్లాలో ఆందోళనకరంగా

టీనేజ్‌ ప్రెగ్నెన్సీ

బాల్య వివాహాల కట్టడిలో

అధికారుల విఫలం

తక్కువ వయసులోనే గర్భంతో

అనారోగ్యం

బాధల వలయంగా మారుతున్న

అమ్మతనం

బాల్యానికి మూడు‘ముళ్లు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement