శ్రావణంలో సర్రుమంటూ.. | - | Sakshi
Sakshi News home page

శ్రావణంలో సర్రుమంటూ..

Aug 25 2026 12:15 AM | Updated on Aug 25 2026 12:15 AM

సాక్షి, రాజమహేంద్రవరం: శుభకార్యాలు జరుపుకొనే శ్రావణ మాసంలో నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఊహించని పెరుగుదలతో సామాన్యుల ఇంటి బడ్జెట్‌ తల్లక్రిందులు చేస్తున్నాయి. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాన్య, మధ్య తరగతి ప్రజల జీవనం భారంగా మారింది. సంక్షేమ పథకాలు అందక, ధరల నియంత్రణకు చర్యలు చేపట్టకపోవడంతో పేద, బలహీన వర్గాల ప్రజల ఇళ్లు గడవడం కష్టంగా మారింది. చంద్రబాబు అసమర్థ పాలనకు కొనసాగింపుగా ప్రస్తుతం ధరలు బెదరగొడుతున్నాయి. మరో వైపు ఉద్దేశపూర్వకంగానే వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులు వెనుకడుగు వేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

భారమైన సన్న బియ్యం

రెండు, మూడు నెలల కిందటి వరకూ మేలు రకం సన్న బియ్యం కిలో రూ.50 నుంచి రూ.55 మధ్య లభించేవి. ప్రస్తుతం కిలో రూ.65 నుంచి రూ.70 వరకూ పెరిగిపోయాయి. దీంతో మధ్య తరగతి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

పంచదారకు రెక్కలు

శ్రావణ మాసంలో నోరు తీపి చేసుకుందామంటే బెల్లం, చక్కెర చేదెక్కాయి. రెండు నెలల క్రితం వరకూ కిలో రూ.40 నుంచి రూ.45 మధ్య ఉన్న పంచదార ధర ప్రస్తుతం రూ.60 దాటిపోయింది. రాజమహేంద్రవరంలో దిగుమతి చేసుకుంటున్న సరకును బ్లాక్‌ మార్కెట్‌కు తరలించడం వల్లే గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి పంచదార ధర పెరిగిపోయిందని స్వీట్‌ షాపుల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు బెల్లం కొద్ది రోజుల కిందట వరకూ కిలో రూ.55 నుంచి రూ.60 మధ్య దొరికేది. ప్రస్తుతం అది కూడా ఒక్కసారిగా రూ.70 నుంచి రూ.75కి పెరిగిపోయింది. ఇక ప్యాకింగ్‌ చేసిన బెల్లం దిమ్మలు కిలో రూ.90 దాటేశాయి.

దూసుకెళ్తున్న వెల్లుల్లి, ఉల్లి

జూన్‌ మొదటి వారంతో పోలిస్తే వెల్లుల్లి ధర సుమారు వంద శాతం మేర పెరిగింది. అప్పట్లో కిలో రూ.130 వరకూ వెల్లుల్లి ఉన్న ధర ప్రస్తుతం రూ.250 దాటేసింది. కొన్ని దుకాణాల్లో నాణ్యత, గ్రేడింగ్‌ పేరిట కిలో రూ.300కి పైనే విక్రయిస్తున్నారు.

● జూలైలో కిలో ఉల్లి రూ.20 నుంచి రూ.25 మధ్య లభిస్తే ప్రస్తుతం రైతుబజార్‌లో రూ.40కి చేరింది. ఇక బహిరంగ మార్కెట్‌లో ప్రాంతాన్ని బట్టి రూ.50 నుంచి విక్రయిస్తున్నారు. ఎండు మిర్చి కిలో రూ.240 నుంచి రూ.300కి పెరిగింది.

● మరోవైపు శ్రావణ మాస పూజల్లో ఎంతో కీలకమైన పువ్వుల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. చామంతి కిలో రూ.350 నుంచి రూ.400 పలుకుతుండగా, విడిగా కావాలంటే రూ.50కి వంద గ్రాములు కూడా దొరకడం లేదు. వంట నూనెల ధరలు కూడా కిలోకి రూ.5 మేర పెరిగిపోయాయి. కూరగాయల ధరలు కూడా గతంతో పోల్చితే పెరిగిపోయాయి.

ఇబ్బంది పడుతున్నాం

గతంలో ఎన్నడూ లేనంతగా ధరలు పెరిగిపోయాయి. పంచదార, బెల్లం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. శ్రావణమాసంలో తీపి పదార్థాలు చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నాం. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయాయి. వాటి నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.

– గాదె అనురాధ, శాటిలైట్‌ సిటీ

సామాన్యులు బతకడం కష్టమే

చంద్రబాబు ప్రభుత్వంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బియ్యం, నూనె, పంచదార, బెల్లం, కూరగాయలు... ఇలా సామాన్యులకు అవసరమైన వస్తువుల ధరలన్నీ పెరిగిపోయాయి. వేటినీ కొనే పరిస్థితి లేదు. సామాన్యులు బతకడం కష్టంగా మారింది.

– ఈమని మల్లిక, ప్రగతిశీల

మహిళా సంఘం, నిడదవోలు

భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు

శుభకార్యాలతో విపరీతమైన డిమాండ్‌

బెంబేలెత్తుతున్న సామాన్యులు

కృత్రిమ కొరత సృష్టిస్తున్న

వ్యాపారులపై చర్యలు శూన్యం

చంద్రబాబు ప్రభుత్వంలో ఆర్థిక భారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement