సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): డ్రంకెన్ డ్రైవ్ కారణంగా జరుగుతున్న రహదారి ప్రమాదాలను అరికట్టేందుకు బ్రీత్ ఎనలైజర్ విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని పోలీసు అధికారులను కలెక్టర్ కోరారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్ సమకూర్చిన రెండు బ్రీత్ ఎనలైజర్లను కలెక్టర్ కీర్తి, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ సమక్షంలో సోమవారం జిల్లా పోలీసు యంత్రాంగానికి అందజేశారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రాంతాలు, జాతీయ రహదారులపై రాత్రి వేళల్లో, ముఖ్యంగా వారాంతాల్లో బ్రీత్ ఎనలైజర్లతో తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వారికి మోటారు వాహనాల చట్టం ప్రకారం భారీ జరిమానాలు విధించడంతో పాటు, జైలు శిక్ష పడేలా కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎస్పీ నరసింహ కిశోర్ మాట్లాడుతూ గతంలో గామన సంస్థ సమకూర్చిన నాలుగు బ్రీత్ ఎనలైజర్లు, మున్సిపల్ కార్పొరేషన్‌న్ అందించిన రెండు ఎనలైజర్ల సహాయంతో జిల్లాలో ప్రత్యేక తనిఖీలు చేపడతామని తెలిపారు.
పుష్కర యాత్రికులకు
అన్ని వసతులు కల్పించాలి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): గోదావరి పుష్కరాలకు భారీగా తరలి వచ్చే యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రైల్వే, ఆర్టీసీల సమన్వయంతో సమగ్ర రవాణా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ కీర్తి కోరారు. ఆమె సోమవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో విజయవాడ రైల్వే డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా, జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాలతో కలిసి రైల్వే, ఆర్టీసీ, ట్రాన్స్‌పోర్ట్, పోలీస్ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్కర యాత్రికులకు చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ పుష్కరాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు పెద్ద సంఖ్యలో ప్రధానంగా రైళ్ల ద్వారా రాజమహేంద్రవరం తరలివస్తారన్నారు. ఈ నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రైల్వే, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని కోరారు.
నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు
పెరవలి: పుష్కరాల నేపథ్యంలో కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని, నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజయవాడ డివిజన్ డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా అన్నారు. ఆయన సోమవారం ఆ పనులను పరిశీలించారు. ప్రయాణికుల సౌకర్యాల కల్పన కోసం ఇంకా ఏమైనా చేయాలా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రయాణికుల హక్కుల పోరాట సమితి కన్వీనర్ నంబూరి శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో ప్రజలు ఆయనకు పలు డిమాండ్లపై వినతిపత్రం అందించారు. కరోనాకు ముందు మాదిరిగా ఈ స్టేషన్లలో రైళ్లను నిలుపదల చేయాలని కోరారు.
దళితవాడల్లో
సమస్యలు పరిష్కరించాలి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలోని దళిత వాడల్లో సమస్యలు పరిష్కరించాలని, అక్కడ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, కమ్యూనిటీ హాళ్లు తదితర సౌకర్యాలు కల్పించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్), ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) డిమాండ్ చేశాయి. ఈ మేరకు సోమవారం రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా చేశాయి. కేవీపీఎస్ రాష్ట్ర నాయకుడు రామరాజు మాట్లాడుతూ కుల వివక్ష లేని సమాజం కోసం సామాజిక శంఖారావం కార్యక్రమంలో భాగంగా నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం, రాజమహేంద్రవరం అర్బన్, రాజానగరం నియోజకవర్గాల్లోని సుమారు 40 గ్రామాలు, 20 వార్డులను సందర్శించామన్నారు. అక్కడి సమస్యలను అధ్యయనం చేసి, సర్వే నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.


