సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): మున్సిపల్, పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేయడంతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో భాగంగా చేపట్టిన విచారణలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ కీర్తి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్ అనంతరం మున్సిపల్, పంచాయతీ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, ఏఈఆర్‌ఓలు, ఇతర క్షేత్రస్థాయి అధికారులతో ఎన్నికల అంశాలపై సమీక్ష నిర్వహించారు. సర్‌లో భాగంగా ఏఈఆర్‌ఓలు, తహసీల్దార్లు మ పరిధిలోని అన్ని విచారణలను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలన్నారు. అవసరమైనచోట వర్చువల్ విచారణలను వినియోగించుకోవాలని, అధికారులకు అవసరమైన శిక్షణ, సాంకేతిక సహకారం అందించాలన్నారు.
భూ రికార్డుల్లో తప్పులు సరి చేయాలి
భూ రికార్డుల్లో గతంలో నమోదైన తప్పులను నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హత ఉన్న కేసుల్లో సత్వరమే సవరణలు చేపట్టాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. భూ రికార్డు సరిచేసిన ధ్రువీకరణ పత్రాల పంపిణీ, స్వచ్ఛత కార్యక్రమాలపై సోమవారం పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ చాగల్లు గ్రామంలోని సర్వే నంబర్ 464–2 నుంచి 621–5 వరకు ఉన్న 96 మంది భూముల స్వభావాన్ని సరిచేయాలని ప్రతిపాదనలు అందాయన్నారు. సంబంధిత రెవెన్యూ, సర్వే రికార్డులను పరిశీలించగా, గతంలో భూమి స్వభావం పొరపాటుగా నమోదైనట్లు గుర్తించినట్లు చెప్పారు. పరిశీలన అనంతరం నిబంధనల మేరకు అవసరమైన సవరణలకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు.
పీజీఆర్‌ఎస్‌కు 203 అర్జీలు
కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో 203 అర్జీలు స్వీకరించినట్టు కలెక్టర్ కీర్తి తెలిపారు. రెవెన్యూ క్లినిక్‌కు వంద అర్జీలు రాగా మిగిలినవి పీజీఆర్‌ఎస్‌లో అందాయన్నారు. కార్యక్రమంలో జేసీ మేఘస్వరూప్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పోలీస్ స్పందనకు 35 ఫిర్యాదులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 35 ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి, సమస్యలపై ఫిర్యాదు చేసిన అర్జీదారులతో ఎస్పీ డి.నరసింహ కిశోర్ నేరుగా మాట్లాడారు. అనంతరం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి, ఫిర్యాదులను నిబంధనల మేరకు పరిష్కరించాలన్నారు.


