అమలాపురం టౌన్: జిల్లాలో ఉన్న సముద్ర జలాలు చమురు సంస్థల డ్రిల్లింగ్ ఆపరేషన్ల వల్ల కలుషితం అవుతున్నాయని, ఫలితంగా లక్షలాది మంది మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటోందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్‌కు సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోనసీమ మత్స్యకారులకు 14 మీటర్లతో ఉండే సోనా బోట్స్ మాత్రమే అందుబాటులో ఉంటున్నాయని, సముద్ర లోతు జలాల్లో ఉండే టూనా చేపలను వేటాడాలంటే 22 మీటర్లతో హైడ్రాలిక్ లిఫ్ట్ కలిగినవి ఉండాలని చెప్పారు. 100 శాతం సబ్సిడీతో వాటిని చమురు సంస్థలు సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధుల కింద అందించాలని డిమాండ్ చేశారు. విదేశాల్లో మత్స్యకారుల సేవలకు గాను అమలులో ఉన్న డీహెచ్‌ఎఫ్ హై ఫ్రీకెన్సీ వాట్యాప్, హ్యామ్ రేడియోలను మన రాష్ట్రంలోనూ పునరుద్ధరించాలని కోరారు.


