ఆపాలనా కుట్ర | - | Sakshi
Sakshi News home page

ఆపాలనా కుట్ర

Aug 17 2026 12:17 AM | Updated on Aug 17 2026 12:17 AM

పాలనలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి చేర్చుతున్న వారిపై చంద్రబాబు ప్రభుత్వం విషం చిమ్మింది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారికి ఇచ్చే గౌరవ వేతనాలకు బ్రేక్‌ ఇచ్చింది.. అదేదో నిధులు లేకననుకుంటే పొరపాటే. ఈ ప్రజాప్రతినిధుల్లో 90 శాతం మంది వైఎస్సార్‌ సీపీకి చెందిన వారు ఉండడంతో కుట్రకు తెరలేపింది. ఆ తెర వెనుక కథంటో తెలుసుకుందాం రండి..

కపిలేశ్వరపురం: కూటమి ప్రభుత్వం వస్తే ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు పెంచుతామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు.. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా, కొసరు లేకపోగా అసలుకే ఎసరు పెట్టారు.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై వ్యత్యాసం చూపుతున్నారు. 90 శాతానికి పైగా ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు వైఎస్సార్‌ సీపీకి చెందిన వారే కావడంతో 25 నెలలుగా అవస్థలకు గురిచేస్తున్నారు. వచ్చే నెల 23తో ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీకాలం ముగియనుంది. గౌరవ వేతనాలు ఎప్పుడు ఇస్తారో అర్థం కావడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో 2021 ఏప్రిల్‌ 8న పరిషత్‌ ఎన్నికలు నిర్వహించారు. అదే ఏడాది సెప్టెంబర్‌ 19న లెక్కింపు చేపట్టారు. 90 శాతం పైగా స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు గెలుపొందారు. అప్పటికి రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గంలో 20 ఎంపీటీసీ స్థానాలు, రాజానగరంలో 57, అనపర్తిలో 76, మండపేటలో 60 స్థానాలుండేవి. జిల్లాల పునర్విభజనలో అప్పటి పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాలు తూర్పుగోదావరి జిల్లాలో విలీనం అయ్యాయి. ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లాలో 343 పంచాయతీల పరిధిలో 390 ఎంపీటీసీ, 21 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. ఉమ్మడి జిల్లాలో 61 మంది జెడ్పీటీసీ సభ్యులు, 980 మంది ఎంపీటీసీలు ఉన్నారు.

ఆ మూడేళ్లూ ప్రాధాన్యం

ఎంపీటీసీ, జెడ్పీటీసీల పాలనాకాలంలో తొలి మూడేళ్లు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో, చివరి రెండేళ్లు చంద్రబాబు ప్రభుత్వ కాలంలో గడిచింది. అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఇంటికే పింఛన్లు, వైద్యం, రేషన్‌ సరుకులు అందించడండో పాటు ఆరోగ్యశ్రీని బలోపేతం చేసింది. సచివాలయ, వలంటీర్‌ వ్యవస్థలతో ప్రభుత్వం తాలూకు పని గంటల్లోనే పూర్తయ్యేది. దీంతో వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ సభ్యులు గ్రామాల్లో సగౌరవంగా తిరిగేవారు. ఎంపీటీసీ సభ్యుల్లో 50 శాతం మంది మహిళలు కావడంతో దిశ చట్టం రూపకల్పన వారికి గొప్పగా కనిపించింది. ఇప్పుడు ఆఖరి రెండేళ్లు కూటమి ప్రభుత్వ పాలనలో తీవ్ర వివక్షకు గురవుతున్నారు.

ఏ సంక్షేమమూ లేదు

స్థానిక ప్రజలకు ఏదో మంచి చేద్దామని ఎంపీటీసీ అయ్యాను. మొదటి మూడేళ్లు ప్రభుత్వమే మా తరఫున ప్రజలకు మేలు చేసింది. తర్వాత కూటమి ప్రభుత్వంలో ఏ సంక్షేమమూ లేదు. అభివృద్ధి లేదు. కనీసం ఎంపీటీసీలకు స్వతంత్రంగా ఉండే హక్కులను కూడా వినియోగించుకోనీయడం లేదు. అలాగని గౌరవ వేతనాలు అందించడం లేదు.

–పలివెల మధు, ఎంపీటీసీ సభ్యుడు,

వడ్లమూరు, కపిలేశ్వరపురం మండలం

కూటమి వచ్చాక దూరమైన గౌరవం

ఎంపీటీసీ సభ్యుడికి నెలకు రూ.మూడు వేలు, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులకు రూ. ఆరు వేల చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలి. తాము అధికారంలోకి వస్తే గౌరవ వేతనాలను పెంచుతామంటూ చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక పెంచకపోగా, ఇవ్వాల్సిన గౌరవ వేతనాలకు బ్రేక్‌ ఇచ్చారు. ఎంపీపీల గౌరవ వేతనాన్ని రూ.25 వేలు, ఎంపీటీసీ సభ్యుల గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచాలన్న డిమాండ్‌ను ఖాతరు చేయడం లేదు. 2021 సెప్టెంబర్‌ చివరి వారంలో ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో 2023 డిసెంబర్‌ వరకూ గౌరవ వేతనం చెల్లించారు. 2024లో చెల్లించేందుకు చర్యలు తీసుకోగా, సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ అడ్డంకి అయ్యింది. 2024 జూన్‌ 12న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బకాయిలతో విసిగివేశారిన ఎంపీటీసీలు ఈ ఏడాది జనవరి 21న గౌరవ వేతనాలు చెల్లించాలంటూ జెడ్పీ అధికారులకు విన్నవించారు. ఈ ఏడాది జూలై 17న జెడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాల్‌కు వినతిపత్రం అందజేశారు. జూన్‌ 19న పిఠాపురం మండల పరిషత్‌ సమావేశం నుంచి ఎంపీటీసీ సభ్యులు వాకౌంట్‌ చేశారు. కూటమి పాలనలో వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ప్రాధాన్యం కల్పించకపోవడం విమర్శలకు తావిచ్చింది.

ఈ రెండేళ్లూ అధ్వానం

చంద్రబాబు ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను తీసికట్టుగా చూస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో వారిని అగౌరవపర్చిన ఘటనలున్నాయి. చేసేదిలేక వారంతా ప్రభుత్వంపై పోరాటానికి దిగారు. ఈ ఏడాది మార్చి 6న విజయవాడలోని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కార్యాలయం ఎదుట రాష్ట్రంలోని ఎంపీటీసీ, ఎంపీపీలు ధర్నా చేశారు. ఈ ఏడాది జనవరి 21న కాకినాడలో జిల్లా పరిషత్‌ అధికారులకు తమ గౌరవ వేతనాన్ని చెల్లించాలంటూ వినతి పత్రాన్ని అందించారు. వాటితో పాటు సామాజిక అంశాలపైనా ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ప్రజాక్షేత్రంలో పోరాడారు. ఈ నెల 10న డీఎస్సీ నిర్వహణపై విచారణ కోరుతూ బొమ్మూరు, మండపేట, ఉండ్రాజవరం, కొవ్వూరు, బిక్కవోలులలో నిరసన ర్యాలీల్లో వీరోచితంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. జూలై 29న రాజమహేంద్రవరంలో విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

ప్రజాప్రతినిధులపై

విషం కక్కిన చంద్రబాబు ప్రభుత్వం

రెండేళ్లుగా గౌరవ వేతనాలకు బ్రేక్‌

వచ్చే నెలతో ముగియనున్న

ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీకాలం

అయినా నిధుల విడుదలకు ససేమిరా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement