కారుచీకటిలో ఆఖరి మజిలీ | - | Sakshi
Sakshi News home page

కారుచీకటిలో ఆఖరి మజిలీ

Aug 17 2026 12:17 AM | Updated on Aug 17 2026 12:17 AM

సఖినేటిపల్లి/ఇరగవరం: స్నేహితుడి బంధువు ఇంట వివాహానికి వెళ్లి సందడి చేసి తిరిగి వచ్చేటపుడు వారు చెప్పినదే తుది వీడ్కోలు అవుతుందని వారికి తెలీదు. తిరుగు పయనంలో వారిని గోదారమ్మ మింగేస్తుందని వారికేం తెలుసు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం అయితంపూడి లాకుల వద్ద శనివారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో కారు అదుపు తప్పి నరసాపురం కాలువలోకి దూసుకువెళ్లి నలుగురు బీటెక్‌ విద్యార్థులు మృతి చెందగా ఒకరు గల్లంతై, ఒక విద్యార్థి ప్రాణాలు దక్కించుకున్నాడు. వివరాల్లోకి వెళితే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని సఖినేటిపల్లి మండలం మోరి, మోరిపోడు, ఉయూరివారి మెరక గ్రామాలకు చెందిన చెరుకువాడ రామ్‌చరణ్‌ అలియాస్‌ రాజారామ్‌ (17), పోతుల లక్ష్మీభాను వికాస్‌ (19), నాగిరెడ్డి దస్వంత్‌ సాయి (18), నరసాపురానికి చెందిన నాగాబత్తుల సాయిసూర్యతేజ (19), మట్టా సంతోష్‌, పాలకొల్లు మండలం చింతపర్రుకు చెందిన వీరమల్లు వెంకట సాయికిరణ్‌ (19) నరసాపురంలోని స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతున్నారు. వారంతా స్నేహితుడి బంధువు ఇంట జరిగిన వివాహానికి కారులో తూర్పుగోదావరి జిల్లా పెరవలి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అయితంపూడి లాకుల వద్ద కారు అదుపు తప్పి సరాసరి కాలువలోకి దూసుకుపోయింది. కారులోని వారంతా గల్లంతవగా స్థానికుల సాయంతో ప్రమాదం నుంచి బయటపడిన సంతోష్‌ ఆ విషయాలు వెల్లడించాడు. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది సహకారంతో హుటాహుటిన సహాయకచర్యలు చేపట్టారు. ప్రమాదస్థలికి రెండు కిలోమీటర్ల దూరంలో లక్ష్మీభాను వికాస్‌, దస్వంత్‌సాయి, సాయిసూర్యతేజ, సాయికిరణ్‌ మృతదేహాలు లభ్యం కాగా, రామ్‌చరణ్‌ కోసం గాలిస్తున్నారు. నలుగురి మృతదేహాలను తణుకు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఒక్కడే కొడుకు..

ప్రమాదంలో మృతి చెందిన లక్ష్మీభాను స్వస్థలం సఖినేటిపల్లి మండలం మోరిపోడు. అతని తల్లిదండ్రులు పోతుల శ్రీనివాసరావు, దేవి. శ్రీనివాసరావు జీడిపప్పు వ్యాపారం చేస్తున్నాడు. వీరిది మధ్యతరగతి కుటుంబం. వారి కుమార్తె ప్రవల్లిక కిమ్స్‌ ఆసుపత్రిలో వైద్య విభాగంలో పనిచేస్తోంది. ఇంజినీర్‌ అయ్యి కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడనుకున్న కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేక వారు భోరున విలపిస్తున్నారు.

తల్లిదండ్రులకు కడుపుకోత..

మరో విద్యార్థి దస్వంత్‌ స్వస్థలం సఖినేటిపల్లి మండలం ఉయ్యూరువారి మెరక. అతని తల్లిదండ్రులు నాగిరెడ్డి సురేష్‌, శ్యామల. సురేష్‌ మలికిపురం ఎల్‌ఎస్‌ ల్యాండ్‌మార్క్‌లో ఉద్యోగి. వీరిదీ మధ్య తరగతి కుటుంబమే. వారి ఇద్దరి కుమారుల్లో దస్వంత్‌ రెండవ వాడు. పెద్ద కొడుకు నెహేన్‌ సాయి హైదరాబాదులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. దస్వంత్‌ మరణాన్ని తట్టుకోలేక ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రయోజకుడవుడాడనుకున్నంతలో కడుపుకోత మిగిల్చాడని గుండెలవిసేలా రోదిస్తున్నారు.

చెట్టుకొమ్మల ఆసరాగా బయటపడి..

ప్రమాదం నుంచి బయటపడిన సంతోష్‌ తాను బయటపడిన విధానాన్ని వివరిస్తూ ప్రమాదం జరిగిన వెంటనే తనకు దొరికిన చెట్టుకొమ్మలను పట్టుకొని కారు పైకి ఎక్కానని, తనకు ఈత రావడంతో వెంటనే అక్కడి నుంచి ఒడ్డుకు చేరుకున్నానని తెలిపాడు. అర్ధరాత్రి చీకటి కావడంతో తాము ఎక్కడ ఉన్నామో తెలియక అయోమయ పరిస్థితి ఎదుర్కొన్నట్టు చెప్పాడు. తన స్నేహితులను కాపాడుకోలేకపోయానని కన్నీరుమున్నీరయ్యాడు.

మృతులు లక్ష్మీ భానువికాస్‌ దుస్వంత్‌సాయి సాయి సూర్యతేజ వెంకట సాయికిరణ్‌

కాలువలోకి కారు దూసుకువెళ్లి

నలుగురి మృతి

ప్రమాద సమయంలో

ఆరుగురు విద్యార్థులు

ఒకరు గల్లంతు

సురక్షితంగా బయటపడ్డ ఓ విద్యార్థి

స్నేహితుని బంధువు ఇంట

వివాహానికి వెళ్లి వస్తుండగా ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement