
విద్యారంగ సమస్యలపై 25న చలో కలెక్టరేట్
కాకినాడ సిటీ: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన తలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమ పోస్టర్‌ను శుక్రవారం స్థానిక పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద సంఘ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.శ్రీకాంత్, ఎం.గంగాసూరిబాబు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన జాతీయ విద్యావిధానం పేరు చెప్పి విద్యను మొత్తం ప్రైవేటీకరణ, కేంద్రీకరణ, కషాయీకరణ చేస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రభుత్వ విద్యారంగంలోని పెండింగ్‌లో ఉన్న రూ.64 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 77ను రద్దు చేసి, ప్రైవేట్ కాలేజీలో పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని వర్తింపజేయాలని చెప్పారు. హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు రూ.3 వేలకు పెంచి, హాస్టల్‌కు శాశ్వత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘ నగర అధ్యక్షుడు ఎ.వాసుదేవ్, జిల్లా కమిటీ సభ్యులు చిన్ని, జైశ్రీరామ్, నగర నాయకులు సత్యం, ఆదర్శ్ కార్త్తిక్, తేజ తదితరులు పాల్గొన్నారు.