
శాంతించినది
● ధవళేశ్వరం వద్ద మరింత తగ్గిన నీటి ఉధృతి
● ఈ వరదల సీజన్‌లో ఇప్పటివరకు
1,547 టీఎంసీల మిగులు జలాలు
కడలి పాలు
ధవళేశ్వరం: ఉగ్రరూపం దాల్చి ఉరకలెత్తిన గోదారమ్మ శాంతించింది. ఆదివారం నీటి ఉధృతి క్రమక్రమంగా తగ్గుముఖం పట్టడంతో మిగులు జలాల విడుదలను తగ్గించారు. కాటన్ బ్యారేజీ వద్ద ఆదివారం సాయంత్రం నీటి మట్టం 8.90 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 4,75,331 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. డెల్టా కాలువలకు సంబంధించి 14,100 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఇందులో తూర్పు డెల్టాకు 4,600, మధ్య డెల్టాకు 2,500, పశ్చిమ డెల్టాకు 7,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మరోపక్క ఎగువ ప్రాంతాల్లోనూ నీటి ఉధృతి తగ్గుముఖం పట్టడంతో సోమవారం కాటన్ బ్యారేజీ వద్ద నీటి ఉధృతి మరింత తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 7.72 మీటర్లు, పేరూరులో 12.44 మీటర్లు, దుమ్ముగూడెంలో 9.35 మీటర్లు, భద్రాచలంలో 32.30 అడుగులు, కూనవరంలో 14.58 మీటర్లు, కుంటలో 6మీటర్లు, పోలవరంలో 10.41 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్ వద్ద 14.80 మీటర్ల వద్ద నీటి మట్టాలు కొనసాగుతున్నాయి.
1,547 టీఎంసీల మిగులు జలాలు కడలి పాలు
ఈ ఏడాది వరదల సీజన్ ప్రారంభమైన నాటి నుంచి ఆదివారం వరకు 1,547టీఎంసీల మిగులు జలాలు కడలి పాలయ్యాయి. ఈ నెల 21వ తేదీన కాటన్ బ్యారేజీ వద్ద ప్రమాద స్థాయికి గోదావరి ప్రవాహం చేరింది. దీంతో ఈ నెల 21న మొదటి ప్రమాద హెచ్చరికను, 22వ తేదీన రెండవ ప్రమాద హెచ్చరికను ప్రకటించారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో పాటు ఎగువ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయడంతో గోదావరి ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి పొంగిపొర్లాయి. దీంతో కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మూడు రోజులపాటు గోదావరి ప్రమాద స్థాయిలో ప్రవహించింది. ఈ నెల 22వ తేదీన 117 టీఎంసీల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. డెల్టా కాలువలకు మినహాయించి ఇప్పటివరకు 1,547 టీఎంసీల నీరు కడలిలో కలిసింది. సెప్టెంబర్ నెలలో కూడా గోదావరికి వరదలు సంభవించే అవకాశం ఉన్న దృష్ట్యా మిగులు జలాలు మరింత పెరిగే అవకాశం ఉంది.