
మౌలిక సదుపాయాలపై దృష్టి
రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (రుడా) పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో రుడా మాస్టర్ ప్లాన్, గోదావరి పుష్కరాలపై కలెక్టర్ పి.ప్రశాంతితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో రుడా ప్రతిపాదిత అంశాలపై వివరించారు. 3,156 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మాస్టర్‌ప్లాన్‌రూపొందించవలసి ఉండగా ప్రస్తుతం 1,005 చదరపు కిలోమీటర్లతో మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ సిద్ధంగా ఉన్నట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గోదావరి పుష్కరాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు. పుష్కర యాత్రికుల కోసం రహదారుల అభివృద్ధి, ప్రత్యేక మార్గాల ఏర్పాటు, ఘాట్ల వద్ద ఆధునిక సదుపాయాల కల్పన, పారిశుధ్యం, భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు ఘాట్ల అభివృద్ధి, రహదారులు, పారిశుధ్యం వంటి ఏర్పాట్లు సమయానికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రుడా వైస్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్న రాముడు, సెక్రటరీ ఎం.వి.ఆర్ సాయిబాబా, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ జి.వి.ఎస్.ఎన్.మూర్తి, రుడా ప్లానింగ్ ఆఫీసర్ ఎన్.శ్రీనివాస్ పాల్గొన్నారు.
డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా
రాయవరం: 2025 డీఎస్సీ మెరిట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా పడింది. డీఎస్సీ మెరిట్ అభ్యర్థుల జాబితా విడుదలైన నేపథ్యంలో సర్టిఫికెట్ల పరిశీలన సోమవారం నిర్వహించేందుకు గొల్లప్రోలు మండలం ఆదర్శ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. దీనికోసం 25 టీమ్‌లకు శిక్షణ ఇచ్చింది. ఆదివారం రాత్రి వరకూ అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌కు సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించిన సమాచారం వస్తుందని ఎదురు చూశారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా పడినట్లు విద్యాశాఖ అధికారుల నుంచి సమాచారం వచ్చింది.
డొక్కా సీతమ్మ జీవిత చరిత్రపై
డాక్యుమెంటరీ
పి.గన్నవరం: అపర అన్నపూర్ణగా పేరొందిన డొక్కా సీతమ్మ వారి జీవిత చరిత్రపై డాక్యుమెంటరీ తీస్తున్నట్టు గౌరీ బ్రదర్స్ మీడియా బ్లాక్ అండ్ వైట్ మూవీ మార్క్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇందులో భాగంగా ఎల్.గన్నవరంలో ఆదివారం షూటింగ్ జరిపారు. రెండు రోజులపాటు ఎల్.గన్నవరం, అయోధ్యలంక ల్లో షూటింగ్ జరుగుతుందని ప్రతినిధులు తెలిపారు. ఈ డాక్యుమెంటరీకి శ్రీఅన్నపూర్ణ తల్లి బువ్వమ్మశ్రీగా నామకరణం చేసినట్టు వారు వివరించా రు. ఈ డాక్యుమెంటరీకి సురేష్ లంకలపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతలుగా సిరాజ్, ఖాదర్, నటీనటులుగా సముద్ర, సిలికా తనేజా, ఆదిల్, రమేష్, కు సుమ, కెమెరా ఆర్యసాయి కృష్ణ, సంగీతం సాకేత్‌వేణి, ఎగ్జిక్యూటివ్ మేనేజర్‌గా పి.శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు.
ఘనంగా
సత్యదేవుని రథసేవ
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి సన్నిఽధిలో ఆదివారం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని ఆలయ ప్రాకారంలో టేకు రథంపై ఘనంగా ఊరేగించారు. ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తూర్పురాజగోపురం వద్దకు తీసుకువచ్చి రథంపై ప్రతిష్ఠించారు. అనంతరం అర్చకస్వాములు పూజలు చేసి రథ సేవ ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛాటన మధ్య, మంగళవాయిద్యాల నడుమ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రాగా, స్వామి, అమ్మవార్లను మూడుసార్లు ఆలయ ప్రాంగణంలో రథంపై ఊరేగించారు. ఊరేగింపు అనంతరం స్వామి, అమ్మవార్లకు మళ్లీ పూజలు చేసి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

మౌలిక సదుపాయాలపై దృష్టి