
వేద సారమే రామ నామం
● శ్రీమద్రామాయణ పారిజాత
ప్రసూనాలు పుస్తకావిష్కరణ
● అర్ష విజ్ఞాన పరిషత్తు నగర శాఖ
ప్రారంభం
సీటీఆర్‌ఐ: వేద సారమే రామ నామమని సాహితీ సర్వజ్ఞ పోతుకూచి సూర్యనారాయణమూర్తి అన్నారు. వారణాసి సుబ్రహ్మణ్యం రచించిన శ్రీశ్రీమద్రామాయణ పారిజాత ప్రసూనాలుశ్రీ పుస్తకావిష్కరణ సభ స్థానిక కోటిపల్లి బస్టాండ్ దగ్గర గల స్వాతంత్య్ర సమరయోధుల పార్కు భవనంలో ఆదివారం ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. పలువురు సాహితీ ప్రియులు విచ్చేసిన ఈ సభకు డాక్టర్ శ్రీపాద సీతామహాలక్ష్మి స్వాగత వచనాలు పలికారు. సాహితీ సర్వజ్ఞ పోతుకూచి సూర్యనారాయణమూర్తి గ్రంథాన్ని ఆవిష్కరించగా, తొలి ప్రతి దేశిరెడ్డి బలరామనాయుడు కొనుగోలు చేశారు. కళాగౌతమి వ్యవస్థాపకుడు డాక్టర్ బులుసు వేంకట సత్యనారాయణమూర్తి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ వేద విద్య చేత తెలుసుకోతగిన పరమ పురుషుడే శ్రీరాముడన్నారు. వేదాలు అందరికీ గ్రాహ్యం కావని, రామాయణం ద్వారా వేద ధర్మాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవచ్చునని అన్నారు. కుటుంబంలో కొడుకుగా, భర్తగ, భార్యగా, తండ్రిగా, తల్లిగా, సోదరుడిగా ఎలా ఉండాలో రామాయణం మనకు చెబుతుందన్నారు. పద్యకవి, తెలుగు పండితుడు డాక్టర్ డి.నీలకంఠరావు పుస్తక సమీక్ష చేస్తూ మానవుడికి దిశా నిర్దేశం చేసే కరదీపికగా, వ్యక్తిత్వ వికాసం బోధించేదిగా ఈ పుస్తకాన్ని అభివర్ణించారు. విశ్రాంత అధ్యాపకురాలు డాక్టర్ టి.జయప్రద స్పందన తెలియజేస్తూ, విలువలు పడిపోతున్న నేటి సమాజానికి ఇలాంటి పుస్తకాల అవసరం ఎంతో ఉందన్నారు.
ఎస్‌కేవీటీ కాలేజీ లెక్చరర్ విశాలాక్షి మాట్లాడుతూ రామాయణం అంటే రాముడి ప్రయాణం అన్నారు. ప్రతి ఇంట్లో తమ పిల్లలకు రామాయణ, మహాభారతాల కథలను తల్లిదండ్రులు విధిగా చెప్పాలన్నారు. రచయిత వారణాసి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రామాయణం ఎంత ప్రాచీనమో అంత ఆధునికమన్నారు. వర్తమాన సమాజంలోని అనేక సమస్యలకు సమాధానాలు రామాయణంలోలభిస్తాయని అన్నారు. నాట్యాచార్య సప్పా దుర్గాప్రసాద్, ధర్మసూరి మాట్లాడారు. వారణాసి సుబ్రహ్మణ్యంను పలువురు సత్కరించారు. ఆర్షవిజ్ఞాన పరిషత్తు నగర శాఖను సంస్థ ప్రతినిధి ధర్మసూరి ఏర్పాటు చేశారు.