
ఆటో డ్రైవర్ల నిరసన
గోపాలపురం: ఆర్‌టీసీ ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించి మా పొట్ట కొట్టారంటూ గోపాలపురం ఫ్రెండ్స్ ఆటో యూనియన్ సభ్యులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన కూటమి ప్రభుత్వానికి ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయాన్ని చూపించాల్సిన బాధ్యత లేదా అని యూనియన్ అధ్యక్షుడు కోయ సురేష్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 రోజులుగా ఆటోలు కదలక నానా అవస్థలు పడుతున్నామని, ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో వాహన మిత్ర ద్వారా రూ.15 వేలు అందించి ఆటో డ్రైవర్లను ఆదుకున్నారని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాహనమిత్ర నగదు జమ చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని తుంగలో తొక్కి ఆటో డ్రైవర్ల కడుపు కొట్టడం ఎంత వరకూ సమంజసం అని అన్నారు. ఇప్పటికై నా ఆటో డ్రైవర్ల కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఆదుకోకపోతే ఉద్యమబాట పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని నాలుగు ఆటో యూనియన్ల సభ్యులు పాల్గొన్నారు.