
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
కోరుకొండ: కాపవరంలోని ఓ ఇంట్లో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు నార్త్‌జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ తెలిపారు. ఆదివారం కోరుకొండ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపవరంలోని ఓ ఇంట్లో బెట్టింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు సీఐ సత్యకిషోర్ ఆధ్వర్యంలో దాడి చేశారన్నారు. అక్కడ ఆసియా–బెల్జియం క్రికెట్ లీగ్ మ్యాచ్‌కు బెట్టింగ్ ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తున్నట్టు నిర్ధారించారు. ఇందులో నలుగురు నిర్వాహకులను అరెస్ట్ చేశామన్నారు. వారి నుంచి రూ. 8.40 లక్షలు, 8 మొబైల్ ఫోన్లు, ఎల్‌ఈడీ టీవీ, స్కూటీలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇందులో కోరుకొండకు చెందిన గోసంశెట్టి వీరప్రసాద్, కావరానికి చెందిన జాజుల బాలచక్రం, గోవరం మండలం అచ్యుతాపురానికి చెందిన నల్లాల లక్ష్మీనరసయ్య, గుమ్మళ్లదొడ్డికి చెందిన కొణతాల నానాజీలను అరెస్ట్ చేశామని అన్నారు. ఈ వ్యవహారంలో విశాఖపట్నానికి చెందిన రాకేశ్‌తో పాటు మరో ఏడుగురు నిందితులను అరెస్టు చేయనున్నట్టు డీఎస్పీ తెలిపారు. నిందితులను సోమవారం కోర్టులో హాజరుపర్చనున్నట్టు పేర్కొన్నారు. అపరిచితులకు ఇళ్లు అద్దెకివ్వొద్దని, వారి ద్వారా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని హెచ్చరించారు. బెట్టింగ్లు, పేకాట, అసాంఘిక కార్యకలాలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ కేసును ఛేదించడానికి కృషి చేసిన కోరుకొండ సీఐ సత్యకిషోర్, పోలీస్ స్టేషన్ ఎస్సై కేవీ నాగార్జున, రైటర్ వాసంశెట్టి శ్రీను, కానిస్టేబుల్ వరప్రసాద్, సీతానగరం కానిస్టేబుల్ రమేష్, సీఐ కార్యాలయ కానిస్టేబుల్ గోవిందు, గోకవరం పోలీస్ స్టేషన్ హోంగార్డు సతీష్‌లను అభినందించారు. ఎస్సైలు డి.రామ్‌కుమార్, బి.అంజలి పాల్గొన్నారు.
నీట్‌లో మెరిసిన ముత్యం
తొలి ప్రయత్నంలోనే యామిని ప్రతిభ
పెద్దాపురం: నీట్ ఫలితాల్లో కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తిరుపతి గ్రామానికి చెందిన మాసా యామిని సౌమ్యశ్రీ ప్రతిభ చాటింది. రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలో తొలి ప్రయత్నంలోనే ఆమెకు సీటు దక్కింది. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయం ఆదివారం ప్రకటించిన నీట్ ఫలితాల్లో ఈ మేరకు ఆమె ఉచిత సీటును దక్కించుకుంది. యామిని డాక్టర్ కావాలనే లక్ష్యంతో విద్య కొనసాగించింది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఈడుపుగల్లు ఐఐటీ నీట్ అకాడమీలో ఆమె ఇంటర్‌తో పాటు ప్రత్యేక శిక్షణ పొందింది. తండ్రి మాసా చంద్రరావు పారా లీగల్ అడ్వయిజర్ కాగా, తల్లి అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తుంది. యామిని తన లక్ష్యాన్ని చేరుకోవడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
● రూ.8.40 లక్షల స్వాధీనం ● నిందితుల అరెస్ట్

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్