
ఎవరో అతగాడు!
● కలకలం రేపిన సీఐ వ్యవహారం
● ఎక్కడ చూసినా ఇదే చర్చ
● ఇప్పటికే ఇంటెలిజెన్స్,
ఎస్‌బీ అధికారులు నివేదికలు
● సీఐకి అండగా ఇద్దరు ఉన్నతాధికారులు
● బయటకు వస్తున్న అవినీతి కథలు
సాక్షి, టాస్క్‌పోర్స్: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు డివిజన్‌లో పని చేస్తున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అక్రమ వ్యవహారం పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. ఆ సీఐ అడ్డగోలు తీరుపై ఇటీవల సాక్షి పత్రికలో శ్రీఆ సర్కిల్ సెపరేటుశ్రీ శీర్షికతో ప్రచురితమైన కథనం సంచలనం రేపింది. పోలీసు శాఖలో ఎవరి నోట విన్నా.. ఎవరా సీఐ ? అంటూ ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఆ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నా, సదరు వ్యక్తిపై కనీస చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న పోలీసు శాఖలో ఉత్పన్నమవుతున్నట్లు సమాచారం. అతడు పనిచేసిన ప్రతి చోటా అవినీతి పనులు చేస్తూనే ఉంటాడని, అందుకు జిల్లాలో బలమైన ఉన్నతాధికారులకు ముడుపులు చెల్లించి, తను పనులను యథేచ్ఛగా చేసుకుంటాడని చెబుతున్నారు. ఆ సీఐపై వచ్చిన కథనం నిజమని ఇప్పటికే ఇంటిలిజెన్స్, ఎస్‌బీ అధికారులు నివేదికలు సమర్పించారని చెప్పుకుంటున్నారు.
సిబ్బందికి ఇబ్బందులు
ఆయన ఇలాకాలోని నాలుగు పోలీస్ స్టేషన్లలో జరుగుతున్న తీరు మాత్రం చాలా విచిత్రంగా ఉంది. సాధారణంగా పోలీస్ స్టేషన్‌లో ఎవరు ఏ విధులు నిర్వర్తించాలి, ఎవరు రైటర్‌గా ఉండాలి, ఎక్కడ పనిచేయాలని, ఎవరికి డ్యూటీ వేయాలనేది స్థానిక ఎస్సై చూసుకుంటారు. కానీ దానికి విరుద్ధంగా కానిస్టేబుల్ నుంచి ఎస్సై వరకూ అన్ని డ్యూటీలను ఈ సీఐ వేస్తారు. ఇప్పటికే ఈయన పనితీరు నచ్చక ముగ్గురు ఎస్సైలు స్వచ్ఛందంగా బదిలీపై వెళ్లిపోయారు.
అనేక అక్రమాలు
సీఐ అవినీతి బాగోతం బయట పడిన తర్వాత అనేక కొత్త అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. గతంలో ఒక చీటింగ్ కేసులో ముద్దాయిని హైదరాబాద్‌లో అరెస్టు చేసి, అతడి వద్ద లక్షల్లో సొమ్ములు బలవంతంగా దండుకున్నారని ఆరోపణ వచ్చింది. ఇటీవల ఒక మండలంలో భారీగా బంగారం చోరీ జరిగితే, రికవరీ కేసులో అన్ని తానై నడిపించి, బంగారం సైడ్ చేశారనే ఆరోపణలున్నాయి. దీనిపై బాధితుడు ఒక ప్రజాప్రతినిధితో సీఐకి ఫోన్ చేయించినా పట్టించుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. రిసార్టుల్లోనే కాకుండా అన్ని మండలాల్లోని లాడ్జిల్లో గదులు వినియోగించుకున్నట్టు చెబుతున్నారు. ఇటువంటి అవినీతి అధికారికి రాజకీయంగా, శాఖాపరంగా అండదండలు ఉన్నాయని గుసగుసలాడుకుంటున్నారు.