
అన్నవరప్పాడులో భక్తుల రద్దీ
పెరవలి: శ్రావణ మాసంలోని ఆఖరి శనివారం కావడంతో అన్నవరప్పాడులోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి వేల మంది భక్తులు తరలివచ్చారు. స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం దర్శనం కల్పించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. అనేక మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. దాతల ఆర్థిక సాయంతో 8,500 మందికి అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రతి శనివారం దాతల సహకారంతో అన్నసమారాధన నిర్వహిస్తున్నామని, ప్రసాదాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు.
టంగుటూరి పోరాటం అందరికీ ఆదర్శం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): స్వాతంత్య్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం, ఆయన చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో శనివారం టంగుటూరి జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ టంగుటూరి నిజాయితీ, ధైర్యం, ప్రజాసేవ.. నేటి తరానికి మార్గదర్శకమన్నారు. మద్రాసులో జరిగిన సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో బ్రిటిష్ అధికారులను ఎదిరించి, తుపాకీకి గుండెను చూపిన ఆయన సాహసం ఎన్నటికీ మరువలేమన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి సీతారామమూర్తి, జిల్లా సర్వే అధికారి బి.లక్ష్మీనారాయణ, ఏఓ అలీ, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్సీ యువతకు
డ్రైవింగ్ శిక్షణ
రాజానగరం: భారీ వాహనాల డ్రైవింగ్‌పై షెడ్యూల్ కులాల యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఆసక్తి కలవారు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ జేఏ ఝాన్సీ అన్నారు. అభ్యర్థులకు 20 ఏళ్లు పైబడి వయసు, లైట్ వెహికల్ లైసెన్స్ ఉండాలన్నారు. జిల్లాలో ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలను ఎంపిక చేసి, వారికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్లో ఉచితంగా శిక్షణ ఇస్తారన్నారు. దీని కోసం ఈ నెల 27వ తేదీ లోపు ఎస్సీ కార్పొరేషన్, కాకినాడకు దరఖాస్తులు అందజేయాలన్నారు. ఇతర వివరాలకు 76719 49476 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
జిల్లాలో 2.52 లక్షల మంది నిరక్షరాస్యులు
అనపర్తి: జిల్లాలో 2.52 లక్షల మంది నిరక్షరాస్యులను సర్వే ద్వారా గుర్తించినట్లు జిల్లా వయోజన విద్య నోడల్ అధికారి అనిశెట్టి వెంకట్రావురెడ్డి తెలిపారు. అనపర్తి మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి మండ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శనివారం వలంటీర్లకు అక్షరాస్యతపై శిక్షణ తరగతులు నిర్వహించా రు. ఈ సందర్భంగా వెంకట్రావురెడ్డి మాట్లాడు తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉల్లాస్, అక్షరాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలి దశలో 79,528 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చర్య లు చేపట్టామన్నారు. ఇందుకోసం 7,950 మంది వలంటీర్లను ఎంపిక చేశామన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 8న తరగతులు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. అప్పటి నుంచి 2026 మార్చి వరకు 100 గంటల పాటు నిరక్షరాస్యుల ఖాళీ సమయాన్ని బట్టి తరగతులు నిర్వహిస్తామన్నారు.

అన్నవరప్పాడులో భక్తుల రద్దీ