
బాలుడిపై వీధి కుక్కల దాడి
అనపర్తి: ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపర్చిన ఘటన సోమవారం అనపర్తిలో చోటుచేసుకుంది. అనపర్తి తహసీల్దార్ కార్యాలయం వీధిలో పదేళ్ల బాలుడు సాత్విక్ ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అదే సమయంలో వీధిలో ఉన్న కుక్కల గుంపు అతడిపై దాడి చేశాయి. బాలుడు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై కుక్కలను తరమేశారు. బాలుడి చేతికి లోతుగా కుక్కకాటు గాయాలయ్యాయి. బాలుడిని చికిత్స కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు. దినదిన గండంగా మారిన కుక్కల గుంపులను జనావాసాల నుంచి ఊరి బయటకు తరలించకపోతే మరిన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
దివ్యాంగులపై కూటమి సర్కార్ కక్ష
రాయవరం: కూటమి ప్రభుత్వం దివ్యాంగులపై కక్ష కట్టిందని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖండవిల్లి భరత్‌కుమార్ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు సోమవారం వెంటూరులో ఓ ప్రకటన విడుదల చేశారు. అనర్హుల ఏరివేత పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన దివ్యాంగుల పింఛన్లు తొలగించిందని ఆరోపించారు. దీనిపై చిత్తూరు జిల్లాలో దివ్యాంగులు నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఓవైపు పింఛను సొమ్మును పెంచి, మరోవైపు తొలగించి, వారిని రోడ్డుపాలు చేయడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. 2010లో జారీ చేసిన వైకల్య ధ్రువీకరణ పత్రాల్లో వైకల్య శాతాన్ని తగ్గించడం సమంజసం కాదన్నారు. రాబోయే రోజుల్లో ఉపాధి, సంక్షేమ, ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.
జ్యూయలరీ షాపు యజమాని పరారీ
తుని: మోసపూరిత మాటలతో కస్టమర్లను నమ్మించి.. మోసగించిన ఓ జ్యూయలరీ షాపు యజమాని పరారీలో ఉన్నట్టు పట్టణ సీఐ గీతారామకృష్ణ సోమవారం తెలిపారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక నక్కినవీధిలో శ్రీశ్రీనివాసా జ్యూయలరీ పేరుతో సత్యవరం గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు, అతని కుటుంబ సభ్యులు బంగారం షాపు నిర్వహిస్తున్నారు. తుని, కోటనందూరు తదితర మండలాల్లో తమ కస్టమర్లకు అధిక వడ్డీ ఇస్తానని, తక్కువ ధరకే బంగారం ఇస్తానని చెప్పి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశారు. ప్రస్తుతం వెంకటేశ్వరరావు షాపు మూసేసి పరారీలో ఉన్నట్టు తెలిసిందని సీఐ చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. బాధితులు ఇంకా ఉంటే పట్టణ సీఐ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.