
మస్కట్ నుంచి స్వదేశానికి చేరిక
నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి
ఇరుక్కున్న వైనం
అమలాపురం రూరల్: నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి మస్కట్ దేశంలో ఇబ్బందులు పడుతున్న మహిళను కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు స్వదేశానికి రప్పించారు. వివరాలు ఇలా ఉన్నాయి. అమలాపురం పట్టణం వడ్డెగూడేనికి చెందిన బొంతు సుహాసిని(31) ఉపాధి కోసం నకిలీ ఏజెంట్ ద్వారా ఈ ఏడాది మార్చిలో మస్కట్‌కు వెళ్లింది. అక్కడ పనిలో చేరిన ఆమెను యజమాని శారీరకంగా, మానసికంగా వేధించాడు. దీంతో తనను రక్షించి, స్వదేశానికి తీసుకువెళ్లాలంటూ భర్తను వేడుకుంది. ఆమె భర్త కొండలరావు దీనిపై కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులను ఆశ్రయించారు. వారి విన్నపంపై స్పందించిన కలెక్టర్ మహేష్‌కుమార్ వెంటనే భారత రాయబార సంస్థ ద్వారా సంప్రదింపులు జరిపారు. బాధితురాలిని స్వదేశానికి తీసుకురావాలని నోడల్ అధికారి కె.మాధవిని ఆదేశించారు. అధికారులు ఆ నకిలీ ఏజెంట్, మస్కట్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఈ ప్రయత్నాలు ఫలించడంతో భారత విదేశీ రాయబార మంత్రిత్వ శాఖ సహకారంతో సుహాసిని స్వదేశానికి సురక్షితంగా చేరింది. బాధితురాలు సుహాసిని తన బంధువులతో సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ మహేష్‌కుమార్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపింది.