
మరో మూడు రోజులు భారీ వర్షాలు
● అధికారులు అప్రమత్తంగా ఉండండి
● కలెక్టర్ ప్రశాంతి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రానున్న మూడు రోజులూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రశాంతి సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో అధికారులతో ఆమె మాట్లాడారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద నీటి ప్రవాహం పెరుగుతుందని, మంగళవారం నాటికి 10 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేసి, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని తెలిపారు. జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బలహీన వంతెనలు, కల్వర్టులపై వాహన రాకపోకలను నిలిపి వేయాలన్నారు. శిథిలావస్థలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలు, సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలను పరిశీలించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మూడు రోజుల పాటు సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలని, గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు రాకుండా చూడాలన్నారు. ఇప్పటికే జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు.
సమస్యలు పరిష్కరించండి
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు జవాబుదారీతనంతో ఉండాలని కలెక్టర్ ప్రశాంతి అన్నారు. కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి 108 అర్జీలను స్వీకరించారు.