
విక్రమార్కులు
● డీఎస్సీలో అభ్యర్థుల ప్రతిభ
● ఉత్తమ ఫలితాల సాధన
● మెరిట్ లిస్ట్ కోసం ఎదురు చూపులు
● ఉపాధ్యాయ కొలువుపై ఆశలు
● ఉమ్మడి జిల్లాలో 1,241 పోస్టులు
రాయవరం: ఇటీవల జరిగిన డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) 2025 పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో చాలా మంది మంచి మార్కులు సాధించారు. తమకు తప్పకుండా ఉపాధ్యాయ కొలువు లభిస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇదే సందర్భంలో మిగిలిన వారికి ఎన్ని మార్కులు వచ్చాయన్న అంశంపై ఆరా తీస్తున్నారు. డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన స్కోర్ కార్డులను ఎస్‌సీఈఆర్‌టీ విడుదల చేసిన నేపథ్యంలో టీచర్ కొలువు దక్కడంలో ఎవరికెంత అవకాశం ఉందన్న అంశంపై నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు అంచనాలు వేసుకుంటున్నారు. తాము పొందిన మార్కులకు ఉద్యోగం వస్తుందా అనే ఆలోచనలో ఉన్నారు. ఇంకా మెరిట్ లిస్ట్ రానందున తమకు తెలిసిన వారికి ఫోన్లు చేసి మార్కులపై ఆరా తీస్తున్నారు.
ఇదీ పరిస్థితి
పూర్వపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాతిపదికగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ తదితర యాజమాన్యాలకు సంబంధించి 1,241 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా 63,004 దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 38,617 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీటిలో ఎస్‌జీటీ పోస్టులు 423, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 818 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో అధికంగా ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆ తర్వాత సోషల్, బయాలజీ ఖాళీలు ఉన్నాయి. మిగిలిన సబ్జెక్టులు కేవలం రెండంకెల్లో ఖాళీలున్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ విభాగంలో ఎస్‌ఏ (పీఎస్) 03, ఎస్‌ఏ (బీఎస్) 04, ఎస్‌ఏ (పీఈ) 01, ఎస్‌జీటీ పోస్టులు 104 ఖాళీలున్నాయి. ఇవి కాకుండా జోన్–2 పరిధిలో ఏపీ రెసిడెన్షియల్, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ / ట్రైబల్ (గురుకులం) యాజమాన్య పాఠశాలల్లో 348 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో పీజీటీ 49, టీజీటీ 272, పీడీ 03, పీఈటీ 24 పోస్టులు భర్తీ చేయనున్నారు.
మెరిట్ లిస్ట్ కోసం..
నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు మెరిట్ జాబితా కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 1,241 ఖాళీలకు డీఎస్సీని ఈ ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు 10 నెలల అనంతరం ఈ నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్షలు రాసి స్కోర్ కార్డులు పొందిన వారు మెరిట్ లిస్ట్ ప్రకటనకు వేచి చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా మెరిట్ లిస్ట్ పూర్వపు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి రావాల్సి ఉంది. ఆ జాబితా వచ్చిన తర్వాత సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. అయితే సాంకేతిక కారణాలతో మెరిట్ లిస్ట్ విడుదలలో జాప్యం చోటుచేసుకుంటున్నట్లు సమాచారం. ఆ జాబితా వచ్చిన తర్వాతే ఉద్యోగం వచ్చే విషయంపై అభ్యర్థులకు స్పష్టత వస్తుంది.
ఖాళీల వివరాలు
కేటగిరి ప్రభుత్వ/జెడ్పీ/మున్సిపల్ మేనేజ్‌మెంట్లు
ఎస్‌జీటీ 423
ఎస్‌ఏ తెలుగు 65
ఎస్‌ఏ హిందీ 78
ఎస్‌ఏ ఇంగ్లీష్ 95
ఎస్‌ఏ గణితం 64
ఎస్‌ఏ పీఎస్ 71
ఎస్‌ఏ బయాలజీ 103
ఎస్‌ఏ సోషల్ 132
ఎస్‌ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ 210
మొత్తం 1,241