
పోలవరం సమస్యలపై చిత్తశుద్ధి లేదు
కోరుకొండ: పోలవరం ప్రాజెక్టుకు భూములు, ఆస్తులు ఇచ్చి, నిర్వాసితులైన వారి సమస్యల పరిష్కారం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి అన్నారు. ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీల పరిశీలన కోసం తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పర్యటన నిమిత్తం ఇండిగో విమాన సర్వీసులో శనివారం ఉదయం ఆయన రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వచ్చారు. ఆయనతో పాటు రాజ్యసభ సబ్యుడు, సీపీఎం ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిట్టాస్ కూడా ఉన్నారు. వీరికి ఆ పార్టీ నాయకత్వం, శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమై సంవత్సరాలు గడుస్తున్నా నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాకపోవడం శోఛనీయమన్నారు. ఆదివాసీ రైతులు, నిర్వాసితుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి వచ్చామన్నారు. ప్రాజెక్టు కారణంగా 1.06 లక్షల కుటుంబాలు నిర్వాసితులయ్యాయని, వీరిలో 80 శాతం ఆదివాసీయులే ఉన్నారన్నారు. వీరికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ప్రకారం రూ.33 వేల కోట్లు రావాల్సి ఉండగా, ఆ మేరకు నిధులు విడుదల చేయలేదన్నారు. రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ నిర్వాసితుల సమస్యలపై పార్లమెంటులో చర్చను లేవనెత్తుతున్నానన్నారు. కార్యక్రమంలో పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి. అరుణ్, అల్లూరి సీతారామరాజు జిల్లాకార్యదర్శి బి. కిరణ్, కార్యదర్శివర్గసభ్యులు తులసి, పవన్, రాంబాబు, నాయకులు ఎస్‌ఎన్ మూర్తి, సుందరబాబు తదితరులు పాల్గొన్నా రు.