
డేంజరింగ్
● పోలీస్ డీపీలతో ఫోన్‌కాల్ చేసి
బెదిరింపులు
● రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
● భయభ్రాంతులకు గురవుతున్న
అమాయక ప్రజలు
● అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
రాయవరం: హలో.. నేను సీబీఐ ఆఫీసర్‌ని. మీ అబ్బాయి హరీష్ కదూ. మీ అబ్బాయి సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడు కదా. ఏ కంపెనీలో పని చేస్తున్నాడు? అంటూ ఓ ఫోన్‌కాల్. ఇటువైపు వ్యక్తి సమాధానాలు చెప్పగానే.. మీ అబ్బాయి డ్రగ్స్ విక్రయిస్తూ మాకు పట్టుబడ్డాడు. పది నిమిషాల్లో మా దగ్గరికి వస్తే వదిలేస్తా.. లేదంటేశ్రీ అంటూ హిందీలో బెదిరింపు ధోరణి ఆ వ్యక్తి సంభాషణ. ఇటీవల రాయవరం గ్రామానికి చెందిన తండ్రి సత్తిబాబు(మార్చిన పేరు)కు వచ్చిన ఫేక్ ఫోన్‌కాల్ అది. ఆందోళన చెందిన సత్తిబాబు ఫోన్ కట్ చేయగా, మళ్లీ అవతలి వ్యక్తి ఫోన్ చేసి.. ఎందుకు కాల్ కట్ చేశావంటూ గట్టిగా బెదిరించాడు. దీంతో బిత్తరపోయిన సత్తిబాబు వెంటనే వాళ్ల అబ్బాయికి ఫోన్ చేయగా, తాను కంపెనీలో బీజీగా ఉన్నానని చెప్పగానే ఆయన తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ఇలా ఒక్క సత్తిబాబుకే కాదు. గ్రామంలో మరికొందరికి ఇటువంటి ఫేక్ ఫోన్‌కాల్స్ వస్తూనే ఉన్నాయి. అలాగే అమలాపురం పట్టణానికి చెందిన ఓ వ్యక్తికీ ఇలాగే పోలీస్ డీపీతో ఉన్న ఫోన్ నంబర్ నుంచి సీబీఐ డీఎస్పీని మాట్లాడుతున్నానంటూ డబ్బు డిమాండ్ చేశారు. మరో వ్యక్తికీ ఇలాంటి ఫేక్ పోలీస్ డీపీతో ఫోన్‌కాల్ వచ్చినట్టు సమాచారం.
పోలీసు డీపీలతోనే..
లాటరీలో రూ.లక్షలు తగిలాయని, అకౌంట్‌లో జమ చేయాలంటే బక్స్ రూపంలో కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుందంటూ.. గతంలో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడిన సంఘటనలున్నాయి. అలాగే న్యూడ్ కాల్స్ చేసి సొమ్ము వసూలు చేసిన సంఘటనలూ అనేకం ఉన్నాయి. ఇలా సైబర్ నేరగాళ్లు తమ మోసాలకు కొత్తదారులను మారుస్తూనే ఉన్నారు. తాజాగా పోలీసు ఫొటోలను డీపీగా పెట్టుకుని మోసాలకు తెరదీశారు. పోలీసులమని నమ్మించేందుకు వాట్సాప్ డీపీల్లో పోలీసు ఫొటోలను పెట్టి ఫోన్‌కాల్స్ చేస్తున్నారు. ఇదంతా నిజమేననుకుని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఫేక్ కాల్ అని కట్ చేసినా.. మళ్లీ మళ్లీ ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. కూతురు, కొడుకు, భర్త అంటూ పేర్లతో సహా వివరాలు చెబుతుండడంతో బాధితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అనంతరం కొందరు తేరుకుని తమ వారికి ఫోన్ చేసి, వాస్తవాన్ని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎక్కువగా అమాయకులే బాధితులుగా మారుతున్నారు.
అపరిచిత కాల్స్ వస్తే ఇలా చేయాలి
ఎవరైనా అపరిచిత వ్యక్తులు వాట్సాప్ లేదా సాధారణ ఫోన్‌కాల్ చేసి.. పోలీసులమని చెప్పి బెదిరింపులకు పాల్పడినా, డబ్బు డిమాండ్ చేసినా.. మూడు పనులు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి కూతురు/కొడుకు లేదా ఇతర వ్యక్తి డ్రగ్స్ లేదా ఇతర కేసుల్లో పట్టుబడ్డాడని చెబితే.. ముందుగా తమ వారికి ఫోన్ చేసి నిర్ధారణ చేసుకోవాలంటున్నారు. అలాగే అపరిచిత ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేయాలి. చివరిగా టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడం లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు చెబుతున్నారు. సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్న క్రమంలో సెల్‌ఫోన్లకు వచ్చే అపరిచిత కాల్స్, మెసేజ్‌లు, లింక్లకు స్పందించవద్దని సూచిస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరగాళ్లు పోలీస్ డీపీలతో ఫోన్ చేసి మోసాలు, బెదిరింపులకు పాల్పడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఎవరైనా ఫోన్ చేసి మీ కుటుంబ సభ్యులు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారని బెదిరిస్తే ఆందోళన చెందకుండా, ముందుగా మీ సంబంధీకులకు ఫోన్ చేసి నిర్ధారించుకోవాలి. అపరిచిత ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసి, 1930 నంబర్‌కు రిపోర్ట్ చేయాలి. సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలి. – బి.రఘువీర్, డీఎస్పీ, రామచంద్రపురం
రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
అమాయక ప్రజలే లక్ష్యంగా మోసాలకు పాల్పడేందుకు సైబర్ నేరగాళ్లు కొత్తదారులు ఎంచుకుంటున్నారు. ఏకంగా పోలీస్ డీపీలు వాడుకుని, వాట్సాప్, నార్మల్ కాల్స్ చేస్తూ, అమాయక ప్రజలను బెదిరిస్తూ, ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఉపాధి, ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి కుటుంబాలే లక్ష్యంగా మోసాలకు యత్నిస్తున్నారు. ఇటీవల అనపర్తి మండలానికి చెందిన ఓ వ్యక్తికి సైబర్ నేరగాళ్లు పోలీసులమంటూ ఫోన్ చేసి, మీ కొడుకు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డాడు అని బెదిరింపులకు పాల్పడ్డారు. విడిచి పెట్టాలంటే డబ్బు పంపాలని చెప్పడంతో.. రూ.50 వేలు యూపీఐ ద్వారా పంపి మోసపోయారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో అనేకం వెలుగు చూస్తున్నాయి. సైబర్ నేరగాళ్ల బారిన పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయిస్తుంటే, మరికొందరు మిన్నుకుండిపోతున్నారు.

డేంజరింగ్