
ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతిసే ర్యాగింగ్
రాజానగరం: విద్యార్థి దశలో జూనియర్లను ర్యాగింగ్ చేయడం ఆనందమని సీనియర్లు భావిస్తారని.. కానీ అది ఆ విద్యార్థి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న యాంటీ ర్యాగింగ్ వీక్ కార్యక్రమంలో భాగంగా గురువారం జరిగిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తన జీవితంలో కూడా ర్యాగింగ్‌కు భయపడిన సంఘటనలు ఉన్నాయంటూ గుర్తు చేసుకున్నారు. ఎవరూ ర్యాగింగ్‌కు పాల్పడవద్దని, పాల్పడితే చట్టాల నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. ప్రతి తల్లి, తండ్రి తమ పిల్లలను ర్యాగింగ్‌కు దూరంగా ఉంచాలని చూస్తారని, అందుకోసమే ర్యాగింగ్ ఛాయలు లేని కళాశాలలు, యూనివర్సిటీలను ఎంపిక చేసుకుంటున్నారన్నారు. ర్యాగింగ్ వలన జీవితాలు నాశనం అవడమే కాకుండా కన్నవారికి, చదువుకునే సంస్థలకు కూడా చెడ్డ పేరు వస్తుందన్నారు. వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ మాట్లాడుతూ ‘నన్నయ’ వర్సిటీ అంటేనే సత్ప్రవర్తనకు కేరాఫ్ అనే ఖ్యాతిని పొందేలా మీ నడవడిక ఉండాలని విద్యార్థులకు హితవు పలికారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి యత్నం
నిడదవోలు రూరల్: మండలంలోని తాడిమళ్ల ప్రధాన సెంటర్‌లో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగింది. స్థానిక ఎస్‌బీఐ బ్రాంచ్ పక్కన ఉన్న ఈ ఏటీఎంలో బుధవారం అర్ధరాత్రి తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ మేరకు గురువారం బ్యాంకు మేనేజర్ రవి అందించిన సమాచారంతో సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఏటీఎంలోకి ప్రవేశించిన దొంగలు ముందుగా సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. డబ్బులను చోరీ చేసేందుకు ఏటీఎం ముందు భాగాన్ని పగులగొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఆన్‌లైన్‌లో రూ.1.53 కోట్లకు టోకరా
రాజమహేంద్రవరం రూరల్: గుర్తుతెలియని వ్యక్తి సెల్‌ఫోన్‌కు మేసేజ్ పంపి, క్యాపిటల్ సర్వీసెస్ గ్రూప్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నానని నమ్మించి ఖాతా తెరిపించి రూ.1.53 కోట్లకు టోకరా వేసిన ఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. బొమ్మూరు పోలీసుల కథనం ప్రకారం రాజమహేంద్రవరం వీఎల్‌పురం సత్యనారాయణపురం వీధికి చెందిన విశ్రాంత హార్లిక్స్ ఫ్యాక్టరీ మెడికల్ ఆఫీసర్ ఏలూరిపాటి శ్రీరామసూర్యప్రసాద్‌కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి వాట్సాప్ మేసేజ్ వచ్చింది. ఏఏ413 ఐఐఎఫ్‌ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ అండ్ గ్రూప్ నుంచి ప్రాతినిధ్యం వహించినట్లు నమ్మించాడు. సదరు గుర్తుతెలియని వ్యక్తి శ్రీరామసూర్యప్రసాద్‌ను ఖాతా తెరవమని బలవంతం చేసి, ఖాతా తెరిపించి ఆయనకు రూ.5,000 పంపాడు. ఆ వ్యక్తి తప్పుడు యాప్‌ను ఉపయోగించి ‘కష్టపడండి ఫలితం పొందండి ’ అంటూ ప్రత్యక్షంగా పెట్టుబడులు పెడితే మంచిలాభాలు ఉంటాయని నమ్మించడంతో శ్రీరామసూర్యప్రసాద్ ఈ నెల 5వ తేదీ నుంచి ఈ నెల 11వ తేదీ వరకు దఫదఫాలుగా వివిధ బ్యాంకు ఖాతాల నుంచి రూ.1,53,48,000 పొగొట్టుకున్నారు. అవతలి వ్యక్తుల నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో శ్రీరామసూర్యప్రసాద్ సైబర్‌క్రైమ్‌లో రిఫరన్స్ నంబర్ ద్వారా గురువారం సాయంత్రం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్పెక్టర్ పి.కాశివిశ్వనాథం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.