
వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి
రాజానగరం: వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. జాతీయ రహదారిపై దివాన్‌చెరువు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. గండేపల్లి మండలం కె.గోపాలపురానికి చెందిన జనపరెడ్డి రాఘవ(55) భర్త సత్యనారాయణతో కలిసి మోపెడ్‌పై రాజమహేంద్రవరం వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి అతివేగంతో వచ్చిన హైపవర్ బైక్ వారి మోపెడ్‌ను ఢీకొంది. ఈ ఘటనలో మోపెడ్ వెనుక కూర్చున్న రాఘవ రోడ్డుపై పడడంతో తలకు తీవ్ర గాయమైంది. ఆమెను 108 అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా, మార్గం మధ్యలోనే చనిపోయింది. కాగా సత్యనారాయణకు స్వల్ప గాయాలయ్యాయి. కేసును బొమ్మూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
కడియం: మండల కేంద్రమైన కడియం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తుంగపాడు గ్రామానికి చెందిన చిక్కిరెడ్డి సరోజిని(–––) మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు, సోమవారం ఉదయం కడియం దేవీసెంటర్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న సరోజినిని టిప్పర్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆమెను కడియం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కాగా సరోజిని తన చెల్లెలు సత్యతో కలిసి బ్యాంకులో ఆధార్ అప్‌డేట్ చేయించుకుని తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదానికి గురైంది. కడియం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రైలు నుంచి జారిపడి..
తుని రూరల్: తుని ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి ౖ(45) రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు వివరాల మేరకు, సోమవారం రాజమండ్రి నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే రైలు నుంచి యలమంచిలి రైల్వే యార్డు వద్ద గుర్తు తెలియని వ్యక్తి జారి పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని 108 అంబులెన్స్‌లో అనకాపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. నీలం, నలుపు గడుల ఫుల్‌హ్యాండ్ షర్టు, సిమెంట్ రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. కుడివైపు ఛాతిపై ఐ లవ్ మార్కులో రోహన్ అని పచ్చబొట్టు ఉంది. మృతదేహాన్ని అనకాపల్లి ప్రభుత్వాస్పత్రిలో భద్రపర్చారు. మృతుడిని గుర్తిస్తే 94906 19020 నంబరుకు వివరాలు తెలియజేయాలని ఎస్సై తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి