రష్యా వెళ్లలేక.. రైలు కింద పడి | A young man committed suicide by falling under a train | Sakshi
Sakshi News home page

రష్యా వెళ్లలేక.. రైలు కింద పడి

Jun 8 2024 5:02 AM | Updated on Jun 8 2024 5:02 AM

A young man committed suicide by falling under a train

డబ్బు సర్దుబాటు కాక యువకుడి ఆత్మహత్య  

రష్యాలో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుకు దరఖాస్తు 

నల్లగొండ క్రైం: రష్యా వెళ్లి చదువుకుంటూ ఉద్యోగం చేసి కుటుంబానికి అండగా నిలవాలన్న ఆ యువకుడి ఆశ తీరే మార్గం లేక వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ మండలం చందనపల్లి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ శంకర్, జయమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు శివమణి(19) ఉన్నారు. పెద్దకూతురు వసంతకు మూడేళ్ల క్రితం పెళ్లి చేశారు. రెండో కూతురు ఝాన్సీ ఎమ్మెస్సీ చదివి ఖాళీగానే ఉంటోంది. కుమారుడు శివమణి ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో బీఎస్సీ అగ్రికల్చర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. 

జీవితంలో త్వరగా స్థిరపడాలని భావించిన శివమణి.. రష్యాలో నర్సింగ్‌ చదువుతూ అక్కడే ఉద్యోగం పొందాలని భావించారు. రష్యాలో బీఎస్సీ నర్సింగ్‌ చేసేందుకు ప్రభుత్వ రిక్రూటింగ్‌ సంస్థ అయిన ‘టాంకాం’ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. 6 నుంచి 8 నెలల పాటు రష్యా భాషపై హైదరాబాద్‌లో శిక్షణ తీసుకోవాల్సి ఉంది. 

శిక్షణకు, రష్యా వెళ్లేందుకు మొత్తం ఖర్చుకు మూడున్నర లక్షలు కావాలి. దీంతో రెండు నెలలుగా తల్లిదండ్రులు అప్పుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడా అప్పు పుట్టలేదు. శివమణి గతేడాదే రష్యా వెళ్లేందుకు ప్రయతి్నంచగా, డబ్బులు సర్దుబాటు కాలేదు. ఈ ఏడాది కూడా డబ్బు అందకపోవడంతో అవకాశం చేజారిపోతుందని మనస్తాపం చెందాడు. దీంతో శుక్రవారం నల్లగొండ సమీపంలోని బతుకమ్మ చెరువు పక్కన రైల్వేట్రాక్‌ వద్దకు వెళ్లి.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తన సోదరి ఝాన్సీకి వీడియోకాల్‌ చేసి లోకేషన్‌ షేర్‌ చేశాడు. 

మధ్యాహ్నం 3 గంటల సమయంలో గుంటూరు వైపు వెళుతున్న గూడ్స్‌కు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, రైల్వే పోలీసులు ఘటనా స్థలంలోకి చేరుకొనేలోపే ఈ ఉదంతం చోటుచేసుకుంది. కేసు  దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్‌ఐ సాలకమ్మ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement