రామగిరి(నల్లగొండ) : ఆస్ట్రేలియాకు చెందిన న్యాయవాది బుధవారం నల్లగొండ కోర్టును సందర్శించారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో న్యాయవాదిగా పనిచేస్తున్న స్పెన్సర్ నల్ల గొండలోని ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం జిల్లా కోర్టును సందర్శించిన ఆయన కేసుల విచారణ, తదితర అంశాలపై పలు విషయాలను నల్లగొండ న్యాయవాదులను అడిగి తెలుసుకున్నారు.
13న జాబ్ మేళా
నల్లగొండ : నల్లగొండలోని ఐటీఐ క్యాంపస్‌లో ఈ నెల 13న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ నెల 13న ఉదయం 10.30 గంటలకు బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. ఎస్‌ఎస్‌సీ నుంచి డిగ్రీ, ఐటీఐ చదివి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల నిరుద్యోగులు అర్హులని తెలిపారు. ఎంపికై న అభ్యర్థులు నల్లగొండ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 7893420435 నంబబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
విద్యానిధికి దరఖాస్తులు
నల్లగొండ: విదేశాల్లో విద్యనభ్యసించడానికి అంబేద్కర్ ఓవర్‌సిస్ విద్యానిధి పథకం కింద 2026 సంవత్సరంలో అర్హులైన ఎస్సీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు శశికళ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31లోగా telangana. epass.cgg.gov.inలో వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
టెన్త్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
మిర్యాలగూడ : పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ భిక్షపతి అన్నారు. బుధవారం మిర్యాలగూడ రైతు వేదికలో ఇన్విజిలేటర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించమన్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో యూసుఫ్, కొమ్ము శ్రీనివాస్, ఎంఈఓలు ధర్మానాయక్, లక్ష్మణ్‌నాయక్, రవినాయక్, వెంకన్న, వరలక్ష్మి, ఉపాద్యాయులు కొర్ర కృష్ణకాంత్‌నాయక్, తావుర్యా, తిరుపతి, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, సాజిద్‌అలీ, దస్తగిరి, నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం వేకువ జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. సాయంత్రం వేళ ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవను ఊరేగించారు.


