మునుగోడు : వేసవి కాలంలో చెరువులు, కుంటలు ఎండిపోయి మూగజీవాలకు నీరు లభించక అవస్థలు పడుతుంటాయి. ఆ మూగజీవాల దాహం తీర్చేందుకు గత ప్రభుత్వం 2015 నుంచి 2018 వరకు ఉపాధి హామీ, ఇతర పథకాల ద్వారా ప్రతి గ్రామ శివారులో రెండు నుంచి నాలుగైదు వరకు నీటితొట్లను నిర్మించింది. ఆ నీటితొట్లకు గ్రామ పంచాయతీ ద్వారా నల్లా కనెక్షన్ ఇచ్చి నిండా నీరు నింపేవారు. అలా మండల వ్యాప్తంగా ఉన్న 28 గ్రామ పంచాయతీలతో పాటు ఆవాస గ్రామాల్లో కలిపి దాదాపు 145కు పైగా నీటితొట్లు ఉండేవి. అయితే అందులో కొన్ని శిథిలమై ధ్వంసం కాగా.. మరికొన్ని ఇప్పటికీ అలానే ఉన్నాయి. కానీ ఆ తొట్లకు మూడేళ్లుగా నీరు సరఫరా చేయడం లేదు. దీంతో మూగజీవాలను సాకుతున్న రైతులు తమ వ్యవసాయ బావుల వద్ద, ఇతర సౌకర్యాల ద్వారా నీరు అందిస్తున్నారు. కొందరు రైతుల వ్యవసాయ బోర్లు ఎండిపోతుండటంతో పశువులకు నీటి కోసం పాట్లు పడుతున్నారు. నిరుపయోగంగా ఉన్న నీటితొట్లను వాడుకలోకి తీసుకురావాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.


