లారీ ఢీకొని.. నాలాలో కూరుకుపోయి.. | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని.. నాలాలో కూరుకుపోయి..

Published Sun, Jul 9 2023 3:08 AM

Worst road accident in Adilabad district - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలం మేకలగండి వద్ద హైవే నంబర్‌ 44లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వన్‌వేలో గుర్తు తెలియని భారీ వాహనం ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను వెనుకనుంచి ఢీకొనడంతో రహదారికి సుమారు 20 అడుగుల దూరంలో ఉన్న పెద్ద నాలాలో ఆటో కూరుకుపోయింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా, ఐదుగురు గాయాలపాలయ్యారు.  

ప్రత్యేక ప్రార్థనలకు వెళ్లివస్తూ.. 
ఆదిలాబాద్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ కుటుంబం, మరో కుటుంబంతో కలిసి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇచ్చోడలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనల కోసం శుక్రవారం రాత్రి బయల్దేరి వెళ్లింది. శనివారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో ప్రార్థనలు పూర్తి కావడంతో ఆదిలాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఇచ్చోడ బైపాస్‌ దాటుకుని హైవే పైనుంచి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఆటో డ్రైవర్‌ ఏముల పొచ్చన్న (58) ఆయన భార్య గంగమ్మ (48), కూతురు శైలజ (28), మరో కుటుంబానికి చెందిన మడావి సోంబాయి (63) సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఆటోను ఢీకొన్న తర్వాత భారీ వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. పోలీసులు ఆ వాహనం ఆచూకీ కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ ఘటనా స్థలి నుంచి కొద్ది దూరంలోనే కొద్ది నెలల కిందటే జరిగిన ప్రమాదంలో నలుగురు చనిపోయారు. ప్రధానంగా ఈ మార్గం పల్లంగా ఉండటంతో లారీలు న్యూట్రల్‌లో నడుపుతారు. ఈ ప్రమాదానికి కూడా అదే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. 

మృత్యువును జయించిన చిన్నారులు 
ఈ ప్రమాదంలో మృతి చెందిన శైలజ కుమార్తెలు కూడా అదే ఆటోలో ఉన్నారు. మూడేళ్ల వయసున్న ఆరాధ్య, ఎనిమిది నెలల పసిబిడ్డ అర్పిత ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినప్పటికీ వారి తల్లి మృతిచెందడం చూస్తున్నవారిని కంటతడి పెట్టించింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement