ముక్కలు చేసి.. మూసీలో పడేసి!

Praneet Rao destroyed evidence of Phone taping - Sakshi

ట్యాపింగ్‌ ఆధారాలు ధ్వంసం చేసిన ప్రణీత్‌రావు 

అక్రమ ట్యాపింగ్‌లో అదనపు ఎస్పీల పాత్ర కీలకం 

న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లిన దర్యాప్తు అధికారులు 

జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తిరుపతన్న, భుజంగరావు 

ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ వేణుగోపాల్‌కు నోటీసులు..?

సాక్షి, హైదరాబాద్‌: ఎస్‌ఐబీలోని స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ) ద్వారా జరిగిన అక్రమ ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో అరెస్టు అయిన అదనపు ఎస్పీల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలను ఐదు రోజులపాటు పోలీసు కస్టడీకి తీసుకున్న సిట్‌ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ఫలితంగా ట్యాపింగ్‌తో పాటు ఆధారాల ధ్వంసానికి సంబంధించిన సమాచారం సేకరించారు.

ఈ వివరాలను పోలీసులు తమ రిమాండ్‌ రిపోర్టు ద్వారా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. భుజంగరావు, తిరుపతన్నలు తమ నేరం అంగీకరించారని, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు ఆదేశాలతోనే నేరం చేసినట్టు బయటపెట్టారని కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పొందుపరిచారు. మంగళవారం వీరిద్దరిని గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి శనివారం వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించగా, చంచల్‌గూడ జైలుకు తరలించారు.  

ప్రణీత్‌రావు దారికి వచ్చాడంటూ... 
ఈ కేసులో తొలి అరెస్టు ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావుదే. తొలుత పోలీసు విచారణకు అతడు సహకరించలేదని, అయితే రానురాను సహకరిస్తూ కీలక వివరాలు వెల్లడించారని పోలీసులు కోర్టుకు తెలిపారు. ప్రభాకర్‌రావు రాజీనామా చేసిన రోజే (గత ఏడాది డిసెంబర్‌ 4న) ఆయన ఆదేశాల మేరకు ప్రణీత్‌రావు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న టీఎస్‌ఎస్‌పీ హెడ్‌కానిస్టేబుల్‌ కైతోజు కృష్ణతో కలిసి ఎస్‌ఐబీ కార్యాలయంలోకి వెళ్లారు. అక్కడ తాను ఏర్పాటు చేసుకున్న వార్‌ రూమ్‌తోపాటు అధికారిక ట్యాపింగ్స్‌ జరిగే లాగర్‌ రూమ్‌ దగ్గర సీసీ కెమెరాలు ఆఫ్‌ చేయించాడు.

వార్‌రూమ్‌లోని 17 కంప్యూటర్లలో ఉన్న వాటితోపాటు విడిగా భద్రపరిచిన 50 హార్డ్‌డిస్క్ లను ధ్వంసం చేయడానికి ఉపక్రమించాడు. తనతో వచ్చిన ఎల్రక్టీషియన్‌తోపాటు నమ్మినబంటుగా ఉన్న ఓ పోలీసు సహాయంతో ఎలక్ట్రిక్‌ కట్టర్‌ వినియోగించి ఈ హార్డ్‌డిస్క్లు ముక్కలు చేశాడు. వీటి శకలాలను నాగోలు వద్ద మూసీనదిలో పారేశాడు. ఈ విషయాలు వెలుగులోకి రావడంతోనే అప్రమత్తమైన సిట్‌ అధికారులు మూసీలో సోదాలు చేశారు. వీరికి ధ్వంసమైన హార్డ్‌డిస్క్‌ కేసులు 5, హార్డ్‌డిస్క్‌ ముక్కలు తొమ్మిది లభించాయి. వీటితో పాటు తాము మూసీ నుంచే ఆరు మెటల్‌ హార్డ్‌డిస్క్‌ ముక్కల్నీ సీజ్‌ చేశామని కోర్టుకు తెలిపారు.  

ఎస్‌ఐబీ కార్యాలయం నుంచి ఆధారాలు  
ప్రణీత్‌రావు వాంగ్మూలం ఆధారంగా సిట్‌ అధికారులు మూసీనది నుంచే కాకుండా గ్రీన్‌లాండ్స్‌లోని ఎస్‌ఐబీ కార్యాలయం, దాని ఆవరణ, పరిసరాల నుంచి కొన్ని ఆధారాలు, భౌతిక సాక్ష్యాలు సేకరించారు. అక్రమ ట్యాపింగ్‌కు వినియోగించిన 12 కంప్యూటర్లు, 7 సీపీయూలు, ల్యాప్‌టాప్, మానిటర్లు, పవర్‌ కేబుళ్లు స్వాదీనం చేసుకున్నారు. అక్కడ ఉన్న ఎలక్ట్రిషియన్‌ గదిలో క్లూస్, ఫోరెన్సిక్‌ అధికారులతో కలిసి సోదాలు చేసిన సిట్‌ హార్డ్‌డిస్క్లు కట్‌ చేస్తున్నప్పుడు కింద పడి, మూలలకు చేరిన వాటి పొడిని సీజ్‌ చేశారు.

ఎస్‌ఐబీ కార్యాలయ ఆవరణలో పాక్షికంగా కాలిన డాక్యుమెంట్లు, స్పైరల్‌ బైండింగ్‌ చేసిన పత్రాలతో పాటు సీసీ కెమెరాల ఫుటేజీకి సంబంధించిన లాగ్‌బుక్‌ ప్రతులను పోలీసులు సేకరించారు. ఎస్‌ఐబీ కానిస్టేబుల్‌ కొత్త నరేష్ గౌడ్‌ నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. టి.ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ప్రతిపక్షాలపై తాము నిఘా పెట్టినట్టు అతడు బయటపెట్టాడు. ప్రధానంగా ప్రైవేట్‌ వ్యక్తులపై అక్రమ నిఘా ఉంచడంలో భుజంగరావు, తిరుపతన్న కీలకంగా వ్యవహరించారని, ఈ విషయాన్ని వారు అంగీకరించారని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.     

Election 2024

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top