
‘పట్నం’ పెద్ద చెరువులో పడి యువకుడి మృతి
నాలుగు గంటలు శ్రమించి మృతదేహాన్ని వెలికితీసిన ఆర్‌డీఎఫ్ సిబ్బంది
ఇబ్రహీంపట్నం: ఫొటోలు దిగేందుకు వచ్చిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందిన సంఘటన ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మైబెల్లి తెలిపిన వివరాలు.. ఇబ్రహీంపట్నంలోని ఎంబీఆర్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్న భరత్‌చంద్ర (22).. తన తమ్ముడు ప్రవీణ్(19)తో పాటు జోసెఫ్(15) అనే బాలుడితో కలిసి బుధవారం ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు వద్దకు వచ్చాడు. చెరువుకట్ట వద్ద ఫొటో దిగుతుండగా ప్రమాదవశాత్తు భరత్ చంద్ర చెరువులో పడిపోయాడు.
ప్రవీణ్, జోసెఫ్ ఇద్దరికీ ఈత రాకపోవడంతో రోడ్డుపైకి వచ్చి సాయం కోసం ఇతరులను వేడుకున్నారు. అయితే అప్పటికే భరత్ చంద్ర చెరువులో పూర్తిగా మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, డీఆర్‌ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకొని నాలుగు గంటల పాటు శ్రమించి చెరువులో నుంచి భరత్ చంద్ర మృతదేహాన్ని బయటికి తీశారు. కాగా భరత్‌చంద్ర స్థానిక ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడని, అతడి స్వగ్రామం మంచాల మండలం ఆగాపల్లి అని తెలిసింది. ఇబ్రహీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.