సంబరాలపై నిఘా
ఆంక్షలు అతిక్రమిస్తే చర్యలు
నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరుపుకొనేందుకు అంతా సిద్ధమయ్యారు. గ్రామాలు, పట్టణాల్లో యువతతోపాటు పిల్లలు, మహిళలు కొత్త సంబురాలకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈసారి వేడుకల నిర్వహణపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు, పెట్రోలింగ్, తనిఖీలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. నిబంధనలు అతిక్రమించి వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
– మొయినాబాద్
హైదరాబాద్ మహానగరంతోపాటు శివారు ప్రాంతాల్లో నూతన సంవత్సర వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. నగర శివారుల్లోని మొయినాబాద్, శంషాబాద్, షాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి ప్రాంతాల్లో ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌లు అధికంగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌లో డిసెంబర్ 31 రాత్రి వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఈసారి సైతం సంబరాలకు భారీ ఏర్పాట్లే జరుగుతున్నాయి. వేడుకలు నిర్వహించేవారు ముందుగానే పోలీసుల అనుమతి తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు పదిహేను రోజుల నుంచే చెబుతున్నారు. ఇప్పటి వరకు కొన్ని రిసార్ట్స్‌ల్లో నిర్వహించే వేడుకలకే అనుమతి తీసుకున్నట్లు తెలిసింది. ఫాంహౌస్‌ల్లో ఇప్పటి వరకు అనుమతులు తీసుకోలేదని సమాచారం. అయితే అనుమతి లేకుండా వేడుకలు నిర్వహిస్తే చర్యలు తప్పవని సైబరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు పాటించాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.
పోలీసుల సూచనలు
● నూతన సంవత్సర వేడుకలకు ముందస్తు అనుమతి తీసుకోవాలి.
● రోడ్లు బ్లాక్ చేసి సంబరాలు నిర్వహించొద్దు.
● టపాసులు పేల్చొద్దు, డీజేలు నిషేధం.
● మైనర్స్‌కు వాహనాలు ఇవ్వొద్దు.
● మద్యం మత్తులో వాహనాలు నడపొద్దు.
● మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించొద్దు.
● ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దు.
● ఇళ్లు, ప్రైవేటు ఆస్తులపై, వీధి దీపాలపై రాళ్లు వేడయం, అద్దాలు పగులగొట్టడం నేరం.
● ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్ తీసి వాహనాలు నడపడం, శబ్ద కాలుష్యం చేయడం నేరం.
● నిషేధిత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు ఉంటాయి.
● మద్యం దుకాణాలు నిర్ణీత సమయంలోనే మూసి వేయాలి.
● మైనర్లకు మద్యం విక్రయించొద్దు.
● బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ స్థలాల్లో మద్యం తాగితే కేసులు నమోదు.
● న్యూ ఇయర్ ఆఫర్‌ల పేరుతో సైబర్ నేరగాళ్లు ఆర్థిక నష్టం కలిగించే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌లో, అపరిచితులకు వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ అకౌంట్ వివరాలు, పిన్ నంబర్లు ఇవ్వొద్దు.
విస్తృత తనిఖీలు
డిసెంబర్ 31 రాత్రి జరిగే కొత్త ఏడాది వేడుకల సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రోడ్లపై డ్రంక్ అండ్ డ్రైవ్, వాహనాల తనిఖీలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌లో నిర్వహించే వేడుకల్లో డ్రగ్స్, విదేశీ మద్యం వినియోగించే అవకాశం ఉండటంతో వాటిపై ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేయనున్నారు.
కొత్త ఏడాది వేడుకలపై పోలీసుల నజర్
ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌పై ప్రత్యేక దృష్టి
అనుమతి లేకుండా నిర్వహిస్తే కేసులు
డ్రంకెన్ డ్రైవ్, వాహనాల తనిఖీలకు సిద్ధం
హద్దు దాటితే చర్యలు తప్పవని హెచ్చరిక
నూతన సంవత్సర వేడుకలు జరుపుకొనేవారు ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దు. పోలీసుల సూచనలు తప్పనిసరి పాటించాలి. ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌పై ప్రత్యేక నిఘా పెడుతున్నాం. అనుమతి లేకుండా మద్యం వినియోగించినా.. డ్రగ్స్, గంజాయి వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటాం. – కిషన్, ఏసీపీ, చేవెళ్ల
సంబరాలపై నిఘా


