అశాసీ్త్రయంగా డివిజన్ల పునర్విభజన
అబుల్లాపూర్‌మెట్: జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇటీవల చేపట్టిన డివిజన్ల పునర్విభజన అశాసీ్త్రయంగా ఉందని పెద్దఅంబర్‌పేట, కుంట్లూర్ వార్డులకు చెందిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. పెద్దఅంబర్‌పేటలో పార్టీ సీనియర్ నాయకుడు దండెం రాంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఈదమ్మల బలరాం, పలువురు మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారులు, ప్రభుత్వం అవగాహనారాహిత్యానికి డివిజన్ల విభజనే నిదర్శనమన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్దఅంబర్‌పేట, ఆదిబట్ల, తుర్కయంజాల్ మున్సిపాలిటీలను ప్రభుత్వం జీహెచ్‌ఎంసీలో విలీనం చేసి చిన్నాభిన్నం చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి సోయి లేదా అని ప్రశ్నించారు. డివిజన్ల విభజన విషయంలో ఎన్ని అభ్యంతరాలు వినిపించినా అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. 52 వేల ఓటర్లతో పెద్దఅంబర్‌పేట, 12 వేల ఓటర్లతో కుంట్లూర్ డివిజన్లను విభజించడం చూస్తుంటేనే అధికారులు, ప్రభుత్వ పనితీరు అర్థమవుతోందన్నారు. రెండు డివిజన్లను నాగోల్ సర్కిల్‌లో కాకుండా సమీపంలో ఉన్న హయత్‌నగర్ సర్కిల్‌లో కలపాలని డిమాండ్ చేశారు. శాసీ్త్రయ పద్ధతితో డివిజన్ల పునర్విభజన చేపట్టాలని లేని పక్షంలో సర్కిల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో మాజీ సర్పంచ్ కళ్లెం ప్రభాకర్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు పాశం దామోదర్, మండల కోటేశ్వర్ రావు, బ్రహ్మానంద రెడ్డి, దేసారం బాలకృష్ణ గౌడ్, పిల్లి నగేష్ యాదవ్, గౌని భాస్కర్ గౌడ్, ఇర్ఫాన్, జోర్క రాము, శేఖర్, రవికాంత్, కర్ణాకర్, రాము, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ నాయకుల ఆరోపణ


