వెలుగులు.. మరకలు
కొన్ని కుటుంబాల్లో వెలుగులు నింపిన పథకాలు పోర్టల్ మారినా తీరని భూ సమస్యలు వైద్య ఆరోగ్యశాఖకుమచ్చ తెచ్చిన ఘటనలు కలకలం రేపిన ‘భూమిక’ ఎన్‌కౌంటర్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: భూ బాధితులకు ఈ ఏడాది కూడా నిరీక్షణ తప్పలేదు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం ధరణి పోర్టల్ స్థానంలో జూన్ 2న భూ భారతి పోర్టల్ తీసుకొచ్చింది. అంతకు ముందే ఊరూరా సదస్సులు నిర్వహిహి ంచి అవగాహన కల్పించింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2020లో ధరణి పోర్టల్ తీసుకురాగా, రెండు లక్షల అర్జీలు వచ్చాయి. వీటిలో 1.80 లక్షల వినతులను క్లియర్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 17,646 దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. బీఆర్‌ఎస్ తీసుకొచ్చిన ధరణి లోపభూయిష్టంగా ఉందని పేర్కొంటూ.. ఆర్‌ఓఆర్–2025 తీసుకొచ్చి ధరణి స్థానంలో భూ భారతి అందుబాటులోకి తెచ్చింది. కొందుర్గు మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. గ్రామ సదస్సుల్లో భాగంగా 21 వేలకుపైగా అర్జీలు స్వీకరించింది. ఇప్పటికీ మెజార్టీ దరఖాస్తులు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. తమ సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరుతూ బాధితులు ఏడాదిగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా వారికీ నిరీక్షణ తప్పడం లేదు.
వైద్య ఆరోగ్యశాఖకు తీరని మచ్చ
కొత్తపేట అలకనంద ఆస్పత్రి వేదికగా కిడ్నీ మార్పిడీ చికిత్సల రాకెట్ జనవరిలో వెలుగు చూసింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాతలు, స్వీకర్తలను రప్పించి ఎలాంటి అనుమతులు పొందకుండా గుట్టుగా చికిత్సలు చేసింది. కొత్తపేటలో తీగలాగితే.. శ్రీలంకలో డొంక కదిలింది. అప్పట్లో ఈ ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు ఈ కిడ్నీ రాకెట్ స్కాం.. మాయని మచ్చని మిగిల్చింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందాల వరుస తనిఖీలతో నకిలీ వైద్యుల చలామణి ఘటనలు తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి.
విషాదం నింపిన ‘భూమిక’
కేశంపేట మండలం వేములనర్వ్‌కు చెందిన మన్నాడ విజయలక్ష్మి అలియాస్ భూమిక(36) మే మూడో వారంలో ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందింది. ఉస్మానియా విశ్వవిద్యాయలంలో పీజీ చేస్తూ.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆమె ఆదివాసుల కష్టాలను చూసి చలించిపోయింది. 2013–14లో అజ్ఞాతంలోకి వెళ్లి 12 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో పని చేసి.. చివరకు ఈ ఏడాది ఎన్‌కౌంటర్‌లో కన్నుమూసింది. తెలంగాణ ఉద్యమంలో ఆమెతో కలిసి ఓయూ మిత్రులు దిగిన ఫొటోలు ఆమె మరణం తర్వాత సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.
సంక్షేమం నిర్వీర్యం
సంక్షేమం లేక ఆ శాఖలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి.ఒకప్పుడు వివిధ సంక్షేమ పథకాల ప్ర కటన, లబ్ధిదారులతో కళకళలాడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖలు ఈ ఏడాది కేవలం విద్యార్థుల ఉపకార వేతనాల మంజూరు, వసతి గృహాల కు నిత్యావసరాల పంపిణీకే పరిమితమయ్యాయి. వ్యవసాయం, హార్టికల్చర్, పశు సంవర్థకశాఖల్లో ఆశించిన ప్రగతి లేదు. మైనింగ్ విభాగం ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాలేదు. కళ్లముందే ఖరీదైన మైనింగ్ కరిగిపోతున్నా.. రాయల్టీ చెల్లించకుండా కంకర, రోబోసాండ్, మట్టి అమ్మకాలు జరుగుతున్నా పట్టించుకోలేదు. మైనింగ్ అధికారుల నిర్లక్ష్యం.. అంతకు మించి అక్రమ వసూళ్లు ఈ ఏడాది ఆ శాఖను పూర్తిగా వెనుకబడేలా చేశాయి.
కొంత మోదం.. మరికొంత ఖేదం
కొన్ని పరిణామాలు జిల్లా ప్రజలకు తీపిని పంచితే.. మరికొన్ని చేదును మిగిల్చాయి. ఎప్పటిలాగే 2025 సైత కొంత మోదం.. కొంత ఖేదం అన్నట్లుగా సాగింది. 200 యూనిట్లలోపు గృహాలకు ఉచిత విద్యుత్ సరఫరా, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపగా.. వివిధ ప్రాజెక్టుల పేరుతో చేపట్టిన భూ సేకరణ అనేక మందికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. ముఖ్యంగా పారిశ్రామికవాడలు, గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్లు, ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టులు రైతులను ఆందోళనకు గురి చేశాయి.
వెలుగులు.. మరకలు
వెలుగులు.. మరకలు


