ఆటోలో పోగొట్టుకున్న బ్యాగ్ అప్పగింత
పహాడీషరీఫ్: ఆటోలో మరిచిపోయిన విలువైన వస్తువులతో కూడిన బ్యాగ్‌ను పహాడీషరీఫ్ పోలీసులు బాధితురాలికి సురక్షితంగా అందజేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పహాడీషరీఫ్ గ్రామానికి చెందిన షబానా భాను(55) మంగళవారం సాయంత్రం కిషన్‌బ్యాగ్‌లో ప్యాసింజర్ ఆటో ఎక్కి పహాడీషరీఫ్‌లో దిగింది. ఆ సమయంలో తులం బంగారం, రూ.10 వేల నగదు ఉన్న బ్యాగ్‌ను ఆటోలో మరిచిపోయింది. ఇంటికి వెళ్లాక గమనించిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వెంటనే ఆటో స్టాండ్‌కు వెళ్లి వాకబు చేయగా మహ్మద్ అమీర్ హుస్సేన్ ఆటోలో బ్యాగ్ లభ్యమైంది. విషయాన్ని ఆటోడ్రైవర్ కూడా గమనించలేదు. ఈ సందర్భంగా పోలీసులు బ్యాగ్‌ను బాధితురాలికి అందజేశారు.
మొయినాబాద్: బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి, హత్యచేసిన వ్యక్తికి న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు రూ.21 వేల జరిమానా విధించింది. కేసు విచారణ చేపట్టిన రాజేంద్రనగర్ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు వెలువర్చింది. మహబూబ్‌నగర్ జిల్లా దామరగిద్ద మండలం శాంతినగర్‌కు చెందిన వడ్ల సంతోష్ మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చిలుకూరులో నివాసం ఉంటూ దుస్తుల వ్యాపారం చేసేవాడు. 2016 డిసెంబర్ 4న చిలుకూరు గ్రామానికి చెందిన మైనర్ బాలుడు(9)పై అత్యాచారం చేసి, హత్య చేశాడు. శవాన్ని నీటి ట్యాంకులో వేశాడు. బాలుడు కనిపించడం లేదని స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలుడు హత్యకు గురైనట్లు గుర్తించారు. నిందితున్ని అరెస్టు చేసి విచారణ చేపట్టడంతో బాలున్ని ప్రలోభపెట్టి లైంగిక దాడికి పాల్పడి హత్యచేసినట్లు తెలిసింది. ఈ కేసును రాజేంద్రనగర్ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. సతోష్ నేరస్తుడని సాక్ష్యాధారాలతో రుజువు కావడంతో జీవిత ఖైదు విధించింది.
మీర్‌పేట: సుంకం చెల్లించకుండా (నాన్ డ్యూటీ పెయిడ్) ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్లు తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మీర్‌పేట ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎన్.శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి సరూర్‌నగర్ ఆదేశాల మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈ ఎస్.జీవన్ ఆధ్వర్యంలో మంగళవారం పహాడీషరీఫ్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో గోవా, ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తరలిస్తున్న 229 నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని, 12 మందిపై కేసులు నమోదు చేశారు.
● ఒకరి అరెస్టు ● 15 కిలోల మాంసం, తల స్వాధీనం
అత్తాపూర్: జింక మాంసం విక్రయిస్తున్న వ్యక్తిని రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సులేమాన్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఇర్ఫానుద్దీన్ జింక మాంసం అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ పోలీసులు మంగళవారం అతడి షాప్‌పై దాడి చేసి 15 కిలోల జింక మాంసం, జింక తల, జింక తోలు, రూ. 3500 నగదును స్వాధీనం చేసుకున్నారు. పెబ్బేరు నుంచి జింకలను నగరానికి తీసుకువచ్చి స్థానికంగా వధించి రూ.800కు కిలో చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతను పెబ్బేరుకు చెందిన ఆలీ అనే వ్యక్తి వద్ద జింకలను కొనుగోలు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడిని అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. అత్తాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్న జింక మాంసం, తలను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఇర్ఫానుద్దీన్‌కు జింకలను విక్రయిస్తున్న ఆలీ కోసం గాలింపు చేపట్టారు. అతడిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటోలో పోగొట్టుకున్న బ్యాగ్ అప్పగింత
ఆటోలో పోగొట్టుకున్న బ్యాగ్ అప్పగింత
ఆటోలో పోగొట్టుకున్న బ్యాగ్ అప్పగింత


