మన పెళ్లికి ఒప్పుకోరు.. ఇద్దరం చనిపోదాం | Lovers Commit Suicide After Parents Refused For Their Marriage In Nagarkurnool District, Details Inside | Sakshi
Sakshi News home page

మన పెళ్లికి ఒప్పుకోరు.. ఇద్దరం చనిపోదాం

Published Wed, May 15 2024 5:41 AM

lovers commit suicide after parents refused their marriage in Nagarkurnool District

బాలికకు పురుగు మందు తాగించి.. తాను తాగినట్టు నటించిన యువకుడు

చికిత్స పొందుతూ బాలిక మృతి.. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

బల్మూర్‌: బాలికను ప్రేమ పేరుతో వంచించాడు. పెళ్లికి పెద్దలు అడ్డు చెబుతారని ఆమెను నమ్మించి ఆత్మహత్యకు ప్రేరేపించాడు. చివరకు ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. బల్మూర్‌కు చెందిన రాఘవేందర్‌ అదే గ్రామానికి చెందిన బాలిక(15) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

అయితే పెళ్లికి కుటుంబసభ్యులు అడ్డు చెబుతున్నారని రాఘవేందర్‌ ఈ నెల 11న గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలం వద్దకు బాలికను తీసుకెళ్లాడు. నువ్వు మైనర్‌..  పెళ్లికి మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు. ఇద్దరం కలిసి పురుగు మందు తాగి చనిపోదామని చెప్పా డు. వెంట తెచ్చిన పురుగు మందును మొదటగా ఆమెకు తాగించి, తాను కూడా తాగినట్టు నటించాడు. బాలిక అపస్మారక స్థితికి చేరుకోగానే మరో యువకుడి సహాయంతో బాలికను బైక్‌పై అచ్చంపేట ఆస్పత్రికి తరలించాడు.

ఆపై బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఆరోగ్య పరిస్థితి విషమించడంలో మెరుగైన వైద్యం కోసం ఆమెను నిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ ఆ బాలిక సోమవారం రాత్రి మృతి చెందింది. అయితే తమ కూతురుతో బలవంతంగా పురుగు మందు తాగించాడని బాలిక కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

పరిహారంగా రెండెకరాల భూమి 
బాలిక మృతిపై బల్మూర్‌లో పంచాయితీ పెట్టిన గ్రామపెద్దలు, కులస్తులు రెండెకరాల భూమి çపరిహారంగా ఇవ్వాలని తీర్మానించినట్టు తెలిసింది. రాఘవేందర్‌ తండ్రికి ఉన్న భూమిలో రెండు ఎకరాలు బాలిక తరఫున బంధువు పేరుపై రిజిస్ట్రేషన్‌ చేయాలని కాగితాలు రాసుకొని ధరణిలో స్లాట్‌ కూడా మంగళవారం బుక్‌ చేసినట్టు సమాచారం. భూమి మార్పిడి జరిగిన వెంటనే ఆస్పత్రిలో ఉన్న మృతదేహానికి ఆత్మహత్య కేసుగా నమోదు చేయించి ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలు జరిపించాలని ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. ఈ విషయమై ఎస్‌ఐ బాలరాజును వివరణ కోరగా బాలిక ఆత్మహత్యపై తమకు ఫిర్యాదు అందలేదని చెప్పారు.

Advertisement
 
Advertisement