అందుకే నాంపల్లి ప్రమాదం జరిగింది: అగ్నిమాపక శాఖ | Sakshi
Sakshi News home page

నాంపల్లి బజార్‌ఘాట్‌ ఘోర ప్రమాదం.. అందుకే జరిగిందని తేల్చేసిన అగ్నిమాపక శాఖ

Published Mon, Nov 13 2023 5:52 PM

Fire Department Announcement On Nampally Fire Accident - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాంపల్లి బజార్‌ఘాట్‌ అగ్నిప్రమాద ఘటనపై అగ్నిమాపక శాఖ అధికారిక ప్రకటన చేసింది. బిల్డింగ్‌లో ఫైర్‌ సేఫ్టీ లేదని పేర్కొన్న ఫైర్‌శాఖ.. కెమికల్‌ డ్రమ్ముల వల్లే అగ్నిప్రమాదం జరిగిందని తేల్చి చెప్పింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. 

‘‘అగ్నిప్రమాదం నవంబర్‌ 13 సోమవారం ఉదయం 9గం.30 నిమిషాలకు జరిగింది. ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు. ప్రమాదం నుంచి 21 మందిని రక్షించగలిగాం. అక్రమంగా సెల్లార్‌లో కెమికల్‌ డ్రమ్ములు పెట్టారు. ఆ డ్రమ్ముల వల్లే అగ్నిప్రమాదం జరిగింది. బిల్డింగ్‌లో ఫైర్‌ సేఫ్టీ లేకపోవడం గుర్తించాం అని అగ్నిమాపక శాఖ ప్రకటించింది. 

   

స్థానికుల మౌనం
సోమవారం ఉదయం ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ కెమికల్ నిల్వలను రమేష్ జైశ్వాల్ అనే వ్యక్తి నిల్వ ఉంచినట్లు తేలింది. పెద్ద పెద్ద డ్రమ్ముల్లో నిల్వ ఉంచి అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో  వ్యాపారం చేస్తున్నాడు రమేష్ జైశ్వాల్. అయితే ఇది చాలారోజులుగా నడుస్తున్న వ్యవహారమని అధికారులకు తెలిసింది. దీంతో స్థానికుల్ని ప్రశ్నించారు వాళ్లు. భారీగా కెమికల్ నిల్వలు ఉంచినప్పుడు తమకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని అపార్ట్‌మెంట్‌ వాసులను అడిగారు అగ్నిమాపక శాఖ అధికారులు. అయితే స్థానికులు ఆ ప్రశ్నకు మౌనం వహించారు. మరోవైపు తనిఖీలు చేపట్టని విజిలెన్స్‌ అధికారులు, సేఫ్టీ పరిశీలనలో విఫలమైన జీహెచ్‌ఎంసీ తీరుపైనా  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement