రైతుబంధు, రైతుబీమా నిధులు పక్కదారి! | Sakshi
Sakshi News home page

రైతుబంధు, రైతుబీమా నిధులు పక్కదారి!

Published Mon, Feb 26 2024 4:09 AM

Agricultural extension officer under police custody - Sakshi

కొందుర్గు: రైతుబంధు, రైతుబీమా నిధులను దారి మళ్లించిన కారణంగా రంగారెడ్డి జిల్లాలో ఒక ఏఈవోను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. 2020 నుంచి ఇప్పటివరకు దాదాపు 20 మందికిపైగా రైతుబీమా డబ్బులు, 130 మంది రైతుబంధు డబ్బులు పక్కదారి పట్టినట్లు తెలిసింది. రైతుబీమాకు సంబంధించి క్లెయిమ్‌ చేసే సమయంలో నామినీ వివరాలు, తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి సదరు ఏఈవో తన ఖాతా, కుటుంబసభ్యుల ఖాతా, బంధువులు, స్నేహితుల ఖాతా నంబర్లను ఎడిట్‌ చేసి బీమా కంపెనీకి పంపినట్లు సమాచారం.

ఒకే ఖాతాకు వరుసగా డబ్బులు జమ అవుతున్నాయని అనుమానం వచ్చిన బీమా కంపెనీవారు వ్యవసాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. సంబంధిత అధికారుల సూచన మేరకు హైదరాబాద్‌ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున ఏఈవోను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రైతుబంధు డబ్బులను కూడా ఇలాగే నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి కాజేసినట్లు ప్రచారం జరుగుతోంది. రైతుబంధు, రైతుబీమా కలిపి సుమారు రూ.2 కోట్ల వరకు కాజేసినట్లు సమాచారం. హైదరాబాద్‌ కర్మన్‌ఘాట్‌లోని మరో ఇంట్లో కూడా విచారణ జరిపినట్లు సమాచారం. సదరు ఏఈవో కొందుర్గు, జిల్లేడ్‌ చౌదరిగూడ మండలాల్లో వ్యవసాయ భూములు కొనుగోలు చేసినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయమై వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు ఎలాంటి సమాచారాన్ని వెల్లడించడంలేదు.  

Advertisement
 

తప్పక చదవండి

Advertisement