మున్సిపోల్‌ 78.99% | - | Sakshi
Sakshi News home page

మున్సిపోల్‌ 78.99%

Feb 12 2026 11:35 AM | Updated on Feb 12 2026 11:35 AM

మున్సిపోల్‌ 78.99%

మున్సిపోల్‌ 78.99%

యువోత్సాహం ఓటెత్తిన మహిళలు రేపే ఓట్ల లెక్కింపు

అత్యధికంగా ఆమనగల్లులో 84.08% పోలింగ్‌

షాద్‌నగర్‌లో అత్యల్పంగా 76.24 శాతం నమోదు

ఆరు మున్సిపాలిటీల్లో 36,979 మంది ఓటింగ్‌కు దూరం

రేపు తేలనున్న భవితవ్యం

ప్రశాంతంగా ముగిసిన రెండో సాధారణ ఎన్నికలు

సాక్షి, రంగారెడ్డి జిల్లా: చెదురు మదురు ఘటనలు మినహా మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాతంగా ముగిసాయి. బుధవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ ప్రక్రియ.. సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చేవెళ్ల, హిమాయత్‌నగర్‌ పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ నారాయణరెడ్డి సహా ఫ్యూచర్‌సిటీ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు సందర్శించగా, జిల్లా ఎన్నికల పరిశీలకుడు మయాంక్‌ మిట్టల్‌ శంకర్‌పల్లి పోలింగ్‌ కేంద్రంలో పోలింగ్‌ సరళిని పరిశీలించారు. రెండో సాధారణ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

36,979 మంది ఓటింగ్‌కు దూరం

జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో 126 వార్డులు ఉండగా, 274 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,76,023 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,39,044 మంది(78.99 శాతం)తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 68,725 మంది పురుషులు ఉండగా, 70,318 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మరో 36,979 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమైంది. బ్యాలెట్‌ బాక్సులను పోలింగ్‌ సిబ్బంది ఏజెంట్ల సమక్షంలో సీజ్‌ చేసి, పోలీసు భద్రత నడుమ ఎంపిక చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు.

పెచ్చులూడిపడి ఓటరుకు గాయాలు

ఇదిలా ఉంటే తనకు అనుకూలంగా ప్రచారం చేయలేదనే కోపంతో షాద్‌నగర్‌ మున్సిపాలిటీ 27వ వార్డులో నివాసం ఉంటున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ ఇంట్లోకి ప్రతిపక్ష పార్టీ నేతలు చొరబడి ఆమెతో ఘర్షణకు దిగారు. అదే విధంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆమనగల్లు మున్సిపాలిటీ ముర్తుజపల్లి పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న ఓ మహిళా ఓటరుపై పైకప్పు పెచ్చులూడిపడటంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. అక్కడే ఉన్న వైద్య సిబ్బంది ఆమె తలకు కట్టుకట్టి ఆస్పత్రికి తరలించారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ శేరిగూడ 15వ వార్డుకు చెందిన క్యామ పారిజాత తన ఓటును వేరే వాళ్లు వేశారని ఆరోపించారు.

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం

ఓటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తి కావడంతో జిల్లా ఎన్నికల అధికారులు కౌటింగ్‌ కేంద్రాలపై దృష్టి సారించారు. ఆమనగల్లు మున్సిపాలిటీ వార్డుల్లోని బ్యాలెట్‌ బాక్సులను బ్రిలియంట్‌ గ్రామర్‌ హైస్కూల్లోని స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించారు. చేవెళ్ల మున్సిపాలిటీలోని బ్యాలెట్‌ బాక్సులను అదే ప్రాంతంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవనంలో భద్రపరిచారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని బ్యాలెట్‌ బాక్సులను శేరిగూడలోని శ్రీ ఇందు ఇంజనీరింగ్‌ కాలేజీలో భద్రపరిచారు. మొయినాబాద్‌ మున్సిపాలిటీలోని బ్యాలెట్‌ బాక్సులను మ్యాక్‌ ఫార్మసీ కాలేజీలో, షాద్‌నగర్‌ మున్సిపాలిటీ బ్యాలెట్‌ బాక్సులను మిని స్టేడియంలో, శంకర్‌పల్లి మున్సిపాలిటీ బ్యాలెట్‌ బాక్సులను టీఎస్‌ మోడల్‌ స్కూల్‌ భవనంలో భద్రపరిచారు.

మొదట్లో మందకొడిగా సాగిన ఓటింగ్‌.. మధ్యాహ్నం ఒక్కసారిగా ఊపందుకుంది. ఉదయం తొమ్మిది గంటల వరకు 11.75 శాతం ఓటింగ్‌ మాత్రమే నమోదైంది. 11 గంటల వరకు 30.11 శాతం మించలేదు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 52.57 శాతం నమోదైంది. మూడు గంటలకు 68.77 శాతం, సాయంత్రం ఐదు గంటల వరకు 78.52 శాతం నమోదైంది. రాత్రి ఏడు గంటల వరకు 78.99 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇదిలా ఉంటే ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో 78.56 శాతం పురుషులు ఉండగా, 79.42 శాతం మహిళలు ఉన్నారు. యువతీ, యువకులు ఉత్సాహంగా ఓటు వేశారు. వృద్ధులు, వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మంచానికే పరిమితమైన బాధితులను వీల్‌చైర్లలో తీసుకొచ్చి ఓటు వేయించారు.

షాద్‌నగర్‌: షాద్‌నగర్‌ మున్సిపల్‌ ఎన్నికల ఓటింగ్‌లో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపల్‌ పరిధిలో 28 వార్డుల్లో 53,403 మంది ఓటర్లు ఉండగా 40,713 ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరిలో 26,679 మంది పురుషులు, 267,23 మంది మహిళలు ఓటేశారు. 2020లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో 78.45 శాతం పోలింగ్‌ నమోదవగా ప్రస్తుత ఎన్నికల్లో 76.24 శాతానికే పరిమితమైంది. తగ్గిన పోలింగ్‌ శాతంతో ఎవరికి మేలు చేస్తుంది.. ఎవరికి నష్టం చేకూరుతుందో రేపటి వరకు వేచి చూడాల్సిందే.

ఇక 13న అదే కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. ఇందుకోసం 64 టేబుళ్లను ఏర్పాటు చేశారు. అత్యధికంగా షాద్‌నగర్‌లో 14 టేబుళ్లు ఏర్పాటు చేయగా, అత్యల్పంగా ఆమనగల్‌లో ఐదు టేబుళ్లను సిద్ధం చేశారు. ఒక్కో టేబుల్‌కు సగటున నలుగురు చొప్పున మొత్తం 254 మందిని ఓట్ల లెక్కింపునకు నియమించారు. మధ్యాహ్నం రెండు గంటల్లోగా లెక్కింపు ప్రక్రియ పూర్తి చేసి, పూర్తి ఫలితాలను వెల్లడించాలనే కృతనిశ్చయంతో జిల్లా ఎన్నికల అధికారులు ఉన్నారు. 16న చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎంపిక ఉంటుంది. ఇందుకోసం ఒక్కో మున్సిపాలిటీకి ఒక్కో అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు. ఫలితాలు వెల్లడైన వెంటనే వీరు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.

మున్సిపాలిటీల వారీగా పోలింగ్‌ శాతం

మున్సిపాలిటీ వార్డులు పోలింగ్‌ కేంద్రాలు మొత్తం ఓటర్లు ఓటేసిన వారు శాతం

ఆమనగల్లు 15 30 16,984 14,403 84.08

చేవెళ్ల 18 37 25,371 20,661 81.44

ఇబ్రహీంపట్నం 24 48 25,993 20,392 78.45

మొయినాబాద్‌ 26 52 32,871 26,377 80.24

శంకర్‌పల్లి 15 31 21,401 16,498 77.09

షాద్‌నగర్‌ 28 76 53,403 40,713 76.24

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement