‘ముద్ర రుణం’ పేరిట మోసం
ఢిల్లీలో ఉంటూ తెలుగు వారికి టోకరా!
సాక్షి, సిటీబ్యూరో: ‘ముద్రా లోన్ సర్వీసెస్’ పేరుతో రుణాలు ఇస్తామంటూ ఎర వేసి మోసాలకు పాల్పడుతూ ఢిల్లీలో స్థిరపడిన ఐదుగురు రాష్ట్ర వాసుల్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీళ్లు లోన్ ఆఫీసర్లుగా నటిస్తూ టోకరా వేశారని డీసీపీ వి.అరవింద్‌బాబు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఈ స్కామ్‌కు పాల్పడే సూత్రధారులు తెలుగు వారిని మోసం చేయడానికి వీరిని వినియోగించుకున్నట్లు ఆయన వివరించారు. వరంగల్ జిల్లాకు చెందిన బోచు అరుణ్, గడ్డం భరత్, సామర్ల తిరుపతి, వెల్పుగొండ తరుణ్, చుక్క శ్యామ్ స్నేహితులు. వీళ్లు తమ చదువును మధ్యలోనే ఆపేసి కూలీ పనులు ప్రారంభించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఫేస్‌బుక్ ప్రకటనల ద్వారా పరిచయమైన ఢిల్లీ వాసి రాహుల్‌తో జట్టుకట్టారు. అతడి ద్వారా ఢిల్లీ, కోల్‌కతాల్లో ఉన్న అక్రమ కాల్ సెంటర్లలో చేరారు. కిట్టు అనే మేనేజర్ వీరికి కొన్నాళ్లు కోల్‌కతాలో వసతి కల్పించి, మోసం చేసే విధానంపై శిక్షణ ఇచ్చాడు. సూత్రధారులు ముద్రా లోన్లు, ఇతర రుణాల పేరుతో సోషల్‌మీడియాలో ప్రకటన ఇచ్చేవారు. ఎటువంటి వడ్డీ, ముందస్తు చెల్లింపులు లేకుండానే మంజూరు చేస్తామని నమ్మించారు. ఆసక్తి చూపిన వారి డేటాను సేకరించి, రాష్ట్రాల వారీగా విభజించి, తెలుగు డేటాను ఈ ఐదుగురికీ ఇచ్చేవాడు. వీరిలో ఒక్కోక్కరూ ప్రతిరోజూ 180 నుంచి 200 కాల్స్ చేస్తూ బాధితులను నమ్మించే వారు. ఆపై ప్రాసెసింగ్ ఫీజు, టీడీఎస్, ఇన్‌కమ్ టాక్స్ చార్జీల పేరుతో డబ్బులు వసూలు చేసేవారు. అలా దోచుకున్న మొత్తం నుంచి ఈ నిందితులకు 30 శాతం కమీషన్ లభించేది. నగరానికి చెందిన ఓ మహిళ (36) గత ఏడాది నవంబర్ 6న ఇన్‌స్ట్రాగామ్‌లో లోన్ ప్రకటన చూసి ఆసక్త చూపారు. మరుసటి రోజు ఆమెకు ఓ ఫోన్ వచ్చింది. ‘ముద్రా లోన్ సర్వీసెస్’ అధికారి కిలా పవనర్ కుమార్‌గా పరిచయం చేసుకున్న మోసగాడు... ఆమె పేరు మీద రూ.3 లక్షల రుణం మంజూరైందని చెప్పాడు. ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు అవసరం లేదని నమ్మించి, అర్హత కోసం ఆధార్, పాన్‌కార్డ్ వివరాలు తీసుకున్నాడు. ఆపై ఇన్సూరెన్స్ ఛార్జీల పేరుతో రూ.7,200, టీడీఎస్ పేరుతో రూ.15 వేలు డిమాండ్ చేశాడు. ఇలా రకరకాల పేర్లు చెప్పి రూ.1,08,274 వసూలు చేశాడు. దీంతో బాధితురాలు తనకు లోన్ వద్దని... ఇప్పటికి ఇచ్చిన సొమ్ము తిరిగి ఇవ్వాలని కోరగా, క్యాన్సిలేషన్ ఫీజు పేరుతో మరింత మొత్తం డిమాండ్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేశారు. ఇన్‌స్పెక్టర్ పి.శివచంద్ర నేతృత్వంలోని బృందం ఐదుగురినీ అరెస్టు చేసింది. వీరి నుంచి ఎనిమిది ఫోన్లు, పది సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకుంది.
సైబర్ సూత్రధారుల పంథా వెలుగులోకి
గుట్టురట్టు చేసిన
సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు


