ముగిసిన పుర పోరు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన పుర పోరు

Feb 12 2026 11:35 AM | Updated on Feb 12 2026 11:35 AM

ముగిసిన పుర పోరు

ముగిసిన పుర పోరు

పోలింగ్‌ కేంద్రాల వద్ద

బారులు తీరిన ఓటర్లు

షాద్‌నగర్‌లో 76.24 శాతం పోలింగ్‌

షాద్‌నగర్‌, షాద్‌నగర్‌ రూరల్‌: చిన్నపాటి సంఘటనలు మినహా షాద్‌నగర్‌లో పురపాలిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పట్టణంలోని 10వ వార్డు పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు వాదనలకు దిగారు. 15వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్ధి భర్త సాధిక్‌ పోలింగ్‌ కేంద్రంలోకి ఎందుకు వెళ్తున్నాడని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మహేశ్వరి భర్త నరేందర్‌ వాగ్వాదానికి దిగారు. 9వ వార్డులో హాజిపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రం వద్ద దొంగ ఓట్లు వేయిస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు బీజేపీ నేతలతో గొడవకు దిగారు. ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ విజయ్‌కుమార్‌ వెంటనే ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్దకు చేరుకుని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్‌ పూర్తయింది.

దొంగ ఓట్లు వేశారని ఆరోపణ

పట్టణంలోని 8వ, 9వ వార్డుల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో దొంగ ఓట్లు వేయిస్తున్నారని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, స్వతంత్ర అభ్యర్థులు వారి తరఫు నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకుని వాగ్వాదానికి దిగారు. 9వ వార్డులో బిహార్‌ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ తన ఓటు వేరే వాళ్లు వేశారని, చాలెంజ్‌ ఓటు వేస్తామని చెప్పి పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లేందుకు యత్నించడంతో కాంగ్రెస్‌ నేతలు అడ్డుకున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద వృద్ధులు, దివ్యాంగులకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

పోలింగ్‌ ఇలా..

ఉదయం 7–9 గంటల వరకు 11.84 శాతం పోలింగ్‌ నమోదవగా 11గంటలకు 32.05, ఒంటిగంట వరకు 52.43శాతం, 3వరకు 65.25, పోలింగ్‌ పూర్తయ్యే సరికి 76.24 శాతం నమోదైంది.

సీపీ పరిశీలన

పట్టణంలోని 1వ వార్డులో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాన్ని ఫ్యూచర్‌సిటీ కమిషనర్‌ సుధీర్‌బాబు పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రతా చర్యల గురించి డీసీపీ శిరీషను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బంది తగు సూచనలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement