పారా హుషార్‌! | - | Sakshi
Sakshi News home page

పారా హుషార్‌!

Nov 1 2026 4:31 AM | Updated on Nov 1 2026 4:31 AM

రిగ్గింగ్‌ ఆపాలంటూ తిరుపతిలో ఫ్లెక్సీలు నేటి పోలింగ్‌పై రకరకాలుగా పుకార్లు ఓటర్లను స్వేచ్ఛగా ఓట్లు వేయనివ్వరంటూ ప్రచారం రాత్రంతా జోరుగా సాగిన డబ్బులు.. మద్యం పంపిణీ

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ఓటర్లు పారా హుషార్‌ అంటూ సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు.. ఫ్లెక్సీలు హోరెత్తితుతున్నాయి. స్థానిక మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ గూండాలు ఓటర్లను స్వేచ్ఛగా ఓట్లు వేయనివ్వకుండా వాళ్లే రిగ్గింగ్‌ చేసుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది. తిరుపతి నగరంలో పలుచోట్ల ‘ఎస్పీ సార్‌.. తిరుపతిలో రిగ్గింగ్‌ను అరికట్టండి.. ఇట్లు తిరుపతి ప్రజలు’ అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనం. పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుపతి, నాయుడుపేట, సూళ్లూరుపేట, నగరి, కుప్పం మున్సిపల్‌ ఎన్నికలపై జనంలో తీవ్ర ఆందోళన నెలకొంది. నామినేషన్ల సందర్భంగా పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐ అభ్యర్థులను అడ్డుకున్న విషయం తెలిసిందే. నామినేషన్‌ పత్రాలు లాగేసుకుని చించివేసిన ఘటనలు అనేకం. ఆ తరువాత కూడా పరిశీలన, ఉప సంహరణలోనూ పోలీసులు, ఆర్వోలు ఏకపక్షంగా వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తాయి. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో ఇప్పటికీ వైరల్‌ అవుతూనే ఉన్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలతో తిరుపతి నగరంలో నామినేషన్లు వేయలేకపోయిన 18 డివిజన్లకు తిరిగి నామినేషన్లు వేయగలిగారు. ఓటమి భయంతో టీడీపీ గూండాలు తిరుపతిలోని 39వ వార్డు సీపీఐ అభ్యర్థి కుసుమరాయల్‌ భర్తను కిడ్నాప్‌ చేశారనే ఆరోపణలతో నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు. నాయుడుపేటలో సాక్షాత్తు పోలీసులే వైఎస్సార్‌సీపీ నాయకుని నివాసంలోకి చొరబడి మద్యం బాటిళ్లు ఉంచి చట్టానికే మాయని మచ్చ తెచ్చిన ఘనత జిల్లా పోలీసులకే దక్కుతుంది. ఇలా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో గత కొద్దిరోజులుగా జరిగిన ఘటనతోనే ఇటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, సోషల్‌ మీడియా వేదికగా వైరల్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలింగ్‌ ప్రారంభమైన వెంటనే లేదా మధ్యాహ్నం భోజనం తరువాత రిగ్గింగ్‌కు పాల్పడేందుకు టీడీపీ నేతలు పక్కా ఏర్పాట్లు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రిగ్గింగ్‌ జరిగే అవకాశం లేకపోతే బ్యాలెట్‌ పెట్టెలు ఎత్తుకెళ్లేందుకు కూడా పథకం రచించినట్లు నగరంలో జోరుగా చర్చ జరుగుతోంది.

రాత్రంతా ప్రలోభాల జోరు

ఆదివారం పోలింగ్‌ ఉండడంతో శనివారం రాత్రి నుంచి ఆదివారం వేకువ జాము వరకు కూటమి అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.వేల వరకు పంపిణీ జరిగింది. ఇంకా మద్యం, బిరియానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కూటమికి ఓటు వేయరని అనుమానం ఉన్న వారిని బెదిరింపులకు గురిచేయడం ప్రారంభించారు. డ్వాక్రా గ్రూపులను లీడ్‌చేసే కొంత మంది సభ్యులను కూటమి అభ్యర్థులు నివాసాలకు పిలిపించి.. మరి కొందరు వారి వారి నివాసాలకే వెళ్లి రకరకాల చీరలు, జాకెట్లు, గాజులు పంపిణీ చేయటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement