చిత్తూరు కార్పొరేషన్ : చిత్తూరులోని జిల్లా జైలులో ఉన్న పుంగనూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులను రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి శనివారం పరామర్శించారు. స్థానిక సంస్థలకు నామినేషన్ వేయడానికి అభ్యర్థులతో కలిసి వెళ్లిన ఎంపీ మిథున్‌రెడ్డి, చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్పతో పాటు మొత్తం 400 మంది నేతలు, కార్యకర్తలపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అందులో పుంగనూరు నియోజకవర్గం నుంచి 16 మంది అరెస్టు చేశారు. వారిని మిథున్‌రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రాహుల్‌రెడ్డి, నేతలు చక్రి, రాజేష్, ప్రసన్న, ఆలీ, దేవరాజులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా పోలింగ్
నిర్వహణే లక్ష్యం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రజలు సేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సంఘం పేర్కొన్న 12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్లాలని సూచించారు. రెండు బ్యాలెట్ పత్రాలు ఇస్తారని, గులాబీరంగు పత్రం మేయర్ అభ్యర్థికి, తెలుపురంగు పత్రంపై కార్పొరేటర్ అభ్యర్థికి ఓటు వేయాలని తెలిపారు. ఆ తర్వాత వాటిని ఒకే బాక్సులో వేయాలన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలుగా గుర్తించిన విద్యాసంస్థలకు ఈ నెల 3 వ తేదీన సెలవు ఇస్తున్నట్లు తెలిపారు.
గుర్తింపు కార్డులు ఇవే..
ఓటర్లు తమ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, పోస్టాఫీసు పాస్‌బుక్, జాబ్‌కార్డు, ఆరోగ్య బీమా కార్డు, పింఛన్‌పత్రం, సర్వీస్ ఐడీకార్డు, ఎన్‌పీఆర్ స్మార్ట్ కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికారిక గుర్తింపు కార్డు, దివ్యాంగుల కార్డుల్లో ఏదైనా ఒకటి చూపి ఓటు వేయవచ్చని కలెక్టర్ వివరించారు.
పోలీసుల తీరుపై విచారణకు ఆదేశించిన ఎస్‌ఈసీ
తిరుపతి మంగళం : స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన హింస, నామినేషన్ల అడ్డగింతలు, అభ్యర్థులకు బెదిరింపులు, పోలీసుల పక్షపాత వైఖరిపై తాను చేసిన ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) స్పందించిందని తిరుపతి వైఎస్సార్‌సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి తెలిపారు. తాను గవర్నర్‌కు సమర్పించిన ఫిర్యాదులను గవర్నర్ కార్యాలయం ఎస్‌ఈసీకి పంపగా, పోలీసు అధికారులపై వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరపి, 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని ఎస్‌ఈసీ ఆదేశించిందని చెప్పారు. ఈమేరకు అక్టోబర్ 29న డీజీపీకి లేఖ పంపిందన్నారు. ఈ విచారణ నిష్పక్షపాతంగా జరగాలని, తప్పు చేసినట్లు తేలిన అధికారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పుంగనూరు, పులివెందుల, కమలాపురం, బద్వేల్, రాజంపేట, యరగ్రుంట్ల తదితర ప్రాంతాల్లో జరిగిన హింస, నామినేషన్ల అడ్డగింతలు, అభ్యర్థులను బెదిరించడం వంటి ఘటనలను తన ఫిర్యాదులో తెలిపానన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు పోలీసు ఉన్నతాధికారుల రాజకీయ పక్షపాత ధోరణి కారణంగా శాంతిభద్రతల పరిరక్షణలో లోపాలు తలెత్తాయని పేర్కొన్నట్లు వివరించారు. ముఖ్యంగా డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి, కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తీరుపై తాను లేవనెత్తిన అంశాలను కూడా విచారణ పరిధిలోకి తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో పోలీసు అధికారుల బదిలీలకు గతంలో జారీ చేసిన నిబంధనలు, 2019లో ఇచ్చిన బదిలీ ఉత్తర్వుల నేపథ్యంలో డీఐజీ కోయ ప్రవీణ్ నియామకంపై కూడా సమీక్షించాలని కోరినట్లు తెలిపారు. అంతేకాకుండా, అక్టోబర్ 15న హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని కూడా తెలిపానన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాడుతుందని ఎంపీ మద్దిల గురుమూర్తి చెప్పారు.


